తాడేపల్లి: రాజధాని అమరావతి ప్రాంతంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న బలవంతపు భూసేకరణ, అక్రమాలు, బాధితుల కష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వెళ్లిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై రైతుల ముసుగులో టీడీపీ గూండాలు జరిపిన హత్యాయత్నంపై వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య మండిపడ్డారు. తమ పర్యటనతో అమరావతిపై వాస్తవాలు బయటపడుతున్న నేపధ్యంలో ... ఎల్లో మీడియా ఒక పథకం ప్రకారం అబద్ధపు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియాకు వీడియో బైట్ విడుదల చేస్తూ.. చంద్రబాబు ‘రెడ్ బుక్’ అరాచకాలకు, పచ్చ మీడియా తప్పుడు కేసుల బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎన్ని నిర్భంధాలు ఎదురైనా వైయస్.జగన్ నేతృత్వంలో విద్యార్ధులు, ప్రజల తరపున పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే.. - ప్రభుత్వ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే దాడులు... కూటమి ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో రైతుల భూములను బలవంతంగా లాక్కుంటూ, కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని.. ఈ అకృత్యాలపై బాధితులు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ కి మొరపెట్టుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన మాపై టీడీపీ గుండాలు రౌడీల్లా ప్రవర్తించారు. ప్రభుత్వ అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే మా పర్యటనను అడ్డుకున్నారు. రైతుల ముసుగులో టీటీపీ కార్యకర్తలు, నేతలు రాళ్లు, కోడిగుడ్లు విసిరి మా పై దాడి చేస్తూ హత్యాయత్నానికి పూనుకున్నారు. మా వాహనాలను కూడా ధ్వంసం చేశారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించి పోలీసులపై కూడా రాళ్లదాడి చేశారు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా మాపై దుష్ప్రచారం చేస్తోంది. - నేను రౌడీషీటర్‌ను కాదు.. విద్యార్థి నాయకుడిని! గడిచిన రెండు రోజులుగా ఎల్లో మీడియా నాపై ‘రౌడీషీటర్’ అంటూ పచ్చి అసత్యాలను ప్రచారం చేస్తోంది. కూటమి నేతలకు, పచ్చ మీడియాకు నేను ఒకటే స్పష్టం చేస్తున్నాను. నేను రౌడీషీటర్‌ను కాదు.. విద్యార్థుల హక్కుల కోసం పోరాడే బాధ్యతాయుతమైన విద్యార్థి సంఘం నాయకుడిని. నాపై విద్యార్థి సమస్యల సాధన కోసం చేసిన ధర్నాలు, రాస్తారోకోల కేసులు తప్ప ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదు. నేను ఒక ఆర్యవైశ్యుడిననే చులకన భావంతోనే నాపై ఈ రకమైన బురదజల్లే కార్యక్రమానికి తెరలేపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌లకు నేను ఒక విషయాన్ని స్పష్టం చేయదల్చుకున్నాను. మీ తప్పుడు కేసులకు గానీ, మీ అనుకూల మీడియా చేసే అబద్ధపు ప్రచారాలకు గానీ పానుగంటి చైతన్య భయపడడు. విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యలపై పోరాడటం నా హక్కు. సమస్యలపై గొంతెత్తితే రౌడీషీటర్లుగా చిత్రీకరిస్తారా? మీరు ఎంతగా అణచివేయాలని చూస్తే.. మీ అరాచక పాలనపై అంతకంటే రెట్టింపు వేగంతో తిరగబడతాం. మా అధ్యక్షుడు వైయస్ జగన్ నేతృత్వంలో భవిష్యత్తులోనూ నా పోరాటాన్ని కొనసాగిస్తాను. ఇప్పటికైనా కూటమి నేతలు, పచ్చ మీడియా నాపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తక్షణమే మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.