విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని ఖాళీ స్థలాలు, కామన్ సైట్లపై అధికార పార్టీ నేతల కన్ను పడిందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. కండ్రిక ఎన్‌జీవో కాలనీలో పట్టపగలే విలువైన కామన్ సైట్‌ను కబ్జా చేసేందుకు ప్రయత్నించారని ఆయన విమర్శించారు. స్థానికుల సమాచారం మేరకు కబ్జాకు యత్నించిన స్థలాన్ని పరిశీలించిన మల్లాది విష్ణు మాట్లాడుతూ, మట్టితో నింపి స్థలాన్ని చదును చేయడంతో పాటు బోరు తవ్వడం, స్తంభాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. ఈ విషయంపై స్థానికులు మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా, అధికారులు వస్తున్నారనే సమాచారం అందడంతో అక్కడ ఉన్నవారు సామగ్రిని సర్దుకుని వెళ్లిపోయారని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో కోట్ల రూపాయల విలువైన కార్పొరేషన్ స్థలాలు వరుసగా కబ్జాలకు గురవుతున్నాయని, దీనికి వీఎంసీ ఎస్టేట్ విభాగ అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని మల్లాది విష్ణు విమర్శించారు. వీఎంసీ పరిధిలోని విలువైన ప్రభుత్వ స్థలాలకు కనీసం ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయకపోవడం అధికారుల వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. టౌన్ ప్లానింగ్, ఎస్టేట్ విభాగాల అధికారులు తమ బాధ్యతలను విస్మరించారని, భూ ఆక్రమణలు జరుగుతున్నా కళ్లుమూసుకుని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. నగరంలో అనధికార లే అవుట్లు వేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్ల కేటాయింపుల్లో కూడా తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించిన మల్లాది విష్ణు, అర్హులైన పేదలకు ఇవ్వాల్సిన ఇళ్లను టిడిపి కార్యకర్తలకు పంచిపెడుతున్నారని విమర్శించారు. ఏ ప్రాతిపదికన ఈ కేటాయింపులు జరిగాయో జిల్లా కలెక్టర్, వీఎంసీ కమిషనర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్ల కేటాయింపులు, కార్పొరేషన్ స్థలాల ఆక్రమణలపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకపోతే న్యాయపోరాటంతో పాటు వీఎంసీ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మల్లాది విష్ణు హెచ్చరించారు.