కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బెల్ట్ షాపుల పేరుతో సాగుతున్న అక్రమ అదనపు వసూళ్లను వెంటనే అరికట్టాలని మాజీ ఎంపీ, వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త రంగయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు వైయస్ఆర్‌సీపీ శ్రేణులతో కలిసి కళ్యాణదుర్గం ఎక్సైజ్ సీఐకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ, అధికార పార్టీ అండదండలతో నియోజకవర్గంలో మద్యం దోపిడీ పతాక స్థాయికి చేరుకుందని ఆరోపించారు. నియోజకవర్గవ్యాప్తంగా 372 బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి మద్యం కొనుగోలు చేసే ప్రజల నుంచి అక్రమంగా అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ బెల్ట్ షాపుల ద్వారా వస్తున్న అక్రమ ఆదాయం అంతా నేరుగా ఎమ్మెల్యే అమిలినేని జేబుల్లోకే వెళ్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అధికార బలాన్ని ఉపయోగించి నియోజకవర్గంలో సమాంతర మద్యం సామ్రాజ్యాన్ని నడుపుతున్నారని, దీనివల్ల సామాన్య ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. బెల్ట్ షాపుల వ్యవస్థను అరికట్టడంలో ఎక్సైజ్ శాఖ పూర్తిగా విఫలమైందని విమర్శించిన రంగయ్య, వెంటనే ప్రత్యేక దృష్టి సారించి అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు దొడగట్ట నారాయణ, ములకనూరు తిమ్మరాయుడు, లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతరెడ్డి, ఐదు మండలాల కన్వీనర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.