విశాఖపట్నం: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి గిరి ప్రదక్షిణ మహోత్సవంలో కూటమి ప్రభుత్వం, పోలీసు, దేవాదాయ, రెవెన్యూ మరియు జీవీఎంసీ యంత్రాంగాల మధ్య తీవ్ర సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనపడిందని, అధికారుల చేతకానితనం వల్ల లక్షలాది మంది భక్తులు, నగర ప్రజలు ప్రత్యక్ష నరకం చూశారని వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కే కే రాజు తీవ్రంగా విమర్శించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... ప్రచార ఆర్భాటాలకు, రివ్యూ మీటింగులకే పరిమితమైన నాయకులు భక్తుల కనీస వసతులు, ట్రాఫిక్ ఆంక్షలపై ముందస్తు ప్రణాళికలు రూపొందించడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. గిరి ప్రదక్షిణ విశిష్టతను, సాంప్రదాయాలను దెబ్బతీస్తూ పండితుల పేరిట గందరగోళం సృష్టించడం అత్యంత విచారకరమని ఆందోళన వ్యక్తం చేశారు. నిన్నటి మహోత్సవంలో జరిగిన అవకతవకలు, అధికారుల నిర్లక్ష్యం మరియు నిధుల దోపిడీపై తక్షణమే ఉన్నత స్థాయి ఎంక్వయిరీ జరిపించి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాఖల మధ్య సమన్వయ లోపం – భక్తులకు ప్రత్యక్ష నరకం. నిన్న జరిగిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ, పోలీసు శాఖ, రెవెన్యూ మరియు జీవీఎంసీ యంత్రాంగాల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా బయటపడింది. గిరి ప్రదక్షిణకు సంబంధించి నగర ప్రజలకు కానీ, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు కానీ ట్రాఫిక్ ఆంక్షల పట్ల ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. కేవలం ప్రచార ఏర్పాట్లకు పరిమితమై, ఎంతమంది భక్తులు వస్తారనే కనీస అంచనా వేయకుండా ఏదో మొక్కుబడిగా ఏర్పాట్లు చేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల లక్షలాది మంది భక్తులతో పాటు నగర ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడటం చాలా దురదృష్టకరం. మంత్రుల ఆర్భాటాలు – ముందస్తు ప్రణాళికా రాహిత్యం.. గిరి ప్రదక్షిణ అనేది నిన్న మొన్న ప్రారంభమైనది కాదు. వందలాది సంవత్సరాలుగా అత్యంత పవిత్రంగా జరుగుతున్న సాంప్రదాయ కార్యక్రమం. ఇలాంటి పవిత్రమైన యాత్రకు ప్రభుత్వాలు ముందస్తు ప్రణాళికతో ఎంతమంది భక్తులు వస్తారో అంచనా వేసి తదనుగుణంగా సౌకర్యాలు కల్పించాలి. కానీ ఈ కూటమి ప్రభుత్వం అందులో పూర్తిగా విఫలమైంది. ఇక్కడున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు గిరి ప్రదక్షిణకు నాలుగు రోజుల ముందు ఏదో తూతూమంత్రంగా రివ్యూలు చేయడం, హడావుడి చేయడం, పబ్లిసిటీ చేసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప భక్తుల సౌకర్యాల గురించి ఆలోచించలేదు. నిన్న సాయంత్రం 3:30, 4:00 గంటలకే భక్తులు భారీగా తరలివస్తున్నారని తెలిసినా ఏ ఒక్క అధికారీ పట్టించుకోలేదు". సాంప్రదాయాల ఉల్లంఘన – తొలి పావంచా గందరగోళం "తమ స్వార్థ ప్రచారం కోసం, 'ఇన్ని లక్షల మంది వచ్చారు' అని గొప్పలు చెప్పుకోవడం కోసం వందల సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయాలను కూడా పక్కన పెట్టారు. సింహాచలం గిరి ప్రదక్షిణ అంటే తొలి పావంచా వద్ద కొబ్బరికాయ కొట్టి, సంకల్పం చెప్పుకొని 32 కిలోమీటర్లు పాదయాత్ర చేసి స్వామివారిని దర్శించుకోవడం ఆచారం. కానీ హోం మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, స్థానిక నాయకులు ప్రెస్ మీట్ పెట్టి 'ఆరు చోట్ల తొలి పావంచాలు ఏర్పాటు చేశాం, ఎక్కడి నుంచైనా ప్రారంభించవచ్చు' అని చెప్పడం ఎంతవరకు సమంజసం? తొలి పావంచా విశిష్టతను, భక్తుల నమ్మకాలను దెబ్బతీస్తూ ప్రజలను కన్ఫ్యూజ్ చేశారు. హోం మినిస్టర్ ధర్మశాస్త్రాలు చెప్పడం ఏమిటి? ఆచారాలు మార్చాలంటే ఆలయ పండితులు చెప్పాలి తప్ప రాజకీయ నాయకులు నిర్ణయించడం ఏమిటి?. దేవాదాయ శాఖ మంత్రి నిర్లక్ష్యం – సింహగిరిపై ద్రోహం.. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు ఏమైనా మౌనవ్రతంలో ఉన్నారా? గతంలో చందనోత్సవంలో ఘటనలు జరిగినప్పుడు కూడా ఆయన సరిగ్గా స్పందించలేదు. ఇంత పెద్ద పవిత్రమైన కార్యక్రమం జరుగుతుంటే పక్కనబెట్టి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం విచారకరం. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిపై చిన్నచూపే. గతంలో పవిత్రమైన సింహగిరి ప్రాంతంలో సెంట్రల్ జైలు, ఆర్టీసీ డిపోలు తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ పేరుతో గుడికి కూతవేటు దూరంలో ఉన్న 160 ఎకరాల స్వామివారి పవిత్ర భూములను కేటాయించారు. మీరు చేస్తున్న అన్యాయాలకు, ద్రోహానికి స్వామి వారిని వేడుకుని క్షమాపణ చెప్పకపోతే, లక్ష్మీ నరసింహ స్వామి ఉగ్రరూపానికి కూటమి నాయకులు బలికాక తప్పదు. జీవీఎంసీ దోపిడీ – నీళ్లు ఇవ్వలేని అసమర్థత.. 32 కిలోమీటర్లు సుదీర్ఘంగా పాదయాత్ర చేసే భక్తులకు కనీసం తాగునీరు కూడా అందించడంలో జీవీఎంసీ మరియు ప్రభుత్వ యంత్రాంగం దారుణంగా విఫలమైంది. అధికారులు, జీవీఎంసీ కమిషనర్ కేవలం తమ రాజకీయ నాయకుల ప్రోటోకాల్స్, దర్శనాలకే పరిమితమయ్యారు తప్ప ప్రజల సంక్షేమం పట్టించుకోలేదు. టెండర్లు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టుల పేరుతో డబ్బులు దండుకోవడం, దోపిడీ చేయడంపైనే దృష్టి పెట్టారు. నిన్నటి కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, సేవా సంఘాలు, చారిటబుల్ ట్రస్టులు మరియు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా వాలంటీర్లుగా మారి నీళ్లు, సేవలు అందించబట్టే పరిస్థితి కొద్దిగా సర్దుమనిగింది. లేకపోతే పరిస్థితి మరింత భయానకంగా ఉండేది. చివరికి పచ్చ పత్రికల్లో కూడా నిన్నటి ప్రత్యక్ష నరకంపై కథనాలు వచ్చాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైఎస్సార్‌సీపీ ప్రధాన డిమాండ్లు: ఈ నేపధ్యంలో నిన్నటి గిరి ప్రదక్షిణ నిర్వహణలో విఫలమైన ప్రభుత్వ యంత్రాంగం, జీవీఎంసీ, పోలీసు మరియు దేవాదాయ శాఖల నిర్లక్ష్యంపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ (ఎంక్వయిరీ) జరిపించి, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులను, దోపిడీకి పాల్పడిన బాధ్యులను కఠినంగా శిక్షించడంతో పాటు, సింహాచలం స్వామివారి విషయంలో చేసిన అపరాధానికి కూటమి ప్రభుత్వం భక్తులకు, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కే కే రాజు డిమాండ్ చేశారు.