అనంతపురం :ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకుని నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా టాస్క్ ఫోర్స్ సభ్యులు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో 108, 104 సిబ్బందికి దుస్తుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి హాజరై దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనలో మెదిలిన ఒక మహత్తరమైన కార్యక్రమమే ఆరోగ్యశ్రీ పథకం అన్నారు. పేదవాడు గుండె పదిలంగా ఉండడానికి, పేదవాళ్ల ఆర్థిక సామాజిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని పెద్ద పెద్ద జబ్బులు వస్తే ఆర్థికంగా చితికిపోతారని గుర్తించి ఒక డాక్టర్‌గా.. ఒక ముఖ్యమంత్రిగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. యావత్ దేశాన్ని ఒక్కసారి ఆలోచింపజేసిన వ్యక్తి వైయస్సార్ అన్నారు. ఆయన పెట్టిన 108, ఆరోగ్యశ్రీ సంస్థలలో పనిచేస్తున్న సిబ్బందికి మహానేత వైఎస్‌ఆర్ జయంతిని పురస్కరించుకొని దుస్తులు పంపిణీ చేయడం సంతోషకరమంటూ.. రమేష్ గౌడ్‌ను అభినందించారు. కుయ్.. కుయ్..అంటే, ఇప్పటికీ గుర్తొచ్చేది రాజన్న : రమేష్ గౌడ్ ప్రమాదంలో గాయపడిన వారిని.. అత్యవసర వైద్యం అవసరమైన వారిని ఆసుపత్రులకు తరలించేలా 108 అంబులెన్స్ సర్వీస్‌ను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చారన్నారు. ఎక్కడ 108 వాహనం కుయ్.. కుయ్.. అంటూ వెళ్లినా ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది మహానేత రాజన్నే అని వైయస్సార్ రాష్ట్ర కార్యదర్శి బిసి టాస్క్ ఫోర్స్ సభ్యులు రమేష్ గౌడ్ కొనియాడారు. అదేవిధంగా పేదరికంతో ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకాన్ని రూపకల్పన చేశారన్నారు. దీంతో లక్షలాది నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతోపాటు ఆర్థిక ఇబ్బందులకు సతమతమవుతున్న అగ్రవర్ణ విద్యార్థులు సైతం ఉన్నత చదువులు చదివి దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తుడడం వైఎస్‌ఆర్ చలువేనన్నారు. కరవుకు నిలయమైన అనంతపురం ఉమ్మడి జిల్లాలోని రైతాంగానికి భరోసా కల్పిస్తూ.. హంద్రీనీవా కాలువ ద్వారా సాగు, తాగునీరు అందించిన ఘనత వైఎస్‌ఆర్‌దేనన్నారు. కష్టాల కడలిలో ఉన్న రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్ పథకాలతో బాసటగా నిలిచిన వ్యక్తి వైఎస్‌ఆర్ అని గుర్తు చేశారు. కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు అనంత చంద్రారెడ్డి, మేయర్ మహమ్మద్ వసీం, డిప్యూటి మేయర్ వాసంతి సాహిత్య, రాష్ట్ర రజక కార్పొరేషన్ మాజీ చైర్మన్ మీసాల రంగన్న, నగర పార్టీ అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు శ్రీదేవి, ఎద్దుల అమర్నాథ్ రెడ్డి, రాష్ట్ర అనుబంధ విభాగాల నాయకులు కృష్ణవేణి, నాయకులు హిద్దు, నరేంద్ర, లబ్బే రాఘవ, బెస్త వెంకటేశ్‌తోపాటు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.