కృష్ణా డెల్టాకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలి

 పులిచింతల నుంచి 4 వేల క్యూసెక్కులు, పట్టిసీమ నుంచి పూర్తి సామర్థ్యంతో నీరు అందించాలి

వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం–రైతు సంక్షేమం), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్‌

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం  ఆధ్వ‌ర్యంలో అఖిల పక్ష సమావేశం

 కృష్ణా డెల్టాకు వరి తప్ప ప్రత్యామ్నాయ పంటే లేదు

 సాగునీటిని నిలిపివేయడం రైతులపై తీవ్ర అన్యాయం

 అధికారుల తప్పుదారి పట్టించే నిర్ణయాలతో రైతాంగం నష్టపోతోంది

 ప్రభుత్వమే వెంటనే నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలి

విజయవాడ: కృష్ణా డెల్టాకు తక్షణమే సరిపడా సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం–రైతు సంక్షేమం) మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షుడు  ఈశ్వరయ్య అధ్యక్షతన విజయవాడలోని దాసరి నాగభూషణ్ భవన్‌లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు. కృష్ణా డెల్టాలో వరి పంటకు ప్రత్యామ్నాయం లేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇప్పటికే స్పష్టం చేశారని, అలాంటి పరిస్థితుల్లో నీటి సరఫరాను తగ్గించడం రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టడమేనని అన్నారు. ఎంవీఎస్ నాగిరెడ్డి గారు ఇంకా ఏమ‌న్నారంటే..

- 2003లో పోరాడాం... ఇప్పుడు మరోసారి రైతుల కోసం ఉద్యమం

"కృష్ణా డెల్టా సాగునీటి కోసం 2003లో పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. అప్పట్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులమై ఉన్నప్పటికీ రైతుల పక్షాన నిలబడ్డాం. ప్రకాశం బ్యారేజ్‌పై వేలాది మంది రైతులతో భారీ ధర్నా నిర్వహించాం. అప్పుడే శాస్త్రవేత్తలు కూడా కృష్ణా డెల్టాలో ఖరీఫ్‌లో వరి తప్ప మరో ప్రత్యామ్నాయ పంట లేదని స్పష్టం చేశారు. అదే పరిస్థితి ఈరోజూ కొనసాగుతోంది. అందుకే మరోసారి రైతుల హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది."

- పులిచింతలలో నీరు ఉండగా విడుదల చేయకపోవడం సమంజసం కాదు

"ప్రస్తుతం పులిచింతలలో 29 టీఎంసీల నీరు ఉంది. అక్కడి నుంచి రోజుకు 4 వేల క్యూసెక్కులు విడుదల చేస్తే, పట్టిసీమ ద్వారా మరో 6 వేల క్యూసెక్కులు అందితే కృష్ణా డెల్టాకు అవసరమైన 10 వేల క్యూసెక్కుల నీరు అందుతుంది. పైప్రాంతాల నుంచి కూడా భారీగా వరదలు వస్తున్నాయి. గోదావరిలో లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తోంది. అయినప్పటికీ డెల్టాకు నీళ్లు ఇవ్వకుండా 'వరి వేయొద్దు' అని చెప్పడం పూర్తిగా అవాస్తవం. ఇది సాంకేతికంగా కూడా సమర్థించలేని నిర్ణయం."

-  కృష్ణా డెల్టాలో వరికి ప్రత్యామ్నాయం లేదన్నది ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయి

"వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో వరి తప్ప మరో పంటకు అవకాశం లేదు. రైతులు ఇప్పటికే నారుమళ్లు పోసి, పొలాలు సిద్ధం చేసుకున్నారు. ఈ దశలో సాగునీరు నిలిపివేయడం రైతులను తీవ్రంగా నష్టపరుస్తుంది. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెప్పేవారు ముందుగా ఆ పంటలను ఎక్కడైనా సాగు చేసి చూపించాలి. రైతులకు భూమి స్వభావం, వాతావరణ పరిస్థితులు బాగా తెలుసు."

- రైతులను కాపాడాలంటే వెంటనే నీటి విడుదలతో పాటు మార్కెట్ రక్షణ కూడా అవసరం

"రైతుల సమస్యలు కేవలం సాగునీటితో ముగియవు. పంటలకు గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించాలి. పొగాకు నుంచి వరి వరకు ప్రతి పంటలో రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకుని పోటీ వాతావరణం కల్పిస్తే రైతులకు మంచి ధర లభిస్తుంది. ఇప్పటికైనా అధికారులు వాస్తవ పరిస్థితులను ప్రభుత్వానికి వివరించి, పులిచింతల నుంచి 4 వేల క్యూసెక్కులు, పట్టిసీమ నుంచి పూర్తి సామర్థ్యంతో నీటిని విడుదల చేసి కృష్ణా డెల్టా రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను."
 

Back to Top