గోదావరిలో ఐదుగురు గిరిజనుల మృతిపై  వైయస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే అండగా నిలవాలి

తాడేపల్లి: ఎటపాక మండలం గొల్లగూడెం సమీపంలో గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు గిరిజనులు మృత్యువాత పడిన విషాద ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన ఎనిమిది మంది బృందం గేలాలతో చేపల వేటకు వెళ్లగా, వరద ప్రవాహం ఒక్కసారిగా ఉద్ధృతం కావడంతో ఐదుగురు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని  వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉండటం మరింత హృదయవిదారకమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే అన్ని విధాలా అండగా నిలిచి, తగిన ఆర్థిక సహాయం అందించాలని  వైయస్‌ జగన్‌ కోరారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Back to Top