తాడేపల్లి: కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రాష్ట్రానికి చెందిన రామ్మోహన్ నాయుడే ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన రంగం అభివృద్ధి చెందకపోగా పూర్తిగా తిరోగమనంలోకి పడిపోయిందని, ఈ విషయంలో కూటమి ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ధ్వజమెత్తారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో విమాన ప్రయాణికుల వృద్ధి రేటు 7.1 శాతం, సర్వీసుల రాకపోకలు 8.7 శాతం మేర పడిపోయాయని అధికారిక లెక్కలతో సహా నిలదీశారు. గత వైయస్. జగన్‌ప్రభుత్వంలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం దాదాపు పూర్తయితే, ఆ క్రెడిట్‌ను కూటమి నేతలు దొంగిలిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు అమరావతికి సమీపంలో ఉన్న విజయవాడ ఎయిర్‌పోర్ట్ కొత్త టెర్మినల్‌ను 92 నెలలు గడిచినా పూర్తి చేయకుండా పదే పదే గడువులు మారుస్తున్నారని, చుక్కలనంటుతున్న విమాన టికెట్ల ధరలను నియంత్రించడంలో కేంద్ర మంత్రి ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. సమస్యల పరిష్కారాన్ని వదిలేసి రామ్మోహన్ నాయుడు కేవలం సోషల్ మీడియా రీల్స్, పబ్లిసిటీకే పరిమితమయ్యారని మండిపడ్డారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే... క్షీణించిన ప్రయాణికులు, విమాన సర్వీసుల వృద్ధి రేటు,, గత వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2024-25 నాటికి రాష్ట్రంలోని ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికుల వృద్ధి రేటు 13 శాతంగా ఉంటే, కూటమి ప్రభుత్వం వచ్చాక 2025-26 నాటికి అది 5.9 శాతానికి పడిపోయింది. అంటే ప్రయాణికుల వృద్ధి రేటులో 7.1 శాతం తగ్గుదల నమోదైంది. అలాగే విమాన సర్వీసుల రాకపోకల వృద్ధి రేటు 11.1 శాతం నుండి 2.4 శాతానికి పడిపోయి, 8.7 శాతం మేర తిరోగమనం చెందింది. వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో శూన్య వృద్ధి – రద్దయిన అంతర్జాతీయ సర్వీసులు.. ఉత్తరాంధ్ర కేంద్రమైన విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో 2024-25లో 29.55 లక్షలుగా ఉన్న ప్రయాణికుల సంఖ్య 2025-26 నాటికి 29.65 లక్షలకు మాత్రమే చేరింది. ఇందులో ఎలాంటి వృద్ధి లేదు. పైగా విమానాల రాకపోకలు 22,210 నుంచి 21,711కి తగ్గి 2.27 శాతం మేర పడిపోయాయి. మరోవైపు ఇంటర్నేషనల్ ఫ్లైట్ కనెక్టివిటీ గురించి గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ఈ ప్రభుత్వ హయాంలోనే.. విశాఖ నుంచి నడిచే బ్యాంకాక్, కౌలాలంపూర్ అంతర్జాతీయ విమాన సర్వీసులు మే 2025 నుంచే నిలిచిపోయాయి. గ్లోబల్ కనెక్టివిటీ అని గొప్పలు చెప్పుకోవడమే తప్ప, ఉన్న సర్వీసులను కూడా నిలబెట్టుకోలేకపోయారు. రద్దవుతున్న డొమెస్టిక్ విమానాలు – కోత పడిన సర్వీసులు.. విశాఖపట్నం నుంచి భువనేశ్వర్, కర్నూలు, చెన్నై, కోల్‌కతాలకు వెళ్లే డొమెస్టిక్ సర్వీసులు రద్దయ్యాయి. అలాగే రాజధాని ప్రాంతానికి అత్యంత కీలకమైన విజయవాడ - విశాఖపట్నం మధ్య నడిచే ఇండిగో విమాన సర్వీసులను రెండు నుంచి ఒకటికి తగ్గించారు. విజయవాడ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు 7.8 శాతం మేర పడిపోయాయి. ఏడేళ్లు దాటినా పూర్తికాని విజయవాడ టెర్మినల్.. అమరావతికి సమీపంలో ఉన్న విజయవాడ కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్‌కు 2018 డిసెంబర్ 14న శంకుస్థాపన చేశారు. నేటికి 92 నెలలు (ఏడున్నర ఏళ్లు) దాటినా ఆ పనులు పూర్తి కాలేదు. రూ. 611 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కేవలం 20 శాతమే పూర్తి కావడంతో పాత కాంట్రాక్టర్‌ను తొలగించాల్సి వచ్చింది. ఈ టెర్మినల్ ప్రారంభంపై మార్చి, జూన్, జూలై అంటూ పదే పదే గడువులు మారుస్తూ ఇప్పుడు నవంబర్ అంటున్నారు. చుక్కలనంటుతున్న టికెట్ ధరలు – పట్టించుకోని కేంద్ర మంత్రి.. గతంలో విజయవాడ నుంచి హైదరాబాద్ లేదా విశాఖ వెళ్లడానికి రూ. 2,500 ఉన్న టికెట్ ధర, ప్రస్తుతం సాధారణ రోజుల్లోనే రూ. 3,700 నుండి రూ. 5,000 వరకు చేరింది. అత్యవసరంగా లేదా చివరి నిమిషంలో బుక్ చేసుకుంటే రూ. 8,000 నుండి రూ. 10,000 వరకు వసూలు చేస్తున్నారు. వారాంతాల్లో, పండగల సమయంలో సామాన్యుడు, ఉద్యోగులు విమానం ఎక్కలేని పరిస్థితి నెలకొంది. దీనిపై కేంద్ర మంత్రి ఎలాంటి సమీక్ష నిర్వహించకపోవడం శోచనీయం. విమానాలు రద్దయితే ప్రయాణికులకు తీవ్ర అవస్థలు.. గతంలో సాంకేతిక లోపాలు, వర్షాల వల్ల విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో ఒకేసారి పలు విమానాలు రద్దయినప్పుడు వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారికి ప్రత్యామ్నాయ వసతులు, రీఫండ్‌లు లేదా సరైన సమాచారం అందించడంలో ఎయిర్‌లైన్స్ విఫలమయ్యాయి. బాధితులను ఆదుకోవడంలో కేంద్ర మంత్రిత్వ శాఖ పూర్తిగా విఫలమైంది. వైయస్ఆర్‌సీపీ డిమాండ్లు.. ఈ నేపధ్యంలో విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల నుంచి రద్దయిన అంతర్జాతీయ, డొమెస్టిక్ విమాన సర్వీసులను తక్షణమే పునరుద్ధరించాలని, అసాధారణంగా పెరిగిన విమాన టికెట్ ధరలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే సమీక్ష నిర్వహించి ధరలను నియంత్రించడంతో పాటు, విజయవాడ కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణాన్ని ఇకపై గడువులు పొడిగించకుండా స్పష్టమైన తేదీని ప్రకటించి త్వరగా పూర్తి చేయాలని పుత్తా శివశంకర్ డిమాండ్ చేశారు.