ఉచిత పంటల బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలి

ఎంవీఎస్‌ నాగిరెడ్డి డిమాండ్‌

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం, రైతు సంక్షేమం) ఎంవీఎస్‌ నాగిరెడ్డి.

ఉచిత పంటల బీమాపై ఎన్నికల ముందు హామీ

మరింత మెరుగ్గా అమలు చేస్తామని నమ్మించారు

ఆ తర్వాత మొత్తం పథకం ఎత్తివేసి దగా చేశారు

ప్రభుత్వ తీరుపై ప్రెస్‌మీట్‌లో ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఫైర్‌

తాడేపల్లి: రైతు పక్షపాతి అయిన శ్రీ వైయస్‌ జగన్, తన పాలన సమయంలో ఆ అయిదేళ్లూ ఉచిత పంటల బీమాను పక్కాగా అమలు చేస్తూ, రైతుల తరపున కూడా మొత్తం ప్రీమియమ్‌ను ప్రభుత్వం తరపున కట్టారని వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం, రైతు సంక్షేమం) ఎంవీఎస్‌ నాగిరెడ్డి గుర్తు చేశారు. పథకంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ తుంగలో తొక్కిన చంద్రబాబు, ఇప్పుడు బీమా ప్రీమియమ్‌ రైతులు స్వయంగా చెల్లించాలంటూ వారిపై అదనపు భారం మోపుతున్నారని ఆయన ఆక్షేపించారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ శాఖ, బీమా కంపెనీల ద్వారా ‘పంటల బీమా ప్రీమియం చెల్లించండి – ఆర్థిక భరోసా పొందండి‘ అంటూ ప్రచారం చేస్తున్నారని, ఇదే సమయంలో సీఎం చంద్రబాబు ‘ప్రతి పంటకు బీమా చెల్లించాల్సిందే‘ అని ప్రకటనలు చేస్తూ రైతాంగం నడ్డి విరుస్తున్నారని ఆగ్రహించారు. అయితే గత ఐదేళ్లలో రైతుల తరఫున ప్రభుత్వం చెల్లించిన ప్రీమియాన్ని ఇప్పుడు ఎందుకు రైతులపైనే మోపుతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎంవీఎస్‌ నాగిరెడ్డి నిలదీశారు.
ప్రెస్‌మీట్‌లో ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

నాడు ఉచిత పంట బీమాతో అండ:
    వ్యవసాయాన్ని పండగలా భావించిన శ్రీ వైయస్‌ జగన్, నాడు తన పాలనలో రైతాంగం కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని అమలు చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయే రైతులకు పూర్తి రక్షణ కల్పించేలా దేశంలోనే తొలిసారిగా ఉచిత పంటల బీమా పథకాన్ని అత్యంత విజయవంతంగా అయిదేళ్లు అమలు చేసి చూపారు. రైతులపై ఒక్క రూపాయి ప్రీమియం భారం కూడా వేయకుండా, వారికి ఎంతో అండగా నిల్చారు. 

ఎల్‌నినో సాకుతో రైతులపై  ఒత్తిడి సరికాదు:
    ఉచిత పంటల బీమా పథకంపై ఎన్నికల్లో మాయమాటలు చెప్పి నమ్మించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే, అడ్డం తిరిగారు. పథకాన్ని పూర్తిగా నీరుగార్చారు. ఇంకా ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల పేరుతో రైతులను భయపెట్టి ప్రీమియం కట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలోనే కొన్ని పంటలకు ఎకరానికి రూ.1,140 వరకు, బత్తాయికి రూ. 2,750, అరటికి రూ.3,000, మిరపకు రూ.1,440 వరకు ప్రీమియం చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.  ఇప్పటికే పెట్టుబడి భారంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ ప్రీమియం చెల్లింపుల ఒత్తిడి వారిపై మరింత ఆర్థిక భారం  మోపుతోంది. రాష్ట్రంలో వర్షాలపై అనవసర భయాందోళనలు సృష్టించడం కూడా సరైన పద్ధతి కాదు. రాష్ట్రంలో ఇప్పటికీ వర్షాకాలం కొనసాగుతోంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల వరకు వర్షాకాలం కొనసాగుతుంది.  అధికారిక గణాంకాల ప్రకారం వర్షపాతం క్రమంగా పెరుగుతోందని, రైతులను నిరుత్సాహపరిచే ప్రకటనలు చేయడం ప్రభుత్వం మానుకోవాలి. 

రూ.500 కోట్లు కేటాయించి కొనుగోళ్లు చేయాలి:
    రాష్ట్రంలో పొగాకు రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. మార్కెట్లో ధరలు దారుణంగా పడిపోవడంతో రైతులు భారీ నష్టాలు చవి చూస్తున్నారు. ఒంగోలు సహా పలు ప్రాంతాల్లో రైతు సంఘాలే స్వచ్ఛందంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం కనీసం ₹500 కోట్లతో మార్క్‌ఫెడ్‌ను మార్కెట్లోకి దించి కొనుగోళ్లు చేపడితే, తద్వారా పోటీ పెరిగి రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. రాష్ట్రంలో 94 మిలియన్‌ కేజీల పోగాకు ఉత్తత్తి ఉండగా, రూ.188 కోట్లు వెచ్చించి రైతులకు పెద్ద ఎత్తున మేలు చేసినట్లుగా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. ప్రభుత్వానికి సరైన మార్కెటింగ్‌ విధానం లేక ఈ ఏడాది రైతాంగం దాదాపు రూ.3,300 కోట్లు నష్టపోయింది.
    అదే గత ప్రభుత్వ హయాంలో నాటి సీఎం శ్రీ వైయస్‌ జగన్, పొగాకు రైతులకు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా గిట్టుబాటు ధర కల్పించి పంట కొనుగోలు చేసారు. ఆ దిశలో ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వం, ఏదో కొందరు రైతులకే పరిమిత ప్రయోజనం కలిగే ప్రకటనలు చేయడం కాకుండా, మొత్తం రైతాంగానికి న్యాయం చేసే విధంగా ధరల స్థిరీకరణ చర్యలు తీసుకోవాలి.
    ఇంకా రైతుల నష్టాల నుంచి బయటపడే విధంగా ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రకటించాలని, అలాగే రైతులకు పెండింగ్‌ బకాయిలన్నింటినీ విడుదల చేసి వారిని ఆదుకోవాలని ఎంవీఎస్‌ నాగిరెడ్డి తేల్చి చెప్పారు.

Back to Top