అనపర్తి: కూటమి పార్టీ కార్యకర్త చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికే తనపై బురదజల్లే రాజకీయాలకు పాల్పడుతున్నారని అనపర్తి నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మండిపడ్డారు. ఇటీవల ఫైనాన్స్ వ్యాపారులకు తాను వ్యతిరేకినని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రామకృష్ణారెడ్డి అబద్ధాలు ఆడుతున్నారని, ఆయన గత చరిత్ర ప్రజలందరికీ తెలుసునని సూర్యనారాయణ రెడ్డి అన్నారు. ఒక పేద కుటుంబానికి చెందిన అమాయకులను వేధించిన తన కార్యకర్త తప్పును కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సామాన్య ఫైనాన్స్ వ్యాపారస్తులు ఎవరూ అలా వ్యవహరించరని, ఎమ్మెల్యే అండదండలు చూసుకుని ఆ కార్యకర్త ఆ విధంగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. బాధ్యతగల ప్రజాప్రతినిధిగా తన కార్యకర్తను మందలించి బాధితులకు క్షమాపణ చెప్పించాల్సింది పోయి, మొత్తం ఫైనాన్స్ వ్యాపారస్తులపై ముద్ర వేయడం రామకృష్ణారెడ్డి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు. తాము ఫిర్యాదు చేసిన తర్వాత ఎస్సై చొరవ తీసుకుని బాధితులకు న్యాయం చేశారని, కానీ ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డి ఎలాంటి సహాయం చేయలేదని ఎద్దేవా చేశారు. 2014 నుంచి 2019 వరకు రామకృష్ణారెడ్డి హయాంలో జరిగిన కాల్‌మనీ వ్యవహారాలను ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి గుర్తు చేశారు. తనకు వ్యతిరేకంగా ఉన్న ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసులతో దాడులు చేయించారని, తనకు అనుకూలంగా ఉన్న వారిపై మాత్రం చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఫైనాన్స్ వ్యాపారస్తులు సమావేశాలు నిర్వహించాలనుకున్నా కేసులు పెడతామని బెదిరించిన చరిత్ర ఆయనదేనని విమర్శించారు. కమిషన్ల కోసం ఫైనాన్స్ వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టిన మచ్చ రామకృష్ణారెడ్డి నుంచి ఎప్పటికీ పోదని, అదే మచ్చను కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు తనపై ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనను ఫైనాన్స్ వ్యాపారస్తులకు స్వర్ణయుగంగా అభివర్ణించిన సూర్యనారాయణ రెడ్డి, కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాల వల్ల ప్రజల చేతిలో డబ్బు ఉండేదని, అప్పులు సకాలంలో చెల్లించడంతో మనీ రొటేషన్ సజావుగా సాగిందని తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కెట్లో మనీ రొటేషన్ పూర్తిగా నిలిచిపోయిందని, ఫైనాన్స్ వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వైయస్ఆర్‌సీపీ సానుభూతిపరులైన ఫైనాన్స్ వ్యాపారస్తుల బాకీలను ఎగ్గొట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వ్యాపారాల్లో జోక్యం చేసుకుంటూ కమిషన్ల కోసం రామకృష్ణారెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, వైఎస్ జగన్ పాలనలో ఎలా ఉన్నాయో ప్రజలకు బాగా తెలుసని పేర్కొన్నారు. ఇకనైనా రామకృష్ణారెడ్డి విషయ పరిజ్ఞానంతో మాట్లాడాలని, 2014-19 మధ్యకాలంలో ఫైనాన్స్ వ్యాపారస్తులకు జరిగిన అన్యాయాలపై క్షమాపణ చెప్పిన తర్వాతే వారి గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయనకు ఉంటుందని డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి హితవు పలికారు.