అమలాపురం: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో అమలాపురంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నల్లవంతెన వద్ద వంటెద్దు వెంకయ్యనాయుడు కాంప్లెక్స్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. డీఎస్సీ పరీక్షలు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో అవకతవకలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన తదితర అంశాలపై విద్యార్థులు, యువత నినాదాలతో హోరెత్తించారు. రామచంద్రపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో హామీ ఇచ్చిన నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాల కల్పనలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. మెగా డీఎస్సీ పరీక్షలు, ఎంపిక ప్రక్రియలో అవకతవకలు, నకిలీ సర్టిఫికెట్ల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను పదవి నుంచి తొలగించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, కడుపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయిల్, సమన్వయకర్తలు పాముల రాజేశ్వరి, గన్నవరపు శ్రీనివాసరావు, పొన్నాడ సతీష్, పినిపే శ్రీకాంత్, మాజీ ఎంపీ చింతా అనురాధతో పాటు జిల్లా, నియోజకవర్గ నాయకులు, విద్యార్థులు, యువత, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.