తాడేపల్లి: పిడుగురాళ్ల సీఐ శ్రీరాం వెంకట్రావు వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి షేక్ దరియా హుస్సేన్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగంతోపాటు రూ. కోటి పరిహారం ఇచ్చి ఆదుకోవాలని వైయస్ఆర్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. చనిపోవడానికి ముందు సెల్ఫీ వీడియో తీసుకోవడంతోపాటు సూసైడ్ నోటు రాసి ఉర్దూ అకాడమీలో లైబ్రేరియన్ గా పనిచేసే దరియా హుస్సేన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ వీడియోలో తన ఆత్మహత్యకు పిడుగురాళ్ల సీఐ శ్రీరాం వెంకట్రావుతోపాటు ఎఎస్సై, ఇతర కానిస్టేబుళ్లే కారణమని స్పష్టంగా చెప్పారు. పోలీసుల వేధింపులపై వైఎస్సార్సీపీ మైనారిటీ నాయకులు మీడియాకు వీడియోలు విడుదల చేశారు. దరియా హుస్సేన్ సెల్ఫీ వీడియోను డయింగ్ డిక్లరేషన్‌గా తీసుకుని హుస్సేన్ ఆత్మహత్యకు కారకులైన పొలీసులపై కేసులు నమోదు చేసి తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సివిల్ పంచాయతీలకు పోలీసులను వినియోగిస్తూ సామాన్యుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాడని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ధ్వజమెత్తారు. దరియా హుస్సేన్ ఆత్మహత్య తర్వాత, కేసు వెనక్కి తీసుకుని రాజీ చేసుకోవాల్సందిగా వారి కుటుంబంపై పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. దరియా హుస్సేన్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. శనివారం రోజున పార్టీ మైనారిటీ నాయకులతో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించనున్నట్టు కాసు మహేష్ రెడ్డి చెప్పారు. వారు ఇంకా ఏమన్నారంటే.. హుస్సేన్ కుటుంబాన్ని బెదిరిస్తున్నారు - కాసు మహేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దరియా హుస్సేన్ కుటుంబానికి నిన్న రాత్రి నుంచి బెదిరింపులు తీవ్రమయ్యాయి. పోలీసులే స్వయంగా వాళ్ళ ఇళ్లకు వెళ్లి... 'కేసు వెనక్కి తీసుకోండి, పోలీసులకు సంబంధం లేదని ప్రెస్ మీట్ పెట్టండి, సంతకాలు చేసి ఇవ్వండి' అని బెదిరిస్తున్నారు. 'ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పంపించారు, ఉన్నతాధికారులు చెప్తున్నారు... వినకపోతే మీ పిల్లల మీద కేసులు పెడతాం, వాళ్ల చదువులు నాశనం చేస్తాం' అని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. 'కేసు తన మీదకు వస్తే అందరి పేర్లు బయటపెడతా' అని సీఐ ఓపెన్‌గా చెప్తున్నాడు కాబట్టే, ఇప్పుడు ఎమ్మెల్యే యరపతినేని ఆయన్ని రక్షించాలని చూస్తున్నారు. హుస్సేన్ ఆత్మహత్య చేసుకునే ముందు రికార్డ్ చేసిన వీడియో ఉంది, సూసైడ్ నోట్ ఉంది. న్యాయవ్యవస్థ ప్రకారం 'డయింగ్ డిక్లరేషన్' (మరణవాంగ్మూలం) కంటే మించిన సాక్ష్యం లేదు. దాన్ని ఆధారంగా చేసుకుని కేసు పెట్టాల్సిన పోలీసులు... అసలు నిందితులైన సీఐ, ఎస్సైలను వదిలేసి, లక్ష్మి మీద, ఇంకొకరి పేరు మీదో కేసులు పెడతామంటున్నారు. ఈ కేసులో తెలుగుదేశం నాయకుల ప్రమేయం ఎవరెవరిది ఉందో బయట పడాలి. టీడీపీ నాయకులు 'హుస్సేన్ సామాన్యుడే కదా' అంటున్నారు. సామాన్య ముస్లిం యువకుడి ప్రాణానికి విలువ లేదా? ఉర్దూ అకాడమీ చైర్మన్ ఏమో స్థానిక ఎమ్మెల్యే న్యాయం చేస్తాడు అంటున్నారు. అసలు ఈ సివిల్ పంచాయితీలు చేసి, ప్రాణాలు పోవడానికి పరోక్ష కారణం ఎమ్మెల్యేనే. ఇప్పుడు ఆయనే '5 లక్షలు, 10 లక్షలు ఇస్తాం.. రాజీ పడండి' అనడం ఏ రకమైన న్యాయం? దరియా హుస్సేన్ ఆత్మహత్యకు కారణమైన పోలీసులపై కేసులు పెట్టే వరకు వైఎస్సార్సీపీ పోరాటం ఆగదు. బాధిత కుటుంబానికి మా పార్టీ అండగా ఉంటుంది. రాబోయే శనివారం వైఎస్సార్సీపీ ముస్లిం మైనారిటీ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు అందరం పిడుగురాళ్లకు వస్తున్నాం. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ. కోటి పరిహారం చెల్లించాలి. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి. అంతవరకు వైఎస్సార్సీపీ పోరాటం ఆపదు. ఆత్మహత్యకు కారణమైన పోలీసులను సస్పెండ్ చేయాలి - వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే, మైనారిటీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హఫీజ్ ఖాన్ దరియా హుస్సేన్ ఆత్మహత్య ఘటన పోలీసుల వేధింపులకు పరాకాష్ట. ఆత్మహత్యకు ముందు ఆయన రాసిన సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలో సీఐ వెంకట్రావుతోపాటు మరో నలుగురు పోలీసులు తనను ఓ సివిల్ వివాదం విషయంలో నిరంతరం వేధించారని స్పష్టంగా చెప్పారు. ఇల్లు ఖాళీ చేయకపోతే బలవంతంగా ఖాళీ చేయిస్తామని, అలాగే తప్పుడు ఎన్‌డీపీఎస్ (గంజాయి) కేసు పెడతామని బెదిరించినట్లు అందులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయడమే కాకుండా ఉద్యోగాల నుంచి తొలగించి, వారిపై హత్య కేసు నమోదు చేయాలి. సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియో ఆధారంగా ప్రభుత్వం సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలి. దరియా హుస్సేన్ కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. ఇలాంటి ఘటనలు ఒక్క దరియా హుస్సేన్‌కే పరిమితం కాలేదు. విజయవాడకు చెందిన సాయి కృష్ణ, నెల్లూరుకు చెందిన ఏడుకొండలు, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన క్రాంతి కుమార్ ఘటనలు పోలీసుల ఆగడాలకు అద్దం పడుతున్నాయి. భవిష్యత్తులోనూ రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. బాధితులకు అండగా వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది. బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది - ఇసాక్ బాషా, ఎమ్మెల్సీ పల్నాడు జిల్లాలో దరియా హుస్సేన్ అనే వ్యక్తి సివిల్ వివాదంలో పోలీసులు తలదూర్చి, ఇల్లు ఖాళీ చేయమని చెప్పడం ఎంతవరకు సమంజసం? బాధితుడు కోర్టు నుండి డైరెక్ట్ ఆర్డర్ తీసుకుని పోలీసులకు చూపెట్టడం జరిగింది. సివిల్ వివాదంలో ఎంటర్ కావొద్దని పోలీసులను కోర్టు హెచ్చరించినా వేధింపులు ఆపలేదు. పోలీసులు న్యాయస్థానాల ఆదేశాలను కూడా లెక్క చేయడం లేదు. హుస్సేన్ ఇంటికి వచ్చి, రాత్రి 11:30 వరకు పోలీస్ స్టేషన్‌లో పెట్టి ఆయన కుటుంబాన్ని వేధించారు. పొద్దున 10 గంటల లోపల నువ్వు ఇల్లు ఖాళీ చేయకుంటే, గంజాయి కేసు పెట్టి లోపల వేస్తాము అని పోలీసులు బెదిరించారు. ఈ విషయాలన్నీ అతను సూసైడ్ నోట్‌లోనూ, సెల్ఫీ వీడియోలను క్లియర్‌గా చెప్పాడు. రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ ఎవరికి తొత్తుగా పని చేస్తోంది? హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలి. బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉండి వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతుంది. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి - రూహుల్లా, ఎమ్మెల్సీ మైనారిటీల పట్ల కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. మైనారిటీల సమస్యలు ఈ ప్రభుత్వానికి అస్సలు పట్టడం లేదు. తాను కొనుగోలు చేసిన ఇంటి స్థలం వివాదంలో చిక్కుకుందని, దాన్ని ఆసరాగా చేసుకుని పోలీసులు వేధిస్తున్నారని హుస్సేన్ అనే మైనారిటీ ఉద్యోగి పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేసినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరికి పిడుగురాళ్ల సీఐ వేధింపులు శ్రీరాం వెంకట్రావు వేధింపులు భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే వేధింపులకు దిగుతున్నారు. సివిల్ తగాదాల్లో తలదూర్చవద్దని హైకోర్టు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. గంజాయి కేసు పెడతామని బెదిరిస్తుంటే పోలీస్ వ్యవస్థ పనితీరు ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. హుస్సేన్ కుటుంబానికి ప్రభుత్వమే న్యాయం చేయాలి. ఆయన ఆత్మహత్యకు కారకులైన పోలీసులను తక్షణం విధుల నుంచి సస్పెండ్ చేయాలి. హుస్సేన్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతోపాటు కోటి రూపాయల పరిహారం చెల్లించాలి. ఆ పోలీసులను తక్షణం సస్పెండ్ చేయాలి - నూరి ఫాతిమా, గుంటూరు ఈస్ట్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఉర్దూ అకాడమీలో లైబ్రేరియన్‌గా పనిచేసే పిడుగురాళ్లకు చెందిన షేక్ దరియా హుస్సేన్ అనే వ్యక్తి సీఐ శ్రీరాం వెంకట్రావు వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవడం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. మైనారిటీల పట్ల ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. చనిపోవడానికి ముందు ఆయన రాసిన సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోల ఆధారంగా కేసును దర్యాప్తు జరిపి, ఆత్మహత్యకు కారకులైన సీఐ, ఏఎస్సై, కానిస్టేబుళ్లందర్నీ తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేయాలి. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించాల్సిన పోలీసులు, పోలీసులంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. - మృతుడు షేక్ దరియా హుస్సేన్ సెల్ఫీ వీడియోలో ఏం మాట్లాడారంటే.. చనిపోవడానికి ముందు షేక్ దరియా హుస్సేన్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో సీఐ వెంకట్రావు తనను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడో వివరించాడు. తన మరణానికి సీఐ వెంకట్రావు సహా నలుగురు పోలీస్ కానిస్టేబుళ్ల వేధింపులే కారణమని చెప్పాడు. ఎస్పీకి పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు పెట్టుకున్నా సీఐ వేధింపులు ఆగలేదని వాపోయాడు. "ఏఎస్సై హనుమంతరావు, కానిస్టేబుళ్లు ప్రకాష్, సుధాకర్, కుమార్ ఇబ్బందులు పెట్టారు. మతం పేరుతో నన్ను దూషించారు. గంజాయి కేసులో ఇరికిస్తామని బెదిరించారు. జిల్లా ఎస్పీకి పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేస్తే ఆయన గురజాల డీఎస్పీకి పంపించారు. చివరికి గురజాల డీఎస్పీ కూడా సీఐ వెంకట్రావుతో కలిసి వేధించడం మొదలుపెట్టాడు. పోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు హెచ్చరించినా వారు మమ్మల్ని వేధించడం ఆపలేదు. హైకోర్టు ఆర్డర్ ఉన్నా, ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఎవరూ నన్నేమీ చేయలేరని మరింత బెదిరించే వారు. మొన్న 14వ తేదీన ఇద్దరు కానిస్టేబుళ్లు ఇంటికొచ్చి తాళాలు వేసి బీభత్సం సృష్టించారు. మర్నాడు స్టేషన్ కి రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించారు. ఏం చేయాలో అర్థం కాక తీవ్ర మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా ఆత్మహత్యకు పిడుగురాళ్ల సీఐ వెంకట్రావే కారణం." పోలీసుల వేధింపులు తాళలేక మైనార్టీ వర్గానికి చెందిన ఆ ఉద్యోగి పుట్టినరోజు నాడే ఆత్మహత్య చేసుకుని జీవితం చాలించాడు. పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు సివిల్ పంచాయితీలలో తలదూర్చడంతో ఆరు నెలల వ్యవధిలో ఇద్దరు ఆత్మహత్యా యత్నం చేశారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళతోపాటు ఓ దళిత యువకుడు వీరిలో ఉన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు ఉన్నతాధికారులు సీఐ వెంకట్రావును వెనుకేసుకొస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. సీఐ వెంకట్రావు తన భర్తను ప్రతి రోజు స్టేషన్‌కు పిలిపించి తిట్టడం, మహిళా పోలీసులతో కొట్టిస్తానని భయపెట్టేవాడని దరియా హుస్సేన్ భార్య షేక్ అమిరున్ వాపోతున్నారు. డబ్బులు కట్టకపోతే గంజాయి కేసు పెడతానని బెదిరించిన విషయాన్ని ఆమె చెబుతున్నారు. ఎస్పీ ఆఫీస్‌లో గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, పోలీసుల అరాచకాలను, తాను పడిన మానసిక వేదన గురించి సూసైడ్ నోట్‌లో రాశారని చెప్పారు.