భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ కచ్చితంగా జగన్‌గారి మార్క్‌

ఆ ఎయిర్‌పోర్ట్‌ కార్యరూపంలో చంద్రబాబు పాత్ర శూన్యం

ప్రభుత్వ ఆర్భాట ప్రచారంపై ధర్మాన ప్రసాదరావు ధ్వజం

విశాఖపట్నంలోని వైయస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.

భోగాపురం ఎయిర్‌పోర్టుకు జగన్‌గారు భూమిపూజ

అన్ని అనుమతులు పొంది 2023, మే 3న ఆ వేడుక

ఫైనాన్షియల్‌ క్లోజర్‌ కూడా పూర్తయ్యాకే శంకుస్థాపన

రూ.1200 కోట్లతో భూసేకరణ, పరిహారం..

ఇంకా అవసరమైన  మౌలిక సదుపాయాలు కల్పన

జూన్‌ 2026 నాటికి కమర్షియల్‌ ఆపరేషన్స్‌..

అని ఆనాడే శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ

గుర్తు చేసిన ధర్మాన ప్రసాదరావు

భోగాపురం–విశాఖ కనెక్టివిటీ రోడ్డుపై చంద్రబాబు వైఫల్యం

చివరకు ఆ రోడ్డు నిర్మాణం ఇప్పటికీ పూర్తి చేయని బాబు

అయినా అన్నీ తానే చేశానంటూ చంద్రబాబు క్రెడిట్‌చోరీ

ప్రైవేట్‌ పెట్టుబడితో భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం

అయినా తానే కట్టినట్లు చంద్రబాబు అసత్య ప్రచారం

ధర్మాన ప్రసాదరావు ఆక్షేపణ

ఉత్తరాంధ్ర నిధులను అమరావతికి తరలిస్తున్న చంద్రబాబు

దీని వల్ల మళ్లీ ప్రాంతీయ అసమానతలు తలెత్తుతాయి

భవిష్యత్తులో ప్రత్యేక ఉద్యమాలకూ దారి తీస్తుంది

ప్రెస్‌మీట్‌లో ప్రభుత్వానికి ధర్మాన ప్రసాదరావు వార్నింగ్‌

విశాఖపట్నం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం సంపూర్ణంగా మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ కృషి, పట్టుదల వల్లనే సాధ్యమైందని, ఇందులో ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు చేసిందేమీ లేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ భోగాపురం ఎయిర్‌ పోర్టును ప్రారంభించడాన్ని వైయస్సార్‌సీపీ స్వాగతిస్తోందన్న ఆయన, ఇతరులు చేసిన అభివృద్ధి పనులను తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్‌ కొట్టేయాలని చంద్రబాబు చూడటం సరైంది కాదని హితవు పలికారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తూ బడ్జెట్‌ నిధులన్నింటినీ ఒకే ప్రాంతానికి ఖర్చు చేస్తే, మళ్లీ ప్రాంతీయ అసమానతలు, ప్రత్యేక ఉద్యమాలు తలెత్తే ప్రమాదముందని విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వాన్రి హెచ్చరించారు.
ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంకా ఏం మాట్లాడారంటే..:

జగన్‌గారి హయాంలోనే ఎయిర్‌పోర్టు కార్యరూపం:
    ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కోసం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల అభివృద్ధి కోసం భోగాపురం ఎయిర్‌ పోర్టుకు 2023 మే 3వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌ శంకుస్థాపన చేశారు. ఫౌండేషన్‌ స్టోన్‌ వేసిన రోజే ఆయన చాలా స్పష్టంగా 2026, జూన్‌ చివరి నాటికి కమర్షియల్‌ ఆపరేషన్స్‌ ప్రారంభమవుతాయని చెప్పారు. ఆయన అంత ధైర్యంగా ఎలా చెప్పగలిగారంటే, శంకుస్థాపన నాటికే ఎయిర్‌ పోర్టుకు కావలసిన భూసేకరణ, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల ఎన్‌ఓసిలు, కన్సెషన్‌ అగ్రిమెంట్, నీరు, విద్యుత్‌ సదుపాయాలు పూర్తి చేశారు. అన్నింటి కంటే ముఖ్యంగా ప్రైవేట్‌ డెవలపర్‌ బ్యాంకుల నుంచి రుణం పొందే ’ఫైనాన్షియల్‌ క్లోజర్‌’ ప్రక్రియను పూర్తి చేయించిన తర్వాతే జగన్‌గారు పునాదిరాయి వేశారు.

ప్రధాని చేతుల మీదుగా.. స్వాగతిస్తున్నాం:
    దేశంలో సాధారణంగా ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రులు మేజర్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయాలంటే అన్ని అనుమతులు వచ్చి, ఫైనాన్షియల్‌ క్లోజర్‌ అయిన తర్వాతే చేస్తారు. అదే సంప్రదాయాన్ని జగన్‌గారు పాటించారు. ఆయన చెప్పినట్టుగానే జూన్‌ 2026 నాటికి పనులు పూర్తయి, జూలై 1 నాటికే, ప్రధాని గారు ప్రారంభించే స్థితికి వచ్చింది. ఈ దేశ ప్రధాని స్వయంగా వచ్చి భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభించడాన్ని మా పార్టీ తరపున స్వాగతిస్తున్నాం.

జగన్‌గారి హయాంలోనే రూ.1200 కోట్లు:
    భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం, దాని నిర్మాణాన్ని ఘనత అంతా తమదే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు హయాంలో 2015 నుంచి 2019 వరకు ఏ ఒక్క ఫార్మాలిటీ పూర్తి కాలేదు. 2023 వరకు ఫైనాన్షియల్‌ క్లోజర్‌ అవ్వలేదు. కానీ జగన్‌గారి  ప్రభుత్వం రూ.1200 కోట్లు ఖర్చు చేసి, భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ (రిహాబిలిటేషన్, రీసెటిల్మెంట్‌) ప్యాకేజీలు, కనెక్టింగ్‌ రోడ్లకు నిధులు ఇచ్చింది. నీటి సౌకర్యం కోసం రూ.75 కోట్లు, ఇతర అవసరాలకు రూ.135 కోట్లు కేటాయించింది.
    ఈ ఎయిర్‌పోర్ట్‌ను రాష్ట్ర బడ్జెట్‌తో నిర్మించడం లేదు. ప్రైవేట్‌ డెవలపర్‌ సుమారు రూ.4 వేల కోట్లు బ్యాంక్‌ రుణాలతో కడుతున్నారు. ప్రైవేట్‌ వ్యక్తి కడుతున్న ఎయిర్‌ పోర్టును చంద్రబాబు, కేంద్ర మంత్రులు పోయి రోజుకోసారి ఇన్సె్పక్ట్‌ చేస్తూ తామే ఏదో ఇంజనీరింగ్‌ సూపర్‌ వైజర్లలా బిల్డప్‌ ఇవ్వడం హాస్యాస్పదం. ఒక్క రోజు లేట్‌ అయినా ప్రైవేట్‌ డెవలపర్‌కే నష్టం కాబట్టి వాళ్లే త్వరగా పూర్తి చేస్తారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ పార్టిసిపేషన్‌ ఏమీ లేదు, అది వైయస్‌. జగన్‌ హయాంలోనే పూర్తయింది.

సిటీ కనెక్టివిటీ రోడ్డుపై కూటమి ప్రభుత్వ వైఫల్యం:
    భోగాపురం ఎయిర్‌ పోర్టు విశాఖ నగరానికి 40–50 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని వల్ల విశాఖ పౌరులకు ఇబ్బంది కలగకూడదని ఆనాడు వైయస్‌. జగన్‌ కేంద్ర మౌళిక సదుపాయాలశాఖ మంత్రితో మాట్లాడి, ప్రధానికి నచ్చజెప్పి రూ.7 వేల కోట్లతో నగరంతో నేరుగా అనుసంధానించే యాక్సెస్‌ రోడ్డును మంజూరు చేయించారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా ఆ రోడ్డు పనులు ఇంతవరకు ఇసుమంతైనా కదిలాయా? డిపిఆర్‌ లేదు, టెండర్లు లేవు, పనులు ప్రారంభించలేదు. కనెక్టివిటీ రోడ్డు వేయకపోవడం వల్లే ఈరోజు విశాఖ ప్రజలు ఈ ఎయిర్‌ పోర్ట్‌ వల్ల మాకేం ఉపయోగం లేదనే నిరాశలోకి వచ్చారు. ఈ వైఫల్యం కేవలం కూటమి ప్రభుత్వానిదే. ఇదే వైయస్‌.జగన్‌ అధికారంలో ఉండి ఉంటే ఎయిర్‌ పోర్ట్‌తో పాటే ఆ రోడ్డును కూడా పూర్తి చేసేవారు.

క్రెడిట్‌ చోరీ చంద్రబాబుకు ఓ వ్యసనం:
    ఎవరైనా కష్టపడి ప్రాజెక్టులు చేస్తే, దాన్ని ’నేనే చేశాను’ అని ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకి మొదటి నుంచీ ఉన్న అలవాటు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రతిపాదిస్తే, అసెంబ్లీలో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ దాన్ని తీవ్రంగా విమర్శించింది. దుర్వినియోగం అయిపోతుందని అడ్డుపడింది. ఆనాడు రెవెన్యూ మంత్రిగా అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిపి నేను సమాధానం చెప్పాను. కానీ ఈరోజు చంద్రబాబు  ’ఓఆర్‌ఆర్‌ నేనే ప్రతిపాదించాను, నేనే చేశాను’ అని చెప్పుకుంటున్నారు. ప్రపంచంలో, దేశంలో ఏది జరిగినా ’నేనే ఇనిషియేట్‌ చేశాను’ అని చెప్పుకోవడం ఆయనకు ఒక వ్యసనంలా మారింది.

ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తే ప్రాంతీయ వాదాలు తప్పవు:
    వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి వైయస్‌. జగన్‌ మంజూరు చేసిన అనేక ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం పక్కన పడేసింది. శ్రీకాకుళంలో కలెక్టరేట్‌ నిర్మాణం, తోటపల్లి రిజర్వాయర్‌ పనులు, విశాఖపట్నం, విజయనగరంలో కొత్త మెడికల్‌ కాలేజీలు, యూనివర్సిటీలకు ఒక్క రూపాయి బడ్జెట్‌ ఇవ్వకుండా నిలిపివేశారు. 20 ఏళ్లుగా మీరు ఈ ప్రాంతానికి ప్రకటలే తప్ప చేసిన మంచేమీ లేదు. ఇప్పుడు కూడా అదే మోసం చేస్తున్నారు. రాష్ట్ర ధనాన్ని, బడ్జెట్‌ నిధులన్నింటినీ తీసుకెళ్లి కేవలం అమరావతిలోనే పెడుతున్నారు. ఇది ధర్మమేనా?
    గతంలో 70–80 ఏళ్లు రాష్ట్ర నిధులన్నీ హైదరాబాద్‌లోనే పెట్టడం వల్లే ’మా ప్రాంతంలో జరిగన అభివద్ధి మాకే కావాలి’ అన్న ఆకాంక్షే మనల్ని తరిమేసేదానికి కారణం అయింది. ఈరోజు మళ్లీ అమరావతి పేరిట అదే తప్పు చేస్తున్నారు. రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా, ప్రాంతీయ అసమానతలను పెంచి పోషిస్తున్నారు. రేపు ఇదే ధోరణి కొనసాగితే ఈ ప్రాంతాల నుంచి కూడా ’మా డబ్బులు మాకే కావాలి, మీరు ఇక్కడ నుంచి పొండి అన్న డిమాండ్లు, స్లోగన్లు రావని చెప్పలేం. భవిష్యత్తులో ఈ ప్రమాదం పొంచి ఉంది. మరో రాష్ట్రం కావాలన్న డిమాండైనా తర్వాత తరం వాళ్లు చేస్తారు. అందుకే వెనుకబడిన  ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం ఆమోదయోగ్యం కాదు.

వంశధార, ఒరిస్సా వివాదంపై స్పందించాలి:
    బడ్జెట్‌లో నయా పైసా కేటాయించకుండా వంశధార ప్రాజెక్టుకు డబ్బులిచ్చామని ఈ ప్రభుత్వం అసత్య ప్రకటనలు చేస్తోంది. కేంద్రంలోనూ, ఏపీలోనూ, ఒరిస్సాలోనూ మూడూ బిజెపి, దాని మిత్రపక్షాల ప్రభుత్వాలే ఉన్నాయి. మరి ఒరిస్సా ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకునేలా కేంద్రంతో చెప్పించి ఎందుకు క్లియర్‌ చేయించడం లేదు? వివాదాలు పరిష్కరించకుండా కేవలం బడ్జెట్‌ లో నిధులు చూపిస్తారు.ఎందుకంటే వీరికి పని చేయడం ఇష్టం లేదు, ఊరకనే షో చేయడం మాత్రమే వచ్చు. భవిష్యత్తులో ఎవరైనా పని చేస్తే ఆరోజు మరలా ఆ ఘనత నాదే అని చంద్రబాబు క్రెడిట్‌ తీసుకుంటారని ధర్మాన ప్రసాదరావు ఆక్షేపించారు.
    ఇంకా ఉత్తరాంధ్ర ప్రజలైన తమకు ఇంకా అన్యాయం జరిగితే చూస్తూ కూర్చోబోమని, రాజ్యాంగపరంగా తమకు రావాల్సిన వాటా కోసం, తమ ప్రాంత అభివృద్ధి కోసం ఏ వేదిక మీదైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు.

Back to Top