డీఎస్సీపై సీబీఐ విచారణకు ఎందుకు వెనుకడుగు?

నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి 

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేతల వినతిపత్రం

రాజమహేంద్రవరం : డీఎస్సీ–2025 నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ నేతలు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతిని అమలు చేయాలని కోరారు.

మెగా డీఎస్సీ పేరుతో చేపట్టిన 16 వేలకుపైగా టీచర్ పోస్టుల నియామకాల్లో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు. డీఎస్సీ కన్వీనర్‌ను పక్కనపెట్టి ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కు అప్పగించడంతో పాటు అత్యంత రహస్యమైన ప్రశ్నపత్రాల డిజిటల్ ప్రక్రియలో ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని భాగస్వాములను చేయడం అనేక అనుమానాలకు తావిచ్చిందన్నారు. ప్రశ్నపత్రాల వ్యవస్థలో పనిచేసిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించడం, ఆ తర్వాత అతని పేరును మెరిట్ జాబితా నుంచి తొలగించడం వంటి అంశాలపై సమగ్ర విచారణ అవసరమని పేర్కొన్నారు.

స్పోర్ట్స్ కోటా నిబంధనలు ఎందుకు మార్చారు?

స్పోర్ట్స్ కోటా కింద 421 ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో నిబంధనలను మార్చి రాత పరీక్ష లేకుండానే నియామకాలు చేపట్టారని ఆరోపించారు. గతంలో 2 శాతంగా ఉన్న స్పోర్ట్స్ కోటాను 3 శాతానికి పెంచడంతో పాటు ప్రత్యేక జీవోల ద్వారా పోటీ పరీక్షను తొలగించి, నియామకాలు పూర్తయ్యాక తిరిగి పరీక్షను తప్పనిసరి చేస్తూ మరో జీవో జారీ చేయడం వెనుక కారణాలేంటని ప్రశ్నించారు.

జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను పక్కనపెట్టి, జిల్లా, యూనివర్సిటీ స్థాయిలో పాల్గొన్న సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరసారాలు జరిగినట్లు ఆడియో, వీడియో ఆధారాలు బయటకు వచ్చాయని పేర్కొన్నారు. ఇన్ని ఆరోపణలు ఉన్నప్పుడు స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు.

లోకేష్ రాజీనామా చేయాలి

దాదాపు 3.5 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఉపాధ్యాయ నియామకాల్లో పారదర్శకత అత్యంత ముఖ్యమని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. డీఎస్సీ–2025లో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం చెబుతున్నప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

విద్యాదీవెన, వసతిదీవెన రూ.9,500 కోట్ల బకాయిలు చెల్లించాలి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు భారీగా పేరుకుపోయాయని పేర్కొన్నారు. తమ లెక్కల ప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.6,200 కోట్లు, వసతిదీవెన కింద రూ.3,300 కోట్లు కలిపి మొత్తం రూ.9,500 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఫీజులు చెల్లించకపోవడంతో కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితులు నెలకొన్నాయని, ప్రభుత్వం వెంటనే మొత్తం బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

నిరుద్యోగ భృతిని బకాయిలతో సహా ఇవ్వాలి

ఎన్నికల సమయంలో ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని కూటమి హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ హామీని వెంటనే అమలు చేసి, ప్రతి నిరుద్యోగికి రావాల్సిన భృతిని బకాయిలతో సహా చెల్లించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సత్తి సూర్యనారాయణరెడ్డి, తలారి వెంకట్రావు, నాగులపల్లి ధనలక్ష్మి, రాజమండ్రి పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు దూలం వెంకన్నబాబు, కర్రి పాపారాయుడు, సబ్బళ్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Back to Top