తాడేపల్లి: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న వేళ, దాని నిర్మాణ ఘనతను తన ఖాతాలో వేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ‘క్రెడిట్ చోరీ’కి పరాకాష్ట అని వైయస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆక్షేపించారు. పని చేసింది వైయస్సార్‌సీపీ ప్రభుత్వం.. ప్రచారం చేసుకుంటోంది చంద్రబాబు అని మండిపడ్డారు. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం, జీఎంఆర్‌తో ఒప్పందం, కేంద్ర అనుమతులు, ఎన్‌ఓసీలు, నీరు, విద్యుత్, మౌలిక వసతులు, నిధుల సమీకరణ వరకు ప్రతి కీలక ప్రక్రియ శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే జరిగిందని స్పష్టం చేశారు. చంద్రబాబు 2019 ఎన్నికలకు ముందు ఒక రాయి వేసి వెళ్లడం తప్ప ఎయిర్‌పోర్ట్‌ను కార్యరూపంలోకి తీసుకురావడంలో ఆయన పాత్ర శూన్యమని తేల్చిచెప్పారు. ‘క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్’ చంద్రబాబు మార్కు రాజకీయమని, ఎన్ని తరాలు గడిచినా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై వైయస్ జగన్ ముద్ర చెరిగిపోదని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. ప్రెస్‌మీట్‌లో వరుదు కళ్యాణి ఏమన్నారంటే.. - పని మాది.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధం కావడం ఉత్తరాంధ్ర ప్రజలందరికీ గర్వకారణం. ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కావడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు వచ్చి వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాల అభివృద్ధికి దోహదపడుతుంది. కానీ ఈ ప్రాజెక్టు విషయంలో పని చేసింది వైయస్సార్‌సీపీ ప్రభుత్వం అయితే, ప్రచారం మాత్రం చంద్రబాబు చేసుకుంటున్నారు. కష్టం ఒకరిది.. కీర్తి మరొకరు కొట్టేయాలనుకోవడం సరికాదు. ‘క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్’ చంద్రబాబు మార్కు రాజకీయంగా మారిపోయింది. 2019 ఎన్నికలకు ముందు ఒక రాయి వేసి శంకుస్థాపన చేయడం తప్ప ఈ విమానాశ్రయాన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి చంద్రబాబు చేసిందేమీ లేదు. - భూసేకరణ నుంచి అనుమతుల వరకు జగన్ హయాంలోనే 2020 జూన్‌లో జీఎంఆర్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం నుంచి భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, నాలుగు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం, నీరు, విద్యుత్, అంతర్గత రోడ్లు, ఏరోనాటికల్ సర్వీసులు, నిధుల సమీకరణ వరకు ప్రతి కీలక ప్రక్రియ వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. చంద్రబాబు పూర్తి చేయలేకపోయిన భూసేకరణను జగన్‌గారు పూర్తి చేశారు. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్‌కు రూ.967 కోట్లు సహా నీటి సరఫరా, మౌలిక వసతులు, ప్రత్యామ్నాయ రోడ్లు, సబ్‌స్టేషన్ తదితర అవసరాలకు మొత్తంగా రూ.1,200 కోట్లకు పైగా మా ప్రభుత్వం ఖర్చు చేసింది. కరోనా వంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే పనులను ముందుకు తీసుకెళ్లడంతో 2024 ఎన్నికల నాటికే రన్‌వే, టెర్మినల్ పనులు కీలక దశకు చేరుకున్నాయి. - కనెక్టివిటీ రోడ్డుపై రెండేళ్లుగా ఏం చేశారు? విమానాశ్రయం సిద్ధమైంది.. కానీ విశాఖపట్నం నుంచి భోగాపురానికి వేగంగా చేరుకునే కనెక్టివిటీ రోడ్డు పరిస్థితి ఏమిటి? వైయస్ జగన్ హయాంలోనే విశాఖ నుంచి భోగాపురం వరకు 55 కిలోమీటర్ల మేర 77 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్ల రహదారి మంజూరు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారు. దాదాపు రూ.6,300 కోట్లతో చేపట్టాల్సిన ఈ రహదారిపై అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు కేంద్రంలోనూ మీ మిత్రపక్ష ప్రభుత్వమే ఉంది. రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. అయినా ఆ రోడ్డు నిర్మాణాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోయారు? ఎయిర్‌పోర్ట్ ఉండి, అక్కడికి వేగంగా చేరుకునే రహదారి లేకపోతే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. – ఎన్ని తరాలు గడిచినా భోగాపురంపై వైయస్ జగన్ ముద్రే భోగాపురం విమానాశ్రయానికి భూమి సేకరించింది, నిర్వాసితులకు పునరావాసం కల్పించింది, కేంద్ర అనుమతులు, ఎన్‌ఓసీలు సాధించింది, మౌలిక వసతులు కల్పించింది, నిధుల సమీకరణకు మార్గం సుగమం చేసింది వైయస్ జగన్ ప్రభుత్వమే. అందుకే ఈరోజు విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇప్పటికైనా చంద్రబాబు పని చేయకుండా ప్రచారం చేసుకోవడం, ఇతరుల కష్టాన్ని తన ఖాతాలో వేసుకోవడం మానుకోవాలి. విశాఖ–భోగాపురం కనెక్టివిటీ రోడ్డును వెంటనే పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి. ఎన్ని తరాలు గడిచినా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కార్యరూపం దాల్చడంలో వైయస్ జగన్ చేసిన కృషిని ఉత్తరాంధ్ర ప్రజలు మర్చిపోరు అని వరుదు కళ్యాణి తేల్చి చెప్పారు.