పోలవరం కుడి కాలువ రైతులకు వెంటనే విద్యుత్‌ పునరుద్ధరించాలి

 సగం ఖరీఫ్‌ పూర్తయ్యాక విద్యుత్‌ నిలిపివేయడం తీవ్ర అన్యాయం

 మెట్ట భూములకు నీటి ఎత్తిపోతలపై శాశ్వత విధానం రూపొందించాలి

 ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లేఖ

కృష్ణా జిల్లా: పోలవరం కుడి ప్రధాన కాలువపై వ్యవసాయ పంపుసెట్లకు హఠాత్తుగా విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో వేలాది రైతు కుటుంబాల జీవనోపాధితో పాటు ఖరీఫ్‌ పంటలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ పంపుసెట్లు, విద్యుత్‌ సరఫరాను క్రమబద్ధీకరించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు.

గన్నవరం నియోజకవర్గంతో పాటు పోలవరం కుడి ప్రధాన కాలువ పరివాహక ప్రాంతంలోని మెట్ట గ్రామాల రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల కుటుంబాలు కాలువ నీటిపైనే ఆధారపడి జీవిస్తున్నాయని వంశీ తెలిపారు. సీతారామపురం, మర్రిబంధం, రేమల్లె, వేలేరు, రంగన్నగూడెం, సింగన్నగూడెం, శోభనాద్రిపురం, బండారుగూడెం, బల్లిపర్రు, తెంపల్లి, గొల్లనపల్లి, బీబీ గూడెం, పురుషోత్తపట్నం, గోపవరపుగూడెం, కొండపావులూరు, సూరంపల్లి, రామచంద్రపురం, నున్న, పాతపాడు, పి.నైనవరం తదితర గ్రామాల్లోని మెట్ట భూములకు సాగునీరు అందాలంటే మోటార్ల ద్వారా కాలువ నీటిని ఎత్తిపోసుకోవడమే మార్గమని వివరించారు.

2015లో ముఖ్యమంత్రిగా చంద్రబాబే కాలువ నీటిని రైతులు ఎత్తిపోసుకునేందుకు అంగీకరించారని గుర్తుచేశారు. గత 12 ఏళ్లుగా రైతులు పట్టిసీమ, పోలవరం కాలువ నీటిని మోటార్ల ద్వారా వినియోగించుకుని పంటలు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇదంతా నీటిపారుదల, రెవెన్యూ, విద్యుత్‌ శాఖల పర్యవేక్షణలోనే బహిరంగంగా కొనసాగిందన్నారు. దీనిపై నమ్మకంతో రైతులు విద్యుత్‌ కనెక్షన్లు, పైప్‌లైన్లు, మోటార్లు, విత్తనాలు, ఎరువుల కోసం లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడంతో పాటు పంట రుణాలు కూడా తీసుకున్నారని వివరించారు.

ఖరీఫ్‌ సీజన్‌ సగం పూర్తయిన తర్వాత అకస్మాత్తుగా విద్యుత్‌ నిలిపివేయడం రైతులకు తీవ్ర అన్యాయం చేయడమేనని వంశీ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు నీటిపారుదల, రెవెన్యూ శాఖల సమక్షంలో విద్యుత్‌ కనెక్షన్లు తొలగించినట్లు ఏపీసీపీడీసీఎల్‌ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ లేఖ ద్వారా తెలిపారని పేర్కొన్నారు. రైతులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, వారి వివరణ కూడా తీసుకోకుండా కనెక్షన్లు తొలగించడం సరికాదన్నారు.

జూన్‌ నుంచి కాలువకు నీరు విడుదల చేస్తామని ప్రకటించి రైతులను సాగుకు సిద్ధం కావాలని కోరిన ప్రభుత్వమే ఇప్పుడు విద్యుత్‌ సరఫరాను నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తక్షణమే కలెక్టర్‌ ఉత్తర్వుల అమలును నిలిపివేసి, ఖరీఫ్‌ పంటలను కాపాడేందుకు వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రిని కోరారు.

నీటిపారుదల నిపుణులు, సంబంధిత శాఖల అధికారులు, రైతు ప్రతినిధులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి కాలువలో నీటి ప్రవాహం, పంటల అవసరాల ప్రాతిపదికన శాస్త్రీయ నీటి పంపిణీ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. పోలవరం కుడి కాలువ నుంచి మెట్ట భూములకు నీటిని ఎత్తిపోసుకునే అంశంపై స్పష్టమైన, శాశ్వత విధానాన్ని రూపొందించి ఖరీఫ్‌, రబీ సాగునీటి షెడ్యూళ్లలో చేర్చాలని కోరారు.

విద్యుత్‌ నిలిపివేత కారణంగా ఇప్పటికే ఎండిపోయిన పంటలను రెవెన్యూ, వ్యవసాయ శాఖల ద్వారా పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాలని, బాధిత రైతులకు తగిన పరిహారం అందించాలని వల్లభనేని వంశీ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కోరారు.

Back to Top