అమలాపురం: దివంగత కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్మారకార్థం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హాజరై ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, ముద్రగడ పద్మనాభం ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం జీవితాంతం రాజీలేని పోరాటం చేసిన విలువలతో కూడిన నాయకుడని కొనియాడారు. ఆయన ప్రజాసేవ, ఉద్యమస్ఫూర్తి, సమాజం పట్ల అంకితభావం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. అనంతరం జిల్లా నాయకులు, పార్టీ శ్రేణులు కలిసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ముద్రగడ పద్మనాభం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్య నాయకులు, సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు, సీఈసీ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శులు, ఎస్‌ఈసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.