తాడిపత్రి ఘటనపై వైయ‌స్ఆర్‌సీపీ ఆందోళన 

గంగులకుంట కేశవరెడ్డికి పరామర్శ

అనంతపురం: తాడిపత్రిలో వైయ‌స్ఆర్‌సీపీ నేత గంగులకుంట కేశవరెడ్డిపై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన పార్టీ నాయకులు ఆయనను అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఇతర నాయకులు మీడియాతో మాట్లాడుతూ, ఈ ఘటన వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తాడిపత్రిలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి దౌర్జన్యాలను పోలీసులు అడ్డుకోకపోవడం దారుణమని వారు ఆరోపించారు. జిల్లా ఎస్పీ జగదీష్ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని విమర్శించారు.
దాడి ఘటన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిపై కూడా దాడులు జరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. నేరాలపై పోలీసులు నిష్క్రియంగా వ్యవహరిస్తున్నారని, రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే చర్యలు ఆలస్యమవుతున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ నెల 26న తాడిపత్రిలోని గాంధీ విగ్రహం వద్ద సామూహిక దీక్ష చేపడతామని నాయకులు ప్రకటించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి దౌర్జన్యాలను చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
 

Back to Top