తాడేపల్లి: డీఎస్సీ స్కాంపై మంత్రి నారా లోకేశ్ చేస్తున్న సవాళ్లు ఉత్తర కుమార ప్రగల్భాల మాదిరిగా ఉన్నాయని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ నేత పేర్ని నాని పేర్కొన్నారు. డీఎస్సీ స్కాం జరిగిన తీరును ఆధారాలతో సహా ఇప్పటికే ప్రజల ముందుంచామని, దీనిపై తనతో బహిరంగ చర్చకు లోకేశ్ సిద్ధమా అని సవాల్ విసిరారు. డీఎస్సీ స్కాంను బయటపెట్టి చాలా రోజులు గడిచిందని పేర్ని నాని గుర్తుచేశారు. డీఎస్సీలో జరిగినట్లు చెబుతున్న అక్రమాలు, వాటి వెనుక సాగిన ‘డార్క్ ఆపరేషన్’కు సంబంధించిన అంశాలను వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమగ్రంగా ప్రజల ముందుంచారని తెలిపారు. ప్రతి పాయింట్‌కూ ఆధారాలు చూపించినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇప్పటివరకు వాటికి సమాధానం చెప్పేందుకు ముందుకు రాలేదన్నారు. ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన వైయస్ జగన్‌ను చర్చకు రావాలంటూ ప్రస్తుతం మంత్రిగా ఉన్న లోకేశ్ పిలవడం అర్థరహితమని పేర్ని నాని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రిగా లోకేశ్‌తో సమాన స్థాయిలో తాను కూడా పనిచేశానని, అందువల్ల డీఎస్సీ అంశంపై చర్చకు తామిద్దరం సమ ఉజ్జీలమేనని స్పష్టం చేశారు. డీఎస్సీ స్కాంపై లోకేశ్‌తో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్ని నాని సవాల్ చేశారు. ‘‘టైమ్, తేదీ, ప్లేస్ లోకేశ్ చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే. డీఎస్సీపై నాతో చర్చకు లోకేశ్ సిద్ధమా?’’ అని ప్రశ్నించారు. తన సవాల్‌పై లోకేశ్ సమాధానం కోసం ఎదురుచూస్తున్నానని పేర్ని నాని పేర్కొన్నారు.