దగా డీఎస్సీపై ఆగస్టు 3 నుంచి 10 వరకు వైయ‌స్ఆర్‌సీపీ పోరుబాట

 మాజీ మంత్రి డా. సాకే శైలజానాథ్ పిలుపు

అనంతపురం: డీఎస్సీ-2025 నియామకాల్లో జరిగిన అవకతవకలతో నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని, వారికి అండగా వైయ‌స్ఆర్‌సీపీ ఈ నెల 3 నుంచి 10 వరకు చేపట్టనున్న "పోరుబాట" కార్యక్రమాలను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

 డీఎస్సీలో పారదర్శకత ఎక్కడ?

డీఎస్సీ-2025 నియామకాల్లో ప్రభుత్వం పారదర్శకత పాటించలేదని డాక్టర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. ప్రశ్నపత్రాల తయారీ, అనువాద ప్రక్రియలో పనిచేసిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి జోన్-2లో మొదటి ర్యాంకు సాధించినప్పటికీ నియామకాలకు పిలవకపోవడం, మెరిట్‌ లిస్టును తొలగించడం వంటి పరిణామాలు అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు. స్పోర్ట్స్ కోటాలో అర్హులను పక్కనపెట్టి అనర్హులకు ఉద్యోగాలు కల్పించారని, ఈ వ్యవహారంపై వెలుగులోకి వచ్చిన ఆడియోలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

 నిరుద్యోగ యువతకు వైయ‌స్ఆర్‌సీపీ అండ

సుమారు 3.30 లక్షల మంది ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోగా కేవలం 16 వేల పోస్టులనే భర్తీ చేశారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని కూడా ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన విమర్శించారు. డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని, అయినప్పటికీ విద్యార్థులు, నిరుద్యోగ యువతకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

  ఆగస్టు 3 నుంచి 10 వరకు పోరుబాట

ఆగస్టు 3న సింగనమలలో టౌన్‌హాల్ సమావేశంతో పోరుబాట కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఆగస్టు 6న నార్పల, 7న పుట్లూరు, 8న గార్లదిన్నె, 9న యల్లనూరు మండలాల్లో రిలే నిరాహార దీక్షలు, 10న బుక్కరాయసముద్రంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాల నాయకులు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని డాక్టర్ సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. 

Back to Top