వైయ‌స్‌ జగన్‌ను మళ్లీ సీఎంగా గెలిపించుకుందాం

మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి

ద‌ర్శిలో వైయ‌స్ఆర్‌సీపీ  ప్రాంతీయ కార్యాల‌యాన్ని ప్రారంభించిన బాలినేని, చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి

 ప్రకాశం : వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డిని మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిగా గెలిపించుకుందామ‌ని మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి పిలుపునిచ్చారు. దర్శిలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రాంతీయ కార్యాలయాన్ని పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డిలు కలిసి ప్రారంభించారు. పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్‌గా చెవిరెడ్డి  నియమించబడిన తర్వాత మొదటిసారిగా మాజీమంత్రి బాలినేనితో కలిసి పార్టీ కార్యక్రమానికి హాజరు కావడం గమనార్హం. 

అంతకు ముందు.. ఈ ఉదయం ఒంగోలులో బాలినేని నివాసంలో బాలినేనితో భేటీ అయిన చెవిరెడ్డి ,అనంతరం ఇద్దరు కలిసి ఒకే కారులో దర్శి వచ్చారు. దీంతో  పార్టీ కేడర్‌లో జోష్ నెలకొంది. దర్శి నియోజకవర్గ ఇంచార్జి  బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని నేతలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో అన్ని సీట్లు గెలిపించుకునేందుకు అందరం సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. నాయకులు మధ్య చిన్న చిన్న  మనస్పర్ధలు ఉన్నా పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం కృషి చేద్దామన్నారు. మన నాయకుడు వైయ‌స్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు పట్టుదలతో పని చేద్దాం. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని గెలిపించుకునేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు.

పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. పేదలను గుండెల నిండా నింపుకున్న పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ అని.. ప్రజా బలంతో  పేదల అండతో సీఎం వైయ‌స్ జగన్‌ ముందుకెళ్తున్నారన్నారు. అసంతృప్తులు, మనస్పర్ధలను పక్కనపెట్టి అందరం సీఎం వైయ‌స్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని చెవిరెడ్డి పిలుపునిచ్చారు. 

Back to Top