విజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్‌ను మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి ఆవిష్కరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ యాప్ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తల సమస్యలు, ప్రజా సమస్యలు, పార్టీ కార్యక్రమాలు నేరుగా నాయకత్వానికి చేరేలా ఈ యాప్ రూపొందించబడిందన్నారు. ప్రభుత్వం వైఫల్యాలు, ప్రజా సమస్యలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, సోషల్ మీడియాలో పార్టీ కార్యకర్తలకు బలమైన వేదికగా ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాపై ఆంక్షలు విధిస్తూ పార్టీ కార్యకర్తలను వేధిస్తోందని ఆరోపించిన ఆయన, అలాంటి పరిస్థితులను ఎదుర్కొనే డిజిటల్ వేదికగా జగన్ 2.0 సూపర్ యాప్ పనిచేస్తుందన్నారు. యాప్‌లోని డిజిటల్ డైరీ ద్వారా కార్యకర్తలు వేధింపులు, సమస్యలను నమోదు చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ప్రతి వైయస్ఆర్‌సీపీ కార్యకర్త, అభిమాని తప్పనిసరిగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని వెలంపల్లి విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలను విస్మరించడమే కాకుండా, విద్య, వైద్యం, సంక్షేమ రంగాలను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అమరావతిలో గత ప్రభుత్వ హయాంలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ప్రభుత్వం జీవో ద్వారా రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన, ఈ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధి అందరికీ చెందాలని, పేదలకు అక్కడ నివసించే హక్కు లేదనే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.