గిరిపురంలో డయేరియా బాధితులను పరామర్శించిన మల్లాది విష్ణు

ప్రజారోగ్యాన్ని కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం

విజయవాడ: విజయవాడ నగరంలోని గిరిపురంలో డయేరియా బాధితులను వైయ‌స్ఆర్‌సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరామర్శించారు. స్థానిక మాజీ కార్పొరేటర్ కుక్కల అనితతో కలిసి బాధితుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నగరపాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే డయేరియా విజృంభించిందని మండిపడ్డారు. గిరిపురంలో కలుషిత తాగునీటి సరఫరా, పూడుకుపోయిన డ్రైనేజీలు, అధ్వాన్న పారిశుధ్య పరిస్థితుల కారణంగానే ప్రజలు డయేరియా బారిన పడుతున్నారని అన్నారు. స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని, ప్రస్తుతం 20 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. డీహైడ్రేషన్ కారణంగా కొందరిలో కిడ్నీ సమస్యలు తలెత్తడం ఆందోళన కలిగించే విషయమన్నారు.

గతంలో న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా ఘటన జరిగినా ప్రభుత్వం ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని విమర్శించారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ డ్రైనేజీల శుభ్రత, తాగునీటి నాణ్యతపై ముందస్తు చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు, మందులు, స్ట్రెచర్లు కూడా అందుబాటులో లేవని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు సమర్థవంతంగా అమలు కాకపోవడంతో పేదలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స కోసం అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టడం మానేసి ప్రజారోగ్య రక్షణపై దృష్టి సారించాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. గిరిపురంతో పాటు నగరంలోని ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే పారిశుధ్య చర్యలు చేపట్టి, సురక్షిత తాగునీరు అందించాలని, బాధితులకు మెరుగైన ఉచిత వైద్యం కల్పించాలని కోరారు. ప్రజారోగ్య సమస్యలపై వైయ‌స్ఆర్‌సీపీ తరఫున ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

 విజయవాడ సెంట్రల్‌లో జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ

  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు జగన్ 2.0 సూపర్ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ, సోషల్ మీడియా కార్యకర్తలపై నమోదవుతున్న అక్రమ కేసులు, రాజకీయ వేధింపులను ఎదుర్కొనేందుకు, పార్టీ నాయకత్వం–కార్యకర్తల మధ్య బలమైన అనుసంధానం కల్పించేందుకే జగన్ 2.0 సూపర్ యాప్‌ను రూపొందించామని తెలిపారు. ఇప్పటికే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని డివిజన్ స్థాయిలో 4,200 మందికి పైగా కార్యకర్తలు యాప్‌లో నమోదు చేసుకున్నారని వెల్లడించారు. స్థానిక సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించిన పోస్టులను పార్టీ కేంద్ర కార్యాలయం నేరుగా పర్యవేక్షిస్తుందని, ప్రతి వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త, మద్దతుదారు తప్పనిసరిగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర పరిస్థితులపై స్పందించిన మల్లాది విష్ణు, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. కొత్త పెన్షన్లు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందని, ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం 8వ స్థానానికి పడిపోయిందని పేర్కొన్నారు.
 

Back to Top