టీటీడీ ప్రక్షాళన మాటల్లోనేనా..? 

అలిపిరి సమీపంలో స్వామివారి చిత్రపటాల నిర్లక్ష్య నిర్వహణపై భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం 

తిరుపతి: అలిపిరి–జూపార్క్ రోడ్డులోని టీటీడీ స్థలాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి చిత్రపటాలు అత్యంత నిర్లక్ష్యంగా పడి ఉండటంపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పరిరక్షణ, ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని విమర్శించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో టీటీడీని కాపాడుతున్నామని చెబుతూనే పవిత్రతను పరిరక్షించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. అలిపిరి నుంచి కిలోమీటర్ పరిధిలోని టీటీడీ వెంకటేశ్వరస్వామి స్థలాల్లో పవిత్రంగా ఉండాల్సిన ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని అన్నారు. కొన్ని వందల నుంచి వేల సంఖ్యలో స్వామివారి చిత్రపటాలు చెత్తకుప్పల మధ్య, మలమూత్రాల మధ్య పడివుండటం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే అంశమని పేర్కొన్నారు. ఈ చిత్రపటాలను టీటీడీ అధికారులు అక్కడ పడేశారని తాము చెప్పడం లేదని, అయితే ఇలాంటి పరిస్థితులను అరికట్టాల్సిన విజిలెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా టీటీడీ ప్రక్షాళన చేస్తున్నామని ప్రచారం చేస్తున్న పాలకులు, స్వామివారి చిత్రపటాలకు కనీస గౌరవం కల్పించడంలో విఫలమయ్యారని భూమన విమర్శించారు. టీటీడీ స్థలాల్లో జరుగుతున్న ఈ నిర్లక్ష్యానికి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు భక్తుల మనోభావాలను గౌరవించేలా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 

ప‌వ‌నానంద‌స్వామి..మీ స‌నాత‌నం ఎలా ఉందో చూడండి  
సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాల పరిరక్షణ గురించి మాట్లాడే డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అలియాస్ ప‌వ‌నానంద‌స్వామి ముందుగా ఇటువంటి ఘటనలపై సమాధానం చెప్పాలని భూమన డిమాండ్ చేశారు. మీ స‌నాత‌నం ఎలా ఉందో చూడండి అన్నారు. టీటీడీ పరిధిలో జరుగుతున్న ఈ అవమానకర పరిస్థితులకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, స్వామివారి చిత్రపటాలకు తగిన గౌరవం కల్పించేలా వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. అలిపిరి సమీపంలోని టీటీడీ స్థలాల్లో పవిత్రంగా ఉండాల్సిన ప్రాంతాలు చెత్తకుప్పలను తలపిస్తున్నాయని, అక్కడ వందలాది, వేలాది స్వామివారి చిత్రపటాలు మలమూత్రాల మధ్య, ఖాళీ బీరు సీసాలు, వాడేసిన వస్తువుల మధ్య పడి ఉండటం అత్యంత బాధాకరమని భూమ‌న‌ పేర్కొన్నారు. తాము టీటీడీ అధికారులు చిత్రపటాలను అక్కడ పడేశారని చెప్పడం లేదని, కానీ టీటీడీ విజిలెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని చెబుతున్నామని భూమన స్పష్టం చేశారు. ఇంతటి అపచారం జరుగుతున్నా టీటీడీ ఈవో, పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడు, సంబంధిత అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. గత రెండేళ్లుగా టీటీడీ ప్రక్షాళన పేరుతో ప్రచారం చేస్తున్న ప్రభుత్వం, స్వామివారి చిత్రపటాల పరిరక్షణలో మాత్రం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. టీటీడీ స్థలాలు భక్తులు వినియోగించిన స్వామివారి చిత్రపటాలను పడేసే డస్ట్‌బిన్‌లుగా మారిపోయాయని, ఇది పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.

 

Back to Top