తాడేపల్లి: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసింది. రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని అందించిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డేనని పేర్కొంటూ, "థ్యాంక్యూ జగన్ అన్నా" అనే సందేశాన్ని పోస్టు చేసింది. వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే భోగాపురం విమానాశ్రయం కోసం భూసేకరణ, నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం, అవసరమైన అన్ని అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక ప్రక్రియలు పూర్తయ్యాయని పార్టీ వెల్లడించింది. భూసేకరణ, పరిహారం, అనుబంధ మౌలిక వసతుల కోసం దాదాపు రూ.1,200 కోట్లు ఖర్చు చేశామని పేర్కొంది. విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన పునాది పనులన్నింటినీ వైయస్ జగన్ ప్రభుత్వం పూర్తి చేయగా, ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు కావాల్సిన అన్ని చర్యలను కూడా అదే ప్రభుత్వం చేపట్టిందని ట్వీట్‌లో గుర్తు చేసింది. ఈ ప్రాజెక్టులో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర ఏమీ లేకపోయినా, మొత్తం ఘనతను తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సాధ్యం చేసిన నాయకుడు ఎవరో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసని, అందుకే "థ్యాంక్యూ జగన్ అన్నా" అంటూ ప్రజలు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ ట్వీట్‌లో పేర్కొంది.