డిజిటల్ రాజకీయాలకు నాంది పలికిన జగన్ 2.0 సూపర్ యాప్

 పార్టీ కార్యకర్తలందరూ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని డిజిటల్ ఉద్యమంలో భాగస్వాములు కావాలి: వై. నైరుతి రెడ్డి

 గుంతకల్లు: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పార్టీ సంస్థాగత బలోపేతం, కార్యకర్తలతో ప్రత్యక్ష అనుసంధానం, ఆధునిక సాంకేతికత వినియోగానికి మరో ముందడుగుగా ప్రారంభించిన జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్‌ను గుంతకల్లులో ఆవిష్కరించారు. వైయ‌స్ఆర్‌సీపీ గుంతకల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు ఆయన క్యాంపు కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షురాలు  వై. నైరుతి రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వై. నైరుతి రెడ్డి మాట్లాడుతూ, గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్రస్థాయి నాయకత్వం వరకు ప్రతి ఒక్కరినీ ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడమే జగన్ 2.0 సూపర్ యాప్ లక్ష్యమని తెలిపారు. పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు, లైవ్ అప్‌డేట్లు, సోషల్ మీడియా ప్రచారం, ప్రజా సమస్యల నమోదు, నాయకత్వంతో ప్రత్యక్ష కమ్యూనికేషన్ వంటి అనేక సేవలు ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయని చెప్పారు. పార్టీ కార్యకర్తలు తమ కార్యకలాపాలను నమోదు చేసుకోవడంతో పాటు ప్రజా సమస్యలను నేరుగా పార్టీ దృష్టికి తీసుకురావచ్చని, వాటిపై పార్టీ వేగంగా స్పందించే విధంగా ప్రత్యేక వ్యవస్థను ఈ యాప్‌లో రూపొందించారని తెలిపారు. ప్రతి కార్యకర్త సేవలను గుర్తిస్తూ పార్టీని మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తల గొంతును అణచివేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించిన ఆమె, రాజకీయ, పోలీసు వేధింపులకు గురైన ప్రతి కార్యకర్త జగన్ 2.0 సూపర్ యాప్ ద్వారా తన ఫిర్యాదును నమోదు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త జగన్ 2.0 సూపర్ యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకుని డిజిటల్ ఉద్యమంలో భాగస్వామి కావాలని వై. నైరుతి రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, పట్టణ, మండల, నియోజకవర్గ నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Back to Top