మచిలీపట్నం: డిఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన సవాల్ కు మంత్రి నారా లోకేష్ సిద్ధంగా ఉంటే.. చర్చకు రావాలని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) డిమాండ్ చేశారు. లోకేష్ కి చేతకాకపోతే సమయం, తేదీ, వేదిక తామే నిర్ణయిస్తామన్న నాని.. డిఎస్సీపై చర్చించడానికి సీఎం చంద్రబాబు నాయుడు వస్తే.. వైయస్సార్సీపీ తరపున పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్.జగన్ వస్తారని... లేని పక్షంలో నారా లోకేష్ చర్చకు సిద్ధంగా ఉంటే తానే చర్చకు వస్తానని స్పష్టం చేశారు. డిఎస్సీలో అక్రమాలు జరగలేదన్న ధైర్యం ఉంటే... తన సవాల్ ని స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పేర్ని వెంకట్రామయ్య(నాని) ఇంకా ఏమన్నారంటే.. - అన్నింటికీ నేనే అంటూ డబ్బాలు... రాష్ట్రంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖను వదిలేసి, అన్ని విషయాల్లో 'నేనే... నేనే' అని డబ్బాలు కొట్టుకోవడం లోకేష్‌కు అలవాటైపోయింది. డిఎస్సీలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే ఆయన నాలుగు గోడల మధ్య టీడీపీ కార్యకర్తలతో చప్పట్లు కొట్టించుకుంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. ప్రశ్నాపత్రం తయారు చేయడం, పరీక్ష పెట్టడం, పేపర్లు దిద్దడం, ఉద్యోగాలు పిలవడం... అన్నీ ఒక్క అధికారినే ముందు పెట్టి ఏకపక్షంగా నడిపించిన ఈ డొల్ల డిఎస్సీ పారదర్శకం అని ఎలా చెప్తారు? - డిఎస్సీలో అడుగగుడునా అక్రమాలే... ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జిల్లా సెలెక్షన్ కమిటీ జాబితాలను కలెక్టరేట్ల వద్ద ఎందుకు ప్రదర్శించలేదు? 1:1 నిష్పత్తిలో మెరిట్ సర్టిఫికెట్లు వెరిఫై చేసిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఎందుకు నిరాకరించారు? సమాధానం చెప్పాలి. అన్నింటికంటే ఘోరం ఏంటంటే... జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను పక్కన పెట్టి, టెట్ మరియు డిఎస్సీ పరీక్షలు రాయని వారికి, నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఉన్నవారికి టీచర్ ఉద్యోగాలు కట్టబెట్టారు. దీనికోసం రిక్రూట్‌మెంట్ ముందు జీవో ఇచ్చి, ప్రక్రియ ముగిశాక మళ్లీ జీవో మార్చారు. ఇలా ఎందుకు మార్చారో సమాధానం చెప్పాలి? - విచారణకు ఆదేశిస్తే.. పదవిలో ఎలా కొనసాగుతారు? స్పోర్ట్స్ కోటా రిక్రూట్‌మెంట్ మొత్తంపైన, ఇందులో జరిగిన అక్రమాలపైన కోర్టు విచారణకు ఆదేశించింది. తన శాఖలో జరిగిన తప్పుడు నియామకాలపై కోర్టు ఎంక్వైరీ వేసిన తర్వాత నారా లోకేష్ ఇంకా ఏ మొఖం పెట్టుకుని పదవిలో ఉంటారని పేర్ని నాని ప్రశ్నించారు. ఢిల్లీలో విద్యాశాఖ మంత్రి అవినీతి ఆరోపణలతో రాజీనామా చేసినట్లే, నారా లోకేష్ కూడా తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని.. డిఎస్సీ అక్రమాలపై సిట్టింగ్ న్యాయమూర్తితో నిష్పాక్షిక విచారణ జరిపించి, దోషులను జైలుకు పంపాలని డిమాండ్ చేశారు.