విశాఖపట్నం: విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని, దానికి సీఎం చంద్రబాబు కులం ఆపాదించడం అత్యంత హేయమని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఫైర్ అయ్యారు. లాకప్‌డెత్ వెనక ఎన్నో విషయాలు దాగి ఉన్నాయని, వాస్తవాలన్నీ బయటకు రావాలంటే, ఆ ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. లాకప్‌లో ఒక యువకుణ్ని చంపేసి, చివరకు శవం కూడా దొరక్కుండా పోలీసులు కాల్చి బూడిద చేయడం, దేశంలో ఎక్కడా జరిగి ఉండదని స్పష్టం చేశారు. వైఫల్యాలు ప్రశ్నిస్తుంటే ఓర్చుకోలేకపోతున్న ప్రభుత్వ పెద్దలు, తమపై పిచ్చి విమర్శలు, ఆరోపణలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆక్షేపించారు. ప్రెస్‌మీట్‌లో గుడివాడ అమర్‌నాథ్ ఇంకా ఏం మాట్లాడారంటే..: సీఎం వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం: కర్నూలు జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు బుధవారం చేసిన వ్యాఖ్యలు అత్యంత బా«ధ్యతారాహిత్యం. పోలీసులు లాకప్‌లో ఒకరిని దారుణంగా కొట్టి చంపి, చివరకు «శవం కూడా దొరక్కుండా కాల్చి బూడిద చేస్తే, ఆ విషయాన్ని ప్రస్తావించని సీఎం.. విజయవాడలో ఒక ఘటన జరిగిందని, అక్కడ సీఐ, బాధితుడు ఇద్దరూ ఒకే కులానికి చెందిన వారని నిస్సిగ్గుగా మాట్లాడారు. పైగా మా పార్టీ ఈ కేసులో కుల రాజకీయం చేస్తోందని సీఎం వ్యాఖ్యానించడం అత్యంత హేయం. వ్యవస్థలను కాపాడాల్సిన సీఎం, అంత పెద్ద ఘటనకు సింపుల్‌గా కులం ఆపాదించి మాట్లాడడం దారుణం. మా పార్టీ అధినేత, మాజీ సీఎం శ్రీ వైయస్ జగన్, ఆ కుటుంబాన్ని పరామర్శించే వరకు, లాకప్‌డెత్ కేసులో ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరించింది. ఆ తర్వాత మొక్కుబడిగా సీఐపై కేసు, అరెస్టు తతంగాన్ని కొనసాగించారు. రాష్ట్రంలో చట్టబద్ధమైన వ్యవస్థ పతనం: లాకప్‌డెత్‌కు గురైన సాయికృష్ణకు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉందంటూ తప్పుడు వాదనలు తీసుకువస్తున్నారు. ‘తప్పు చేస్తే శిక్షించడానికి న్యాయవ్యవస్థ ఉంది. కానీ పోలీసులే చంపేసి బూడిద చేస్తారా? పోలీస్ స్టేషన్‌కు వెళ్తే తిరిగి వస్తామా? లేదా? అనే భయాన్ని ఈ ప్రభుత్వం సృష్టిస్తోంది’. లాకప్‌డెత్‌లో ప్రధాన నిందితుడు సీఐ నాగరాజును కాపాడుతూ, తొలుత అతణ్ని కేవలం వీఆర్‌కు మాత్రమే పంపారు. ఆ తర్వాత ఈ ఘటన తీవ్ర కలకలం రేపడంతో, సస్పెండ్ చేసి, కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కూడా అరెస్టుకు 4 రోజులు తీసుకున్నారు. ఇక సీఐ రిమాండ్ రిపోర్టు అంతా నామమాత్రం. మొత్తం మీద ఈ కేసులో పెద్ద తలకాయలను తప్పిస్తూ, ప్రభుత్వం డ్రామా చేస్తోంది. వారెందుకు నోరు విప్పడం లేదు?: ఎక్కడైనా గంజాయి దొరికినా, చివరకు ఫ్లెక్సీల వద్ద అభిమానంతో జంతుబలి ఇచ్చినా, రయ్‌మంటూ పరుగెత్తుకొచ్చి ప్రెస్‌మీట్లు పెట్టే హోం మంత్రి అనిత, విజయవాడ లాకప్‌డెత్‌పై నోరు విప్పడం లేదు. ప్రశ్నిస్తారనో ఏమో.. కనీసం మీడియా ముందుకు కూడా రావడం లేదు. ఇంకా సకల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేష్ కూడా విజయవాడ లాకప్‌డెత్‌పై నోరెత్తడం లేదు. అందుకు కారణం ఒక్కటే. లాకప్‌డెత్ నిజం. పోలీసులు సాయికృష్ణను చంపేసి, కాల్చి బూడిద చేసింది కూడా నిజం. సీబీఐ దర్యాప్తు జరగాలి. పోలీసులూ ఇకనైనా వైఖరి మార్చుకొండి: కృష్ణ లంక పీఎస్‌లో లాకప్‌డెత్ కేవలం ఒక సీఐ చేసిన హత్య కాదు. అందులో విజయవాడ నగర కమిషనర్, డీజీపీ ప్రమేయం కూడా ఉంది. అందుకే ముందు వారిపై తగిన చర్యలు తీసుకోవాలి. వారిపైనా కేసు పెట్టి అరెస్టు చేయాలి. ఇంకా ఈ కేసులో వాస్తవాలన్నీ వెలుగులోకి రావాలంటే, వెంటనే సీబీఐతో దర్యాప్తు జరిపించాలి. రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ తెచ్చిన ’రెడ్ బుక్ రాజ్యాంగం’ వల్లే పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది. అధికారులు చట్టానికి లోబడి పని చేయాలి. రేపటి రోజున మిమ్మల్ని కాపాడటానికి చంద్రబాబు, లోకేష్ రారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఆధికారంలో ఉన్న వారి మాటలు నమ్మి వారు చెప్పినట్లు చేద్దామన్న ఆలోచన పోలీస్ శాఖలో ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ప్రజలుకు పోలీస్ వ్యవస్థ మీద గౌరవం పోయింది. ఆ గౌరవాన్ని తిరిగి నిలబెట్టుకోవడం చిన్న విషయం కాదు. సీసీ కెమెరా పుటేజీ ఎలా మాయం?: కృష్ణలంక పీఎస్‌లో సీసీటీవీ ఫుటేజ్ లేదనడం అత్యంత బాధ్యతారాహిత్యం. కేవలం హోంమంత్రి కమిషన్ల కోసమే కోట్లు ఖర్చు పెట్టి కెమెరాలు పెట్టించారా? 70 వేల కెమెరాలు రికార్డు కాకపోతే ఉంటే ఎంత? పోతే ఎంత? ప్రయోజనం లేనప్పుడు కోట్లు ఖర్చు చేయడం ఎందుకు? ఇవన్నీ ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలని, వాటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని అమర్‌నాథ్ తేల్చి చెప్పారు.