జగన్ 2.0 సూపర్ యాప్‌తో కార్యకర్తలకు డిజిటల్ భరోసా

 ప్రతి కార్యకర్త పార్టీ నాయకత్వంతో నేరుగా అనుసంధానమవుతారు: డాక్టర్ సాకే శైలజానాథ్

 శింగనమల:  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించిన  జగన్ 2.0 సూపర్ యాప్ ను శింగనమల నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు.

డాక్టర్ సాకే శైలజానాథ్ మాట్లాడుతూ, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో డిజిటల్ యుగానికి నాంది పలికే కార్యక్రమమే జగన్ 2.0 సూపర్ యాప్ అని అన్నారు. కార్యకర్తలను పార్టీ నాయకత్వంతో నేరుగా అనుసంధానిస్తూ, పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, కార్యకర్తల ఫిర్యాదులు, అధికారిక సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ యాప్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. జగన్ 2.0 సూపర్ యాప్ కేవలం ఒక మొబైల్ అప్లికేషన్ మాత్రమే కాదని, ప్రతి కార్యకర్తకు రక్షణ కవచంగా, ప్రతి గ్రామానికి పార్టీతో అనుసంధాన వేదికగా, ప్రతి సమస్యకు స్పందించే డిజిటల్ వ్యవస్థగా పనిచేస్తుందని వివరించారు.

సోషల్ మీడియాలో నిజాలను అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి సొంత డిజిటల్ వేదికను అందుబాటులోకి తీసుకురావడం ముందుచూపుతో తీసుకున్న నిర్ణయమన్నారు. శింగనమల నియోజకవర్గంలోని ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి సోషల్ మీడియా వారియర్ తప్పనిసరిగా జగన్ 2.0 సూపర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతానికి ఈ యాప్ కీలకంగా ఉపయోగపడుతుందని, కార్యకర్తల సమస్యలు, ప్రజా సమస్యలు, పార్టీ కార్యక్రమాలు మరింత వేగంగా నాయకత్వానికి చేరే అవకాశం కలుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి, ప్రతి కార్యకర్తకు యాప్‌ను చేరవేసి వైయ‌స్ఆర్‌సీపీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వంశీ గోకుల్ రెడ్డి, బొమ్మన శ్రీరామా రెడ్డి, బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి, శ్రీనివాసులు నాయక్, భాస్కర్ రెడ్డి, వి. రామకృష్ణ రెడ్డి, ఎన్.వి. నారాయణ, బండి శ్రీనివాసులు, బండి లలిత కళ్యాణి, శివమ్మ, వెంకటరాముడు, నూర్ మహమ్మద్, అబ్దుల్, జల్లి గోపి యాదవ్, మాజీ డీలర్ ఆదినారాయణ, కిరణ్ నాయక్, బ్యాల్ల ధనుంజయతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
 

Back to Top