విజయవాడ : మెగా డీఎస్సీ-2025లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీ.జే.ఆర్. సుధాకర్ బాబు, ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసేందుకు వచ్చిన నాయకులు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీశాతో జరిగిన మాటల మార్పిడిపై వైయస్ఆర్‌సీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీ.జే.ఆర్. సుధాకర్ బాబు మాట్లాడుతూ, మెగా డీఎస్సీ పేరుతో అర్హత కలిగిన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. మెరిట్ ఆధారంగా కాకుండా ఇతర ప్రమాణాలతో నియామకాలు జరిగాయని విమర్శించారు. డీఎస్సీ ప్రక్రియకు సంబంధించిన జీవో నెం.47ను నియామకాలు పూర్తయిన తర్వాత వెబ్‌సైట్ నుంచి తొలగించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రజల సమస్యలు వినేందుకు ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ వ్యవస్థ వద్ద తమను అవమానించేలా వ్యవహరించడం బాధాకరమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం జరిగిన నియామకాలను రద్దు చేసి, పూర్తి పారదర్శకతతో మళ్లీ మెగా డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. టెట్‌లో అర్హత సాధించిన మెరిట్ అభ్యర్థులకే ఉద్యోగాలు కల్పించాలని, పూర్తి మెరిట్ లిస్ట్‌ను బహిర్గతం చేయాలని వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.