పులివెందుల: రాయలసీమ ప్రజలకు చంద్రబాబు బంగారు తొడుగులు వేస్తానని భ్రమల్లో ముంచడం మానుకుని, పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి పొలాలకు నీళ్లిచ్చి చూపించాలని వైయస్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. పులివెందుల లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2023లో వైయస్ఆర్‌సీపీ హయాంలోనే జొన్నగిరి గోల్డమైన్ ప్రొడక్షన్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటైందని, ఆ రోజుల్లోనే పైలెట్ ప్రాజెక్టు కూడా విజయవంతంగా పూర్తయినట్టు ఆయన వివరించారు. జొన్నగరి గోల్డ్‌మైన్‌ని చూపించి ప్రజలను భ్రమల్లో ముంచుతున్నాడని, పక్కనే రాయచోటిలో ఉన్న హట్టి గోల్డ్‌మైన్ ద్వారా ఎన్నో ఏళ్లుగా మైనింగ్ జరుగుతున్నా ఇప్పటి వరకు అక్కడి పరిస్థితుల్లో ఏం మార్పొచ్చిందని ఉదాహరణగా వివరించారు. ముఖ్యమంత్రి అయ్యుండి బహిరంగ సభలో కులాల ప్రస్తావన చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. నేరస్తుడు, సీఐ ఒకే కులమైతే చంపేయొచ్చని రాజ్యాంగంలో రాసి ఉందా? అని ప్రశ్నించారు. కూటమి ఎమ్మెల్యేల్లో 130 మందిపై 30కిపైగా కేసులున్నాయని, వారిని ఎన్‌కౌంటర్ చేశారా? అని నిలదీశారు. రెండేళ్లుగా చేస్తున్న డైవర్షన్ డ్రామాలు ఇకనైనా కట్టిపెట్టి రాయలసీమ లిప్టు ఇరిగేషన్‌తోపాటు పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.... - రెండేళ్లలో వ్యవస్థలన్నీ సర్వనాశనం చంద్రబాబు కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అధోగతిపాలు చేసింది. అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. టాపిక్ డైవర్షన్ తో రెండేళ్లు గడిపేశాడు. చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ పథకం లేదు. తాను ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనే భ్రమల్లో చంద్రబాబు బతుకుతున్నాడు. కానీ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మోసాలను ఎప్పుడో గుర్తించారు. తగిన సమయంలో ఆయనకి, ఆయన కూటమికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వ్యవసాయం, సాగునీటి రంగం, పారిశ్రామిక అభివృద్ధి, సంక్షేమం.. ఇలా ఏ రంగం చూసినా చంద్రబాబు పాలనలో పడకేసిన పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు హయాంలో మొదలుపెట్టి పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్కటీ లేదు. ఆఖరుకి రాయలసీమకి ప్రాణాధారం లాంటి లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును రేవంత్‌రెడ్డితో లాలూచీపడి పక్కన పెట్టేశాడు. - వైయస్ఆర్‌సీపీ హయాంలోనే జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రొడక్షన్ గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే జొన్నగిరి గోల్డ్ మైన్స్ పనులు మొదలై ప్రాసెసింగ్ కూడా జరిగితే ఇప్పుడు దాన్ని చూపించి రాయలసీమ భవిష్యత్తును మార్చేస్తానని చంద్రబాబు డాంభికాలు పలుకుతున్నాడు. పక్కనే ఉన్న రాయచోటిలో ఎన్నో ఏళ్లుగా హట్టి గోల్డ్ మైన్స్ లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ గ్రామం రూపురేఖలు ఇప్పటివరకు ఏం మారలేదే? జొన్నగిరిలో ఎంత బంగారం వస్తుందో, ఎన్నేళ్లు పడతుందో, దానికి ఎంత ఖర్చవుతుందో తెలియదు. ఆ విషయాలను ప్రజలకు చెప్పకుండానే దాన్ని చూపించి రాయలసీమ ప్రజలకు భ్రమలు కల్పించే కార్యక్రమం మొదలుపెట్టాడు. వాస్తవాలను ప్రజలకు చెప్పకుండా ఏదో చేయబోతున్నట్టు ప్రజలకు అసత్యాలు చెప్పడంతో పాటు ప్రతిపక్ష పార్టీ మీద బురదజల్లే కార్యక్రమమే ఇదంతా. ప్రజల సొమ్ముతో సభలు ఏర్పాటు చేసుకుని తిరుమల నెయ్యి కల్తీ పేరుతో దేవుడ్ని రాజకీయాల్లోకి ప్రతిపక్షాన్ని తిట్టడం పనిగా పెట్టుకున్నాడు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా, వైయస్ఆర్‌సీపీకి సంబంధం లేదని సిట్ తేల్చినా అదేపనిగా బురదజల్లడమే పనిగా పెట్టుకున్నాడు. కల్తీ నెయ్యి ముసుగులో దేవుడి సొమ్మును హెరిటేజ్ కి దోచిపెట్టే కార్యక్రమానికి తెరలేపి అడ్డంగా దొరికిపోయి కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రభుత్వం దొరికిపోవడంతో కల్తీ నెయ్యి అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చాడు. చంద్రబాబు వ్యవసాయరంగాన్ని పూర్తిగా నాశనం చేశాడు. ధరలు లేక మామిడి రైతులు అల్లాడిపోతుంటే పట్టించుకోవడం లేదు. చంద్రబాబు దుర్మార్గ పాలన కారణంగా మామిడి తోటలను కొట్టేసుకుంటున్నారు. - రాయలసీమ ప్రజల గొంతు కోస్తున్నాడు సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మృతుడు, సీఐ ఇద్దరూ కాపు కులస్తులే అంటూ బహిరంగ సభలో కులాల ప్రస్తావన తీసుకురావడం సిగ్గుచేటు. ఇద్దరూ ఒకే కులం అయినంత మాత్రాన చంపుకోవచ్చు అని రాజ్యాంగంలో రాసిపెట్టారా? ఒక తల్లికి న్యాయం చేసి కన్నీరు తుడవలేని ప్రభుత్వం ఉంటే ఎంత ఊడితే ఎంత? రెండే కేసులున్న యువకుడి గురించి 23 కేసులున్నట్టు ఒక ముఖ్యమంత్రి ప్రచారం చేయడం సిగ్గుచేటు. కేసులుంటే చంపేయమని పోలీసులకు చట్టాలు, న్యాయస్థానాలు చెప్పాయా? అలాగైతే కూటమి ఎమ్మెల్యేల్లో 130 మందిపై 30కిపైగా కేసులున్నాయి. వారిని ఎన్‌కౌంటర్ చేశారా? పులివెందుల మెడికల్ కాలేజీని మూసేసి ఇక్కడున్న విలువైన సామాగ్రిని తరలించుకుపోయాడు. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం తెచ్చిన లిప్టులు తీసుకెళ్లిపోయారు. ఇక్కడ నుంచి హైకోర్టు, ఎయిమ్స్‌ను తీసుకెళ్లిపోయాడు. అడుగడుగునా రాయలసీమకి అన్యాయం చేస్తూ అభివృద్ధికి పాటుపడుతున్నట్టు బిల్డప్ ఇచ్చుకోవడం చంద్రబాబుకే చెల్లింది. రాయలసీమ ప్రజల గొంతు కోస్తూ బంగారు తొడుగులు వేస్తానని చెబుతున్నాడు. వైయస్సార్ సీఎం అయ్యాక ఎన్నో సంస్కరణలు తీసుకొస్తే చంద్రబాబు అన్నింటినీ పక్కన పెట్టేశాడు. - రాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయాలి ఇప్పటికైనా బోగస్ మాటలు పక్కనపెట్టి రాయలసీమ లిప్టు, హంద్రీనీవా, గాలేరు-నగరి ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి. రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని పెంచిపోషించిందే చంద్రబాబు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా రెండేళ్లుగా పాలన సాగిస్తున్నాడు. సోషల్ మీడియా యాక్టివిస్తులను టార్గెట్ చేసి ప్రశ్నించిన వారి మీద అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రశ్నించే వారి మీద పెట్టే శ్రద్ధ క్రిమినల్స్ మీద పెడితే రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొంటాయి. రోజురోజుకీ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న అప్పులు తప్ప, ఆ అప్పులతో జరిగిన అభివృద్థి ఆనవాళ్లు కనిపించడం లేదు. అమరావతి రాజధాని ముసుగులో దోచుకుని దాచుకుంటున్నాడు. అమరావతి కోసం రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నాడు. కేసులను లెక్కచేయకుండా వైయస్ఆర్‌సీపీ పోరాడుతోంది కాబట్టే ప్రజలకు ఇప్పటికీ న్యాయం జరుగుతోంది. మోసపూరిత రాజకీయాలకు చంద్రబాబు జీవితమే ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.