మంచినీరిమ్మంటే.. మద్యం పోస్తారట!

గన్నవరంమెట్ట (విశాఖ జిల్లా),

24 జూన్‌ 2013: మద్యం విక్రయాలను మరింతగా పెంచుకునేందుకు దుకాణాల్లో సిటింగ్‌ రూంలకు కిరణ్‌ కుమార్‌రెడ్డి అనుమతి ఇస్తున్నారని శ్రీమతి షర్మిల విమర్శించారు. గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పించమని మహిళలు ఒకవైపున మొత్తుకుంటుంటే మద్యం తాగడానికి కిరణ్‌ కుమార్‌రెడ్డి సౌకర్యం కల్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. మద్యం దుకాణాల్లో ఇంకా ఎక్కువ మద్యం పోసి, మరింత ఎక్కువ ఆదాయం సంపాదించాలన్నది సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి ఆలోచన అని ఆరోపించారు. పల్లెల్లోనే మహిళలు తమకు మరుగుదొడ్లు కట్టించమని వేడుకుంటుంటే ఈ ముఖ్యమంత్రి మద్యం షాపులకు సిటింగ్‌ రూంలు పెట్టిస్తారట అని నిప్పులు చెరిగారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర విశాఖ జిల్లాలో ప్రవేశించిన సందర్భంగా విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని గన్నవరంమెట్టలో సోమవారం సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగసభలో శ్రీమతి షర్మిల ప్రసంగించారు.

మద్యాన్ని నియంత్రించాలని శ్రీ జగన్మోహన్‌రెడ్డి, మద్యం దుకాణాలను రద్దు చేయాలని అంటుంటే మద్యం విక్రయాలను ఇంకా పెంచుకోవడానికి ఈ కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కొన్ని రోజులు పోతే మద్యం ఎక్కువ తాగే వారికి పోటీలు పెట్టి బహుమతులు కూడా ఇచ్చేలా కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారని ఎద్దేవా చేశారు. మద్యం అమ్మకాలపై కిరణ్‌ కుమార్‌రెడ్డి టార్గెట్‌లు పెంచుతున్నారని దుయ్యబట్టారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని నాలుగేళ్ళలో రెట్టింపు చేశారంటే కిరణ్‌కుమార్‌రెడ్డికి మద్యం విక్రయాలపై ఎంత శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మహాత్మా గాంధీ మాకు ఆదర్శం అని చెప్పుకునే కాంగ్రెస్‌ పార్టీ మద్యం మాఫియా డాన్‌ బొత్స సత్యనారాయణకు తీసుకువచ్చి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టుకున్నదని విమర్శించారు.

మన ఖర్మ కొద్దీ పాలకపక్షం తీరు ఇలా ఉంటే.. మద్యం వల్ల బుగ్గిపాలైపోయిన కుటుంబాలను తన పాదయాత్రలో కళ్ళారా చూసి, ఆ మహిళల రోదనలు విని కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మద్యం ధరలను అందరికీ అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారని శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సరసమైన ధరలకు మద్యాన్ని అందజేస్తారట చంద్రబాబు అని ఆమె ఎద్దేవా చేశారు. అంటే రాష్ట్ర ప్రజలంతా మద్యం మత్తులో మునిగి తేలాలన్నది చంద్రబాబు ఉద్దేశంగా ఉందన్నారు. ఇలాంటి వాళ్ళు ఈ రోజు మనకు నాయకులుగా వచ్చారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల జీవితాలను చలిమంట వేసుకుని కాల్చుకు తింటున్న వీళ్ళను నాయకులనాలా? లేక నీచులు అనాలా? దుర్మార్గులనాలా? అన్నది అర్థం కావడంలేదని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు.

రాబందులు రాజ్యం ఏలుతుంటే.. గుంటనక్కలు తాళం వేసిన చందంగా ఉంది కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయుడి తీరు అని శ్రీమతి షర్మిల విమర్శించారు. దుష్టపరిపాలన చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చంద్రబాబు నిస్సిగ్గుగా మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తన పాదయాత్ర సందర్భంగా ఇష్టం వచ్చిన రీతిలో దూషించిన చంద్రబాబు తీరా చేతల్లోకి వచ్చేసరికి విప్‌ జారీ చేసి మరీ కాపాడారని దుయ్యబట్టారు. ఇలాంటి చంద్రబాబును నాయకుడనాలా? లేక ఊసరవెల్లి అనాలా అని ప్రశ్నించారు. ఐఎంజి కేసులో తన మీద విచారణ జరగకుండా ఉండేందుకే కాంగ్రెస్‌ పార్టీకి టిడిపిని చంద్రబాబు రాసి ఇచ్చేశారని ఆరోపించారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన 70 లక్షల మందిని పిచ్చోళ్ళను చేసి కాంగ్రెస్‌కు బహిరంగంగా అమ్ముడుపోయి చిరంజీవికి చంద్రబాబు పెద్ద తేడా ఏమీ లేదని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు.

చంద్రబాబు నాయుడు రాసుకున్న 'మనసులో మాట' పుస్తకంలోని కొన్ని వాక్యాలను శ్రీమతి షర్మిల ఈ సందర్భంగా చదివి వినిపించారు. ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని పిచ్చి లెక్కలు వేసి చంద్రబాబు ఆ పుస్తకంలో రాశారన్నారు. ఉచిత విద్యుత్‌ అసలు ఇవ్వనేకూడదని రాసుకున్నారన్నారు. సబ్సిడీలు ఇస్తే ప్రజలు సోమరిపోతులవుతారు.. వారికి ఏదీ ఉచితంగా ఇవ్వకూడదని కూడా రాసుకున్నారని ప్రస్తావించారు. ఇక పన్నులు, యూజర్‌ చార్జీల గురించి ఏమి రాసుకున్నారో ఆయన మాటల్లోనే చెప్పారు. 'పన్నులు, యూజర్‌ చార్జీలు పెంచడానికి ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చాలని నేను నిశ్చయించుకున్నాను. విద్యుత్, నీరు, సాగునీరు, రవాణా మొదలైన వాటికి సున్నితంగా చార్జీలు వసూలు చేయాలి. పన్నుల ఆదాయాన్ని పెంచుకోవాలి. వినియోగదారుల చార్జీలు బాగా పెంచాలి. అర్జెంటుగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉచిత సేవల కాలం చెల్లిపోయింది.. వెళ్ళిపోయింది. ప్రజల నుంచే డబ్బులు సేకరించాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ శాతం విద్యుత్‌ను ఉపయోగించేది రైతులే అని.. ఆ భారం భరించలేనిదిగా అవుతున్నది. ప్రజలను ముందుగానే సంసిద్ధం చేసినప్పుడు పెంచిన ధరలను మరింత తేలికగా అంగీకరిస్తారు' అనేవి చంద్రబాబు మనసులోని మాట పుస్తకంలోని కొన్ని అంశాలని శ్రీమతి షర్మిల చదివి వినిపించారు.

దొంగ జపం చేసే మాయ కొంగ లాంటి వాడు చంద్రబాబు నాయుడని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. మహిళలందరికీ బంగారు మంగళసూత్రాలు, విద్యార్థినులకు సైకిళ్ళు ఇస్తానని, ఆడపిల్ల పుడితే లక్ష రూపాయలిస్తానని ఇలాంటి ఎన్నో వాగ్దానాలను చంద్రబాబు చేశారని గుర్తుచేశారు. అధికారంలో ఉన్నాడు కదా ఇస్తారని మహిళలంతా ఎదురు చూస్తే ఎవ్వరికీ ఆయన ఏదీ ఇవ్వలేదన్నారు. పూర్తి మద్యపాన నిషేధం, రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తానని ఎన్టీఆర్‌ ఇచ్చిన వాగ్దానాలను చంద్రబాబు తుంగలో తొక్కేశారని విమర్శించారు. ఇప్పుడు మళ్ళీ అవే వాగ్దానాలు చేస్తూ తనకు అధికారం ఇవ్వమని ఆయన తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఇవన్నీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదంటే చంద్రబాబు నుంచి సమాధానం రాదన్నారు. 'దున్నపోతా.. దున్నపోతా.. ఎందుకు దున్నలేదు.. అంటే.. పగలు ఎండ.. రాత్రి చీకటి' అని చెప్పిందనే సామెతను చంద్రబాబు తీరును ప్రస్తావిస్తూ శ్రీమతి షర్మిల ప్రస్తావించారు. దున్నపోతు పనిచేయదు.. చంద్రబాబు అధికారంలో ఉన్నా చేయరు.. అధికారం ఇచ్చినా చేయరని విమర్శించారు.

జగనన్న జననేతగా ఎదుగుతుంటే చంద్రబాబు, కాంగ్రెస్‌ నాయకులు ఓర్వలేకపోయారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. రాజశేఖరరెడ్డి సిసలైన వారసుడిగా జగనన్న జనం గుండెల్లో స్థానం సంపాదించుకుంటుంటే సహించలేకపోయారని విచారం వ్యక్తంచేశారు. జగనన్న జనం మధ్యే ఉంటే కాంగ్రెస్‌, టిడిపిలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని వారికి తెలుసన్నారు. అందుకే ఆ రెండు పార్టీల నాయకులూ కుట్రలు పన్ని, అబద్ధపు కేసులు పెట్టి, సిబిఐని ఉసిగొల్పి జగనన్నను జైలుపాలు చేశారని అన్నారు. చంద్రబాబు, కాంగ్రెస్‌ నాయకులు లాంటి వంద మంది గుంటనక్కలు ఏకమైనా, కుమ్మక్కైనా సింహం లాంటి జగనన్నను ఏమీ చేయలేరని ధీమాగా చెప్పారు. మంచివారి పక్షాన దేవుడు నిలబడతాడన్నారు. జగనన్న ఏ తప్పూ చేయలేదని, అందుకే ధైర్యంగా ఉన్నారన్నారు. జగనన్నను ఆపఢం ఈ కాంగ్రెస్‌, టిడిపి నాయకుల తరం కాదన్నారు. త్వరలోనే జగనన్న వస్తారని, మనందర్నీ రాజన్న రాజ్యం దిశగా నడిపిస్తారని శ్రీమతి షర్మిల చెప్పారు. రాజన్న రాజ్యం వచ్చే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత వైయస్‌ఆర్‌ కన్న ప్రతి కలనూ నెరవేరుస్తారని ఆమె హామీ ఇచ్చారు. రాజన్న ఇచ్చిన ప్రతి మాటను జగనన్న నిలబెడతారన్నారు. ప్రతి ఎకరాకూ నీళ్ళివ్వాలన్న రాజన్న కలను తప్పకుండా తీరుస్తారన్నారు.

సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్‌ ప్రభుత్వం అటకెక్కించిందని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. అరవై ఏళ్ళుగా ఏ ముఖ్యమంత్రీ చేయని సాహసాన్ని పోలవరం ప్రాజెక్టు విషయంలో మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి చేశారని ఆమె ప్రస్తావించారు. 7.21 లక్షల ఎకరాలకు సాగునీరు, 540 గ్రామాలకు మంచినీళ్ళు ఇచ్చేది పోలవరం ప్రాజెక్టు అన్నారు. 960 మెగా వాట్ల విద్యుత్‌ ఇచ్చే ప్రాజెక్టు అని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం వైయస్‌ 20 క్లియరెన్సులు తెచ్చి, రూ. 3,300 కోట్లు ఖర్చు చేసి 38 శాతం పనులు కూడా పూర్తిచేశారని వివరించారు శ్రీమతి షర్మిల. ఆ మహానేత వెళ్ళిపోయిన తరువాత ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం దాని విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయిందంటే రైతుల మీద వీళ్ళకు ఎంత శ్రద్ధ ఉందో తెలుస్తోందన్నారు.

త్వరలోనే స్థానిక ఎన్నికలు, మరి కొద్ది రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయని, ప్రజల చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్‌, టిడిపిలకు గట్టిగా బుద్ధి చెప్పి, జగనన్నను ఆశీర్వదించాలని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా నిలవాలని శ్రీమతి షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వేసే ప్రతి ఓటూ జగనన్న నిర్దోషి అని ప్రజలు చాటి చెప్పినట్లవుతుందన్నారు. ప్రజలు వేసే ప్రతి ఓటూ జగనన్న బయటికి రావడానికి బాటలు వేస్తుందన్నారు.

Back to Top