రాష్ట్రంలో రాక్షస పాలన.. ఏంటీ దౌర్జన్యం చంద్రబాబూ?

కమీషన్ ఇవ్వలేదనే వెంచర్‌ను జేసీబీలతో ధ్వంసం చేశారా? 

ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఫైర్ 

క‌ర్నూలు జిల్లా: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యాలు, బెదిరింపులు పెరిగిపోయాయని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మండిపడ్డారు. ఆస్పరి మండలం బిల్లేకల్లు గ్రామంలో టీడీపీ నేతల దాడిలో ధ్వంసమైన లక్ష్మన్నకు చెందిన వెంచర్‌ను వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విరుపాక్షి మాట్లాడుతూ, ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటేష్ అడిగిన వాటా ఇవ్వలేదనే కారణంతో తన అనుచరులను పంపించి జేసీబీలు, ట్రాక్టర్లతో లక్ష్మన్న వెంచర్‌ను దున్నేశారని ఆరోపించారు. తాము అడిగిన వాటా చెల్లిస్తేనే వెంచర్ వేసుకోవాలని, లేదంటే ఇబ్బందులు తప్పవనే రీతిలో బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో అనధికారిక ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజల ప్రాథమిక హక్కులను కూడా కాలరాస్తున్నారని విరుపాక్షి విమర్శించారు. అధికార పార్టీ నేతలే గుండాయిజానికి పాల్పడుతూ తమ ఆగడాలను ప్రశ్నించిన వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. ‘ఏంటీ దౌర్జన్యకాండ చంద్రబాబూ? ప్రజల ఆస్తులను ఇలా ధ్వంసం చేసే హక్కు ఎవరిచ్చారు?’’ అని ప్రశ్నించారు. ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజల ఆస్తులు, ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించాలని ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి డిమాండ్ చేశారు.
 

Back to Top