రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనకు టాస్క్ ఫోర్స్ కమిటీల ఏర్పాటుపై చర్చ

 జిల్లా వారీగా ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పర్యటనలకు కార్యాచరణ సిద్ధం

క‌డప:  రాయలసీమ ఎత్తిపోతల పథకం (RLIP)తో పాటు గ్రేటర్ రాయలసీమలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల సాధన కోసం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టాస్క్ ఫోర్స్ కమిటీల ఏర్పాటును వేగవంతం చేయాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తెలిపారు. ఈ మేరకు ఆయన వైయ‌స్ఆర్ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో టాస్క్ ఫోర్స్ కమిటీల ఏర్పాటు, వాటి బాధ్యతలు, ప్రజలు, రైతులు, సాగునీటి నిపుణులు, పార్టీ నాయకులను భాగస్వామ్యం చేసే విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాయలసీమ సాగునీటి హక్కుల సాధనలో ప్రజల భాగస్వామ్యం కీలకమని అభిప్రాయపడ్డారు.

 వైయ‌స్ఆర్ కడప జిల్లాలోని రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఇతర ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు నిర్వహించనున్న ప్రాజెక్టుల పర్యటనకు సంబంధించి తేదీలు, పర్యటన రూపకల్పన, కార్యాచరణపై కూడా చర్చించారు. రాయలసీమకు సాగునీటి హక్కులు సాధించడం, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయించేందుకు వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టనున్న ఉద్యమంలో అసెంబ్లీ స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీల ఏర్పాటు, ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పర్యటనలు కీలకంగా ఉంటాయని నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైయ‌స్ఆర్ కడప జిల్లా టాస్క్ ఫోర్స్ కోఆర్డినేటర్ పులి సునీల్, బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధ, పార్టీ ఐటీ విభాగం జోనల్ అధ్యక్షుడు మంజునాథ్ యాదవ్‌తో పాటు ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
 

Back to Top