తిరుపతి: రాష్ట్రంలో కరువు తీవ్ర రూపం దాల్చిందని, ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దుర్భిక్ష పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రైతుల జీవనం పతనం అంచుకు చేరిందని, పశువులకు మేత, నీరు లేక కబేళాలకు తరలించే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 8 లక్షల 76 వేలకు పైగా పశువులు, 9 లక్షల 49 వేల 236 గొర్రెలు, 4 లక్షల 86 వేల 130 మేకలు కరువు కోరల్లో విలవిల్లాడుతున్నాయని చెప్పారు. ప్రతి మండలానికి 20 నీటి తొట్టెలు ఉండాల్సి ఉండగా కనీసం మూడు, నాలుగు కూడా అందుబాటులో లేవని పేర్కొన్నారు. రైతులకు ఉచితంగా పశుగ్రాసం, ఎండు గడ్డి, పశుగ్రాస విత్తనాలు అందించడంతో పాటు పశు శిబిరాలు ఏర్పాటు చేయాలని, శిబిరాల్లో నాసిరకం మందుల సరఫరాను అరికట్టాలని కోరారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 67 మండలాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించిన చంద్రబాబు, ఇప్పుడు రాష్ట్రంలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. చంద్రబాబు రైతు ద్రోహి: రైతు కుటుంబం నుంచి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు రైతు ద్రోహిగా మారిపోయారని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కరువు విలయతాండవం చేస్తుంటే నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని, చిత్తూరు జిల్లాలో పశుసంపదకు అపార నష్టం వాటిల్లుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. పదవీ విరమణకు దగ్గరగా ఉన్న దామోదర్ నాయుడును మళ్లీ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌గా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో పాడి పరిశ్రమపై ఆధారపడిన రైతుల పరిస్థితిని పట్టించుకోకుండా హెరిటేజ్ ఆదాయంపైనే దృష్టి పెట్టడం సరికాదన్నారు. గొర్రెలు, మేకలకు కూడా గ్రాసం కొరత ఏర్పడిందని, పశుసంపదను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం వెంటనే మేల్కొని రైతులు, పశుసంపదను ఆదుకోవాలని భూమన కరుణాకర్ రెడ్డి కోరారు.