డీఎస్సీ అక్రమాలపై నారా లోకేష్‌ రాజీనామా చేయాలి

స్పోర్ట్స్‌ కోటా భర్తీలో గోల్‌మాల్‌పై సీబీఐ విచారణ జరిపించాలి

మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ డిమాండ్‌ 

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌.

కొండేపిలో పాలేరు నదిలో టీడీపీ నాయకుల ఇసుక దోపిడీ

వారిపై పీడీ యాక్టు నమోదు చేయాలని మైన్స్‌ అండ్‌ జియాలజీ శాఖ పోలీసులకు లేఖలు 

అక్రమ ఇసుక తవ్వకాలపై పోలీసులపై హైకోర్టు ఆగ్రహం 

హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేస్తున్న కూటమి ప్రభుత్వం

మంత్రి డోలా అండదండలతో రెచ్చిపోతున్న ఇసుక దోపిడీ ముఠా 

ఇసుక దోపిడిపై మాజీ మంత్రి సురేష్‌ ఆగ్రహం  

తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు చేస్తున్న అక్రమ ఇసుక తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని కోరారు. ఇసుక దోపిడీకి బాధ్యత వహిస్తూ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలు, పేపర్‌ లీకేజీ, స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లో అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలు విజయవంతమయ్యాయని తెలిపారు. డీఎస్సీ అక్రమాలపై లోకేష్‌ తో బహిరంగ చర్చకు తాను కూడా సిద్ధమని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ సవాల్‌ విసిరారు. 
ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:

డీఎస్సీపై లోకేష్‌తో చర్చకు సిద్ధం:
    టీచర్‌ ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా సిద్ధమైన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం డీఎస్సీ నియామకాలను అక్రమాలతో కలుషితం చేసింది. స్పోర్ట్స్‌ కోటాలో అర్హులను పక్కనపెట్టి అధికార పార్టీకి చెందిన వారికి ఉద్యోగాలు కల్పించేందుకు జీవోలను మార్చారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను మా పార్టీ ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది. అయినప్పటికీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ సమాధానం చెప్పకుండా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే, విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తప్పుకుని స్వతంత్ర దర్యాప్తు సంస్థ లేదా సీబీఐతో విచారణ జరిపించాలి. డీఎస్సీ నియామకాలలో మెరిట్‌ లిస్టులు, రోస్టర్లు బహిరంగంగా ప్రకటించలేదు. ఇది పారదర్శకత లోపానికి నిదర్శనం. డీఎస్సీ వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ తో బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. 

కొండపిలో టీడీపీ నాయకుల ఇసుక అక్రమ మైనింగ్‌:
    రాష్ట్రంలో గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ఇసుక, గ్రావెల్, రేషన్‌ బియ్యం దోపిడీకి పాల్పడుతోంది. 2024 జూన్‌ నుంచి ఇప్పటి వరకు 37 సార్లు ఆధారాలతో అక్రమ ఇసుక తవ్వకాల అంశాన్ని ప్రస్తావించినా ప్రభుత్వం స్పందించలేదు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలం పాలేరు నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై గనుల శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖలకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. మైనింగ్‌ శాఖ అధికారులే స్వయంగా టిడిపి మండల ప్రెసిడెంట్లు, క్లస్టర్‌ ఇంచార్జులు, మాజీ ఎంపిపిల పేర్లను (అనుమోలు సుధా, పోకూరి రవి, దాసరి కృష్ణారావు, ఎర్ర నరేంద్ర, కొండగుంట శ్రీనివాసరావు మొదలైనవారు) రాస్తూ, వీరిపై పిడి యాక్ట్‌ పంపాలని లేదా మండల బహిష్కరణ చేయాలని పోలీసులకు, రెవెన్యూ అధికారులకు లేఖలు రాసినా ఎలాంటి యాక్షన్‌ తీసుకోలేదు.
    హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్‌ అక్రమ తవ్వకాలపై విచారణ జరిపి, పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసినా, స్థానిక మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అండదండలు ఉండటంతో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. మైన్స్‌ అండ్‌ జియాలజీ శాఖ టీడీపీకి చెందిన పలువురు స్థానిక నాయకుల పేర్లతో పోలీసులకు లేఖలు రాసి, వారిపై పీడీ చట్టం వంటి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అయినప్పటికీ అవి అమలు కాలేదు. హైకోర్టు పలుమార్లు ప్రశ్నించినా అధికార యంత్రాంగంలో ఎలాంటి మార్పు రాలేదు. 

మంత్రి బాల వీరాంజనేయ స్వామి రాజీనామా చేయాలి:
    కొండేపి నియోజకవర్గంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని లెక్కించాలి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అక్రమ మైనింగ్‌పై కూడా సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. హైకోర్టు ఆదేశాలు, మైన్స్‌ శాఖ నివేదికలు, అధికారిక పత్రాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. మంత్రి ఆదేశాలతోనే అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, లేదా సీఎం చంద్రబాబే ఆయన్ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కూటమి క్యాబినెట్‌ అంతా ‘దోచుకో, పంచుకో, తినుకో  విధానంతో నడుస్తోంది. యువత మరియు ప్రజల హక్కు సాధన కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో మరిన్ని రూపాల్లో తీవ్రతరం చేస్తుందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు.

Back to Top