విజయవాడ నగర సమస్యలను వెంటనే పరిష్కరించాలి

పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేసిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు

విజయవాడ: నగరంలో పేరుకుపోయిన తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రోడ్లు, గృహాలు తదితర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు కోరారు. పీజీఆర్‌ఎస్‌లో భాగంగా అసిస్టెంట్ కమిషనర్ రవీంద్రరావుకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు వినతిపత్రం అందజేశారు. నగరంలో పారిశుద్ధ్య పరిస్థితులు దిగజారడంతో డయేరియా కేసులు నమోదవుతున్నాయని, చిన్నపాటి వర్షానికే పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమవుతున్నాయని నేతలు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన వాటర్ ట్యాంకులు, కమ్యూనిటీ హాళ్లు తదితర అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. వీఎంసీ స్థలాల ఆక్రమణలు, అక్రమ లేఅవుట్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విజయవాడను నిర్లక్ష్యం చేస్తున్నారు: వెలంపల్లి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. గత ప్రభుత్వంలో మంజూరైన పనులను కూడా పూర్తి చేయడం లేదన్నారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లను అర్హులైన పేదలకు కేటాయించాలని, పారిశుద్ధ్యం మెరుగుపరచడంతో పాటు కమ్యూనిటీ హాళ్లు, వాటర్ ట్యాంకుల నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు.

నగరాభివృద్ధి నిలిచిపోయింది: దేవినేని అవినాష్

విజయవాడ నగరంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని దేవినేని అవినాష్ అన్నారు. కొండ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వర్షం వస్తే అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోతోందన్నారు. పార్కుల నిర్వహణను గాలికొదిలేశారని, టౌన్ ప్లానింగ్ వ్యవహారాల్లో వస్తున్న ఆరోపణలపైనా అధికారులు దృష్టి పెట్టాలని కోరారు.

 జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లను పేదలకే ఇవ్వాలి: మల్లాది విష్ణు 

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో సిద్ధం చేసిన సుమారు మూడు వేల జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లను అర్హులైన పేదలకు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. అనర్హులకు ఇప్పటికే కేటాయించిన ఇళ్లను రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని, అక్రమ లేఅవుట్లపై టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్లు కేటాయించకపోతే కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మాజీ డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శైలజారెడ్డి, మాజీ కార్పొరేటర్లు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

Back to Top