అమరావతిలో అవినీతి బహిర్గతమవుతుందనే దాడులు

చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్‌లోనే అరాచకాలు: అనంత వెంకటరామిరెడ్డి

అనంతపురం: రాజధాని అమరావతి పేరుతో భారీ స్థాయిలో అవినీతి జరుగుతోందని, ఆ అక్రమాలు బయటపడతాయనే భయంతోనే రైతులు, రైతు పరిరక్షణ కమిటీ నాయకులు, వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని వైయ‌స్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. రాజధానికి భూములు ఇవ్వని రైతులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, చివరకు వారి పొలాల్లోకి నీటిని మళ్లించి సాగును దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల రాజధాని ప్రాంత రైతులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసి తమ సమస్యలను వివరించి న్యాయం చేయాలని కోరడంతో రైతు పరిరక్షణ కమిటీ ఏర్పాటైందన్నారు.

రైతుల ఆహ్వానం మేరకు వారి భూములను పరిశీలించేందుకు శనివారం రైతు పరిరక్షణ కమిటీ నేతలు, వైయ‌స్ఆర్‌సీపీ బృందం వెళ్లగా ఉండవల్లిలో టీడీపీ మూకలు రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడటం అత్యంత దుర్మార్గమన్నారు. రైతుల సమస్యలను పరిశీలించేందుకు వెళ్లిన వారిపై పోలీసుల సమక్షంలోనే దాడులు జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటి వరకు ఏ న్యాయం జరిగిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలియకుండా చేయడానికే టీడీపీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేసే చర్యలకు దిగుతున్నాయని ఆరోపించారు.

ఈ దాడుల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రత్యక్ష ప్రోత్సాహం ఉందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రశ్నించే గొంతులను అణచివేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రాజధాని ప్రాంతంలో అన్యాయానికి గురవుతున్న రైతులకు వైయ‌స్ఆర్‌సీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, వారి హక్కుల పరిరక్షణ కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు.
 

Back to Top