చెరువు మట్టి తవ్వకాల్లో రాజకీయ వివక్ష తగదు

రైతులందరికీ సమానంగా అవకాశం కల్పించాలి

ఆత్మకూరు డీఎస్పీకి మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఫిర్యాదు

ఆత్మకూరు: చెరువుల్లో మట్టి తోలుకునే విషయంలో రాజకీయ వివక్ష చూపకుండా గ్రామాల్లోని రైతులందరికీ సమానంగా అవకాశం కల్పించాలని శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కోరారు. ఈ మేరకు రైతులతో కలిసి ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇందిరేశ్వరం, శ్రీపతిరావుపేట గ్రామాలకు చెందిన మాచవీరప్ప చెరువు, పద్మరాజ చెరువుల్లో గతంలో పార్టీలకు అతీతంగా రైతులందరూ తమ ట్రాక్టర్లతో మట్టి తోలుకునేవారని తెలిపారు. అయితే గత పది రోజులుగా టీడీపీ నాయకులు, నీటి సంఘాల ప్రతినిధులు వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన వారి ట్రాక్టర్లను మట్టి తోలనివ్వకుండా అడ్డుకుంటున్నారని రైతులు ఫిర్యాదు చేశారు.

చెరువు మట్టి విషయంలో రాజకీయాలకు తావివ్వకుండా ట్రాక్టర్లు ఉన్న రైతులందరికీ సమానంగా అనుమతి ఇవ్వాలని శిల్పా చక్రపాణిరెడ్డి కోరారు. ఒకవేళ అందరికీ అవకాశం కల్పించలేని పరిస్థితి ఉంటే పక్షపాతం లేకుండా మట్టి తరలింపును పూర్తిగా నిలిపివేయాలని డీఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల, పట్టణ వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
 

Back to Top