నెల్లూరు: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అరాచకాలకు, పోలీసుల లాకప్ హత్యలకు మారుపేరుగా మారిందని వైయస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో జరిగిన మనుబోలు లాకప్ డెత్, బుచ్చిరెడ్డిపాలెం ఏఓ శ్రీహరి హత్య ఉదంతాలే ఇందుకు సజీవ సాక్ష్యాలని, పోలీసుల వైఫల్యాలు మరియు అధికార పార్టీ నేతల ప్రమేయంపై తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. బాధ్యులైన అధికారులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి, బాధిత కుటుంబాలను ఆదుకోకపోతే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... మనుబోలు నిందితుడు ఏడుకొండలది ముమ్మాటికీ ‘సర్కారీ హత్యే’ నెల్లూరు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా మనుబోలు పోలీస్ స్టేషన్‌లో జరిగిన నిందితుడు ఏడుకొండల మృతి ముమ్మాటికీ లాకప్ డెత్. జిల్లా ఎస్పీ వాస్తవాలను వక్రీకరిస్తూ నిందితుడు స్టేషన్‌లోనే లేరని, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడం అబద్ధం. శని, ఆదివారాలు (11, 12 తేదీల్లో) ఏడుకొండలు, రియాజ్, ప్రసాద్‌లను పోలీసులు విపరీతంగా కొట్టారు. ఆదివారం సాయంత్రం వదిలి పెట్టి, ప్రసాద్, రియాజు సోమవారం మరలా స్టేషన్ కి వెళ్లారు. 13, 14 తేదీల్లో వాళ్లు స్టేషన్‌లో లేరని ఎస్పీ గారు చెబుతుంటే, సదరు తేదీల్లో వాళ్లు ఎక్కడున్నారో తెలిపే పూర్తి సిసిటివీ ఫుటేజీలను మీడియా ముందు ఎందుకు పెట్టడం లేదు. చనిపోవడానికి ముందు ఏడుకొండలు తన సోదరి ధనమ్మ వద్ద ఏడుస్తూ, పోలీసులు తనను "విమానం" (రెండు చేతులు వెనక్కి కట్టి పైకి లాగడం) అనే థర్డ్ డిగ్రీ ప్రయోగించి విపరీతంగా కొట్టారని, ఆ దెబ్బలు తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. పోస్ట్‌మార్టంకు ముందు బాడీని స్వయంగా పరిశీలించాను, ఏడుకొండల నోటి నుంచి ఎక్కడా నురగ రాలేదు, కానీ ఒంటిపై బురద మరకలు, కాళ్లు మరియు వెనుక భాగంలో తీవ్రమైన దెబ్బలు ఉన్నాయి, కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయింది, ఒక వేలు విరిగిపోయి ఉంది.( ఫోటోలతో సహా మీడియా ముందు ప్రదర్శంచిన కాకాణి గోవర్ధన్ రెడ్డి) సాక్ష్యాల తారుమారు — వెంకటాచలం పోలీస్ స్టేషన్ హైడ్రామా: 14వ తేదీ రాత్రి కానిస్టేబుల్ మాధవ్ అనే వ్యక్తి మరో నిందితుడు రియాజ్‌ను అదుపులోకి తీసుకుని, రహస్యంగా వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో పెట్టి, పోలీసులకు అనుకూలంగా వాంగ్మూలాలు రాయించుకుని సంతకాలు చేయించుకున్నారు. వీటికి బాధ్యుడైన ఎస్ఐ, పోలీసులను కాపాడేందుకు టీడీపీ స్థానిక నాయకుడు సుధీర్, మృతుడి అక్క ధనమ్మతో ఫోన్‌లలో మాట్లాడి, ఆర్థిక సహాయం చేస్తామని, ఎమ్మెల్యే సోమిరెడ్డితో మాట్లాడి న్యాయం చేస్తామని ప్రలోభపెట్టిన ఆడియో రికార్డు కూడా ఉంది. సాక్ష్యాలను తారుమారు చేయాలని చూస్తున్న సదరు టీడీపీ నేతలపై కూడా కేసు నమోదు చేయాలి. ఏడుకొండల లాకప్ డెత్‌కు కారణమైన పోలీసు అధికారులపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. మృతుడి కుటుంబానికి రూ. 1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలి. బుచ్చిరెడ్డిపాలెం దారుణం: సీఐ లంచాల దాహానికి ఒకే కుటుంబం బలి. మరోవైపు జూన్ 15న బుచ్చిరెడ్డిపాలెంలో అగ్రికల్చర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శ్రీహరి అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. ఒంటి నిండా గాయాలున్నాయి. అయితే అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) శ్రీనివాసరావు రూ. 40 లక్షల డీల్ మాట్లాడుకుని, పోస్ట్‌మార్టం కూడా చేయకుండా కేసును యాక్సిడెంట్‌గా చిత్రీకరించి మూసేశారు. అంటే వ్వవస్ధ ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్తాడా? హోంమంత్రి చెబుతుందా? డీజీపీ చెబుతారా? తన భర్త మరణంపై అనుమానం వచ్చి, తన అన్న చంపేశాడని శ్రీహరి భార్య జూన్ 15 న పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. సీఐ దాన్ని కనీసం తీసుకోలేదు. దీంతో గత్యంతరం లేక జిల్లా ఎస్పీని ఆశ్రయించిన తర్వాత దానిపై విచారణకు ఆదేశిస్తే... జూలై 9న ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే సామూహిక ఆత్మహత్య జరిగింది. వాస్తవానికి శ్రీహరి భార్య ఎస్పీ గారికి ఫిర్యాదు చేసిన 25 రోజుల తర్వాత గానీ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఈ లోగా నిందితుడు తాను తప్పు చేయలేదని, అవమానాలు భరించలేక చనిపోతున్నానని వీడియో విడుదల చేసినా పోలీసులు నిఘా పెట్టలేదు. ఫలితంగా మనస్తాపానికి గురైన ఆ కుటుంబం మొత్తం (హరికృష్ణ, భార్య ప్రణీత, పిల్లలు కౌశిక్, మోహన్) శంకరాయకొండ దగ్గర రైలు కింద పడి సామూహిక ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత దౌర్భాగ్యం. సదరు అవినీతి అధికారి వల్ల ఒక కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది, మరో కుటుంబం పూర్తిగా లేకుండా పోయింది. పోస్టింగుల కోసం లక్షల్లో లంచాలు - రాష్ట్రంలో నడుస్తోంది ‘రెడ్ బుక్ రాజ్యాంగం’. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా పట్టాలు తప్పింది. జిల్లాకు వచ్చే సిఐలు తాము లక్షల రూపాయలు ఇచ్చి పోస్టింగులు తెచ్చుకున్నామని, స్టేషన్‌కు వచ్చిన రోజు నుంచే వసూళ్లు ప్రారంభించకపోతే డబ్బులు ఎలా సర్దుతామని బహిరంగంగా మాట్లాడుకుంటున్నారన్నారు. పోలీస్ స్టేషన్లు ఈరోజు ప్రజలకు రక్షణ కల్పించే స్థానాలు కావు, అవి 'మృత్యు గుహలు'గా మారాయి. డబ్బులు మాత్రమే కాకుండా ఒంటి మీద నగలు కాజేసే స్థాయికి, మహిళలపై అరాచకాలకు పాల్పడే స్థాయికి వ్యవస్థ దిగజారిపోయింది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ వల్లే తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడినా కాపాడేవారు ఉన్నారనే ధీమాతో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటికైనా జిల్లా ఎస్పీ, ఉన్నతాధికారుల, ప్రభుత్వం ఒత్తిళ్లకు లొంగకుండా పారదర్శకంగా విచారణ జరిపి, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాధితుల తరపున వైఎస్సార్‌సీపీ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.