గుంటూరు ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనం

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆగ్ర‌హం 

తాడేపల్లి: గుంటూరు నగరంలో ఓ మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చ అని, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత దారుణంగా క్షీణించాయో చెప్పడానికి ఇది నిలువెత్తు నిదర్శనమని మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, ఈ దారుణానికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు.

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..
గుంటూరు నగరంలో ఒక మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చ మాత్రమే కాదు.. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం. ఈ దారుణానికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. బుధవారం ఘటన జరిగితే.. మూడు రోజులపాటు దాన్ని కప్పిపెట్టినా, చివరకు ఆ వీడియోలు సోషల్‌మీడియాలో బయటకు వచ్చి, రాష్ట్ర ప్రజలంతా చూసి ఈ పరిపాలనను అసహ్యించుకున్న తర్వాత, ఇప్పుడు తానేదో గొప్పగా చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబుగారు హడావుడి చేయడం మరింత సిగ్గుచేటు. ఆ వీడియోలు కప్పిపుచ్చేదానిపై శ్రద్ధచూపే బదులు, బుధవారమే తనపై తొలిసారే దాడి జరిగిన తర్వాత, బాధిత మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వారు స్పందించి ఉండి ఉంటేగనక, ఆ తర్వాత ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదుకదా? ఆమె ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగేదా? ఫిర్యాదు చేసిన మహిళకు రక్షణ కల్పించకుండా మౌనం వహించడం ఎంతవరకు న్యాయం? ఇక పోలీస్‌స్టేషన్లు ఉన్నది ఎందుకు? బాధితుల ఫిర్యాదులను స్వీకరించడానికా? లేక అధికార పార్టీ నాయకులు ఏంచెప్తే అది చేయడానికా? బాధితురాలికి అండగా నిలవకపోగా, పంచాయితీ చేయడానికి ప్రయత్నిస్తారా? వీడియోలు బయటకు వస్తేనే చట్టం మేల్కొంటుందా? బాధితురాలి మాటకు, ఆమె ఫిర్యాదుకు విలువ లేదా? నేరం జరుగుతున్నప్పుడు స్పందించకుండా, ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికిన తర్వాత చర్యల పేరుతో నాటకాలు ఆడడం ఏ రకమైన పోలీసింగ్‌? రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సోషల్‌మీడియా యాక్టివిస్టులపై ఈ చంద్రబాబుగారి ప్రభుత్వం దగ్గరుండి దాడులను ప్రోత్సహించింది. ఆ అరాచకాలను కప్పిపుచ్చడానికి పోలీసు వ్యవస్థను రాజకీయ ఆయుధంగా మార్చింది. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా, ప్రతిపక్షాలపైనా, బాధితులపైనా వేధింపులకు, అక్రమ కేసులకు ఒక సాధనంగా మార్చి రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్‌గా దిగజార్చింది. అధికార పార్టీ నాయకులు ఏం చేసినా ఈ పోలీసులు తమను రక్షిస్తారనే ధైర్యం ఈ రెడ్‌బుక్‌పాలనలో గ్రామాలు, వార్డులు, డివిజన్ల స్థాయి వరకూ పాకింది. అందుకే టీడీపీ కూటమికి చెందిన పలువురు నాయకులు దుశ్శాసనుల్లా తయారయ్యారు. ఎలాంటి దారుణాలుచేసినా, ముఖ్యంగా మహిళలపై దాడి చేసినా, వారిని అవమానించినా, వేధించినా తమకు ఏమీ కాదని, తమను కాపాడ్డానికి చంద్రబాబుగారు ఉన్నారనే ధైర్యం, వారిలో పెరిగిపోయింది. ఇది చివరకు రాష్ట్రంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా చేసింది. అధికార పార్టీ నాయకుల దురాగతాల నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన దుస్థితిలోకి మహిళలను నెట్టేసింది. చంద్రబాబుగారూ… ఇదేనా మీరు చెప్పే మహిళా భద్రత? ఇదేనా మీ సుపరిపాలన? ఇదేనా మీ పోలీసింగ్‌? చంద్ర‌బాబు  గారూ, మహిళల ఆగ్రహమే మీ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్తుంది. 

Back to Top