అనంతపురం: విడపనకల్లు మోడల్ స్కూల్ హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థినులు ఒకరిపై ఒకరు దాడికి యత్నించిన ఘటన రాష్ట్ర విద్యా వ్యవస్థలో నెలకొన్న లోపాలకు నిదర్శనమని వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ అన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన ఆధ్వర్యంలో పార్టీ విద్యార్థి విభాగం నాయకులు అనంతపురం ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రావుకు వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల భద్రతను ప్రభుత్వం విస్మరించింది విడపనకల్లు మోడల్ స్కూల్‌లో జరిగిన ఘటన విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విషయాన్ని స్పష్టంగా చూపిస్తోందని చంద్రశేఖర్ యాదవ్ విమర్శించారు. ఘటన అనంతరం విద్యార్థినులకు వెంటనే వైద్యసేవలు అందించడం, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంలో జరిగిన నిర్లక్ష్యంపై నిష్పాక్షిక విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి పాఠశాలలో కౌన్సిలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, హాస్టళ్లలో విద్యార్థుల భద్రతకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ప్రతి విద్యాసంస్థలో మానసిక ఆరోగ్య నిపుణులతో క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించి, విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్పందించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే విద్యార్థుల భద్రత కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను చేపడతామని వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నగర ప్రధాన కార్యదర్శులు ఫయాజ్, పులి కార్తికేయ, మనోజ్, నరేష్, శేఖర్, బబ్లు, మణికంఠ, బాబా ఇమ్రాన్, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.