ఒంగోలు: పొగాకుకు గిట్టుబాటు ధర కోసం రైతులు రోడ్డెక్కుతున్నా, ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నా.. చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూటమి సర్కార్ కు పట్టడం లేదని వైయస్ఆర్‌సీపీ నేతలు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద పొగాకు రైతులకు సంఘీభావంగా వైయస్ఆర్‌సీపీనిర్వహించిన భారీ ధర్నాలో పార్టీకి చెందిన పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కంపెనీలతో కుమ్మక్కై రైతుల పొట్టకొడుతున్న చంద్రబాబు సర్కార్ పై నేతలు ఫైర్ అయ్యారు. రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించే వరకూ పోరాటాలు కొనసాగిస్తామని వారు తేల్చిచెప్పారు. చంద్రబాబు రాగానే రైతులకు మళ్లీ కష్టాలు: కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుత పాలకుల వల్ల రైతులు తమ సమస్యలపై మళ్లీ రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతులు పండించిన పంటలకు ఎక్కడా కూడా ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర లభించడం లేదు. గిట్టుబాటు ధర కల్పించాలంటూ పొగాకు రైతులు అనేక రకాలుగా నిరసనలు తెలుపుతూ, ర్యాలీలు చేస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా,వారికి ఆత్మహత్యలే శరణ్యమయ్యేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారా అని అనుమానం కలుగుతుంది. పొగాకు రైతుల సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్‌తో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధర లభించకుండా దళారులు, మధ్యవర్తులు దోచుకుంటున్నారు, ప్రభుత్వం తమను కాపాడాలని రైతులు కోరుతున్నారు. చంద్రబాబు, లోకేష్‌లు ఎక్కడికక్కడే వ్యాపారస్తులతో చేతులు కలిపి రైతుల నడ్డి విరుస్తున్నారే తప్ప, పొగాకు రైతుల గురించి పట్టించుకోవడం లేదు. నేను స్వయంగా కందుకూరు పొగాకు బోర్డుకు వెళ్ళినప్పుడు, మేము ఉన్నంత సేపు ఒక రేటు ఇచ్చి.. బయటకు రాగానే రేటు తగ్గించారు. అధికారులు వేలం పాట నిర్వహించే వ్యాపారస్తులకు ముందే సమాచారం అందించి తమ వారికి అధిక రేట్లు ఇచ్చేలా ఇన్ఫ్లుయెన్స్ చేసి తమకు నచ్చిన విధంగా రేట్లను తగ్గిస్తూ,ఎక్కిస్తూ ఇష్టారాజ్యంగా మారుస్తున్నారు. కందుకూరు లో మొదట క్వింటాలు 26 వేలకు పొగాకు కొనుగోలు చేసిన జేకే సిగరెట్ కంపెనీ ప్రతినిధులను మరుసటి రోజుకు ఆ ధరను ఒక్కసారిగా 16 వేలకు తగ్గించారు. పక్కనే కర్ణాటక రాష్ట్రంలో క్వింటాల్ 31 వేల నుంచి 36 వేలకు పొగాకు కొనుగోలు చేస్తే, ఇక్కడ మాత్రం క్వింటాలుకు ₹15,900 నుండి 16 వేలకు మించి ఇవ్వట్లేదు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిందే చంద్రబాబు ఆలోచన అంతా రైతు వ్యతిరేక విధానమే. ఆయనకు రైతులన్నా, వ్యవసాయమన్నా అస్సలు గిట్టదు. అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు రైతుల ప్రయోజనాలతో పనిలేదు. ఆయనకు కేవలం తన సొంత, స్వార్థ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం. లోకేష్ కి సవాల్ విసురుతున్నా.. నేను ఐదు రకాల పంటలు చూపిస్తా, వాటి పేర్లు లోకేష్ చెప్పగలిగితే నేను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా. కనీసం పంటల పేర్లు కూడా తెలియని లోకేష్ లాంటి వారు వ్యవసాయం గురించి మాట్లాడటం సరికాదు. రైతులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని జగన్ గారి ప్రభుత్వం అమలు చేసింది. సాధారణంగా పంటల బీమాలో ఒక వంతు రైతులు, ఒక వంతు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద కేంద్ర ప్రభుత్వం మరియు మిగిలిన ఒక వంతు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. రైతులు కట్టాల్సిన ప్రీమియం వాటాతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటాను కూడా జగన్ గారి హయాంలో ఏపీ ప్రభుత్వమే పూర్తిగా భరించి, రైతులకు ఉచితంగా బీమా సౌకర్యం కల్పించింది. కేంద్ర పథకం కేవలం వెబ్ ల్యాండ్ లో నమోదైన రైతులకు మాత్రమే బీమా వర్తింపజేస్తుంది, దీనివల్ల కౌలు రైతులు, ఇతర సాగుదారులు నష్టపోతారు. ఈ పరిమితుల వల్ల కేంద్ర పథకం నుండి బయటకు వచ్చి, రాష్ట్రంలోని కౌలు రైతులతో సహా అర్హులైన ప్రతి రైతూకూ లబ్ధి కలిగేలా జగన్ గారి ప్రభుత్వమే పూర్తిగా 100 శాతం ప్రీమియం కట్టి ఉచిత పంటల బీమా అమలు చేసింది. ఇలా పూర్తి ప్రీమియం భరించిన ఏకైక ముఖ్యమంత్రి మన దేశంలో జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే. చంద్రబాబు మెడలు వంచి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చైనా సరే రైతులకు అండగా నిలుస్తాం. ప్రస్తుత పొగాకు పంట అమ్మకాల సీజన్ దాదాపుగా పూర్తి కావస్తోంది, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలి. మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రభుత్వం వెంటనే పొగాకు కొనుగోళ్లు చేపట్టాలి. రైతులకు అండగా ఉండటమే కాకుండా, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మా పోరాటాలను మరింత ఉధృతం చేస్తాం. యోగాకు వందల కోట్లు, రైతులకు మాత్రం ఇవ్వరా ?: బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు ఒక రోజు దీక్ష చేశాం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రైతులు బాగున్నారా? మీరు మాత్రం బాగున్నారు, జేబులు నింపుకుంటున్నారు, రాష్ట్రంలో రైతులు మాత్రం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా మీ కళ్లకు కనిపించట్లేదు, మీ చెవులకు వినిపించట్లేదు. రైతులు ఎటు పోయినా ఫర్వాలేదని చంద్రబాబు అనుకుంటున్నారు. ప్రకాశం, నెల్లూరు, గోదావరి జిల్లాల్లో పొగాకు పండించిన వారంతా గిట్టుబాటు ధర లేక బోర్డు చుట్టూ తిరుగుతూ, టాక్టర్ ర్యాలీలు చేస్తూ, పొగాకును రోడ్డుపై తగులబెట్టారు. అయినా ఇవన్నీ మీకు కనిపించడం లేదు. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా ఉండటం కోసం మార్క్ ఫెడ్ నుంచి రూ.300 కోట్లు ఇచ్చి పొగాకు కొన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 3-4 వందల కోట్లు వెచ్చించలేరా ? ఒక్క రోజు యోగా కోసం 300 ఖర్చు పెడతారు కానీ రైతుల కోసం ఖర్చు చేయలేరా ? మీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పి పొగాకు రైతుల్ని ఆదుకోలేరా ? మీరు చెప్పిన తర్వాత కూడా కంపెనీలు దిగి రావడం లేదంటే మీరు ఎలా కుమ్మక్కయ్యారో అర్దమవుతోంది. కాబట్టి రైతులకు గిట్టుబాటు ధర వచ్చే వరకూ మేం పోరాటాలు చేస్తూనే ఉంటాం.