విశాఖపట్నం: ఉమా ధర్మలింగేశ్వర ఆలయాన్ని పరిరక్షించేందుకు ఈ నెల 21న నిర్వహించనున్న ఛలో పంచదార్ల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైయస్ఆర్‌సీపీ విశాఖ, విజయనగరం ఉమ్మడి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. పంచదార్లలో కొనసాగుతున్న దీక్షలకు మద్దతు తెలిపిన ఆయన, ఆలయ పరిసరాల్లో జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉమా ధర్మలింగేశ్వర ఆలయానికి ముప్పుగా మారిన మైనింగ్ కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని, స్థానిక ఎంపీ సీఎం రమేష్, స్థానిక ఎమ్మెల్యే విజయకుమార్‌కు సంబంధించినట్లు ఆరోపిస్తున్న మైనింగ్ లీజులను 48 గంటల్లో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పంచదార్ల కొండల చుట్టూ 30 కిలోమీటర్ల పరిధిని 'నో మైనింగ్ జోన్`గా ప్రకటించి ఆలయ పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉమా ధర్మలింగేశ్వర ఆలయ పరిరక్షణ కోసం చేపట్టిన పోరాటానికి ప్రజలు, భక్తులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ జూలై 21న జరిగే ఛలో పంచదార్ల కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వైయస్ఆర్‌సీపీ నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.