ఇచ్చాపురం: వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకులను పార్టీ నాయకత్వంతో అనుసంధానం చేయడంతో పాటు ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే వేదికగా జగన్ 2.0 సూపర్ యాప్ ఉపయోగపడుతుందని వైయస్ఆర్‌సీపీ నాయకులు పేర్కొన్నారు. ఇచ్చాపురంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు, నాయకులతో కలిసి జగన్ 2.0 సూపర్ యాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలపై వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు చేసే పోస్టులను అడ్డుకునేందుకు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ పార్టీ కార్యకర్తలకు రక్షణగా, నాయకత్వంతో ప్రత్యక్ష అనుసంధాన వేదికగా జగన్ 2.0 సూపర్ యాప్ రూపొందించబడిందని తెలిపారు. పలాస నియోజకవర్గంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందడం బాధాకరమని పేర్కొంటూ, ప్రమాదంలో గాయపడిన మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కుమారుడు వర్మను నిర్బంధంలోకి తీసుకోవడం, అప్పలరాజు కుటుంబ సభ్యులను వేధించడం రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణించారు. వైద్యుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు సేవలందించిన డాక్టర్ అప్పలరాజుపై ఇటువంటి చర్యలు అన్యాయమని అన్నారు. ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, మూలపేట పోర్టు వంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. ఇటీవల విశాఖపట్నానికి చెందిన మత్స్యకారుల కుటుంబాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన అనంతరం, ఆయనపై మంత్రి అచ్చెన్నాయుడు, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు మానుకుని వాస్తవాలను ప్రజలకు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.