విజయవాడ: నగరంలో తీవ్ర కలకలం రేపిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంపై హోం మంత్రి వంగలపూడి అనిత రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఈ ఘటనపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలంటూ శనివారం గాంధీనగర్ ధర్నాచౌక్ వద్ద మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, విజయవాడ నగరంలో పౌరహక్కుల హరణ జరుగుతోందని, గత రెండేళ్లుగా అక్రమ కేసులు, అరెస్టులతో రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గాదె సాయికృష్ణ అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్‌లోనే కొట్టి చంపారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ లాకప్ డెత్ ఘటనపై మాకు శాఖాపరమైన విచారణల మీద గానీ, సిట్ విచారణల మీద గానీ ఎలాంటి నమ్మకం లేదనీ, తప్పు చేసిన అధికారులపై విచారణకు మళ్లీ పోలీసులనే నియమించడం ఏంటి? వరుస బదిలీలతో కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రాథమిక దశలోనే సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని, పత్రికలకు తప్పుడు లీకులు ఇస్తూ డ్రామాలు ఆడుతున్నారన్నారు. ఇది రాజకీయాల కోసం చేస్తున్న పోరాటం కాదు.. బాధితులకు న్యాయం జరిగే వరకు మానవీయ కోణంలో చేసే పోరాటం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజల పక్షాన నిలబడి, బాధితురాలికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం ఆపదనీ హెచ్చరించారు. తక్షణమే ఈ కేసును సీబీఐకి అప్పగించాలి, హోం మంత్రి తన పదవికి రాజీనామా చేయాలనీ ఆయన తెలిపారు. శవాన్ని అత్యంత రహస్యంగా మాయం చేయడం ఈ కేసులో అత్యంత సంచలనమైన విషయం శవాన్ని అదృశ్యం చేసిన తీరు పోలీస్ స్టేషన్‌లో వ్యక్తి చనిపోయినప్పుడు చట్టప్రకారం నిర్వహించాల్సిన ఎలాంటి పంచనామా ఇన్క్వెస్ట్ నిర్వహించలేదనీ, పైగా, ఆ మృతదేహాన్ని బస్టాండ్‌లో దొరికిన ఒక అనాథ శవంగా చిత్రీకరించి, ఎవరికీ తెలియకుండా అత్యంత రహస్యంగా దహన సంస్కారాలు ముగించేశారనే ఆరోపణ తీవ్ర కలకలం రేపుతోందన్నారు. తన కొడుకు కనిపించడం లేదని, అసలు ఏం జరిగిందో చెప్పాలని సాయికృష్ణ తల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ప్రాధేయపడితే... అక్కడ ఉన్న పోలీసులు అత్యంత కఠినంగా, అమానవీయంగా సమాధానం ఇచ్చారన్నారు. నీ కొడుకు చనిపోయాడు.. ఫోటోకి దండ వేసుకో పో అంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం ఈ ఘటనలో పోలీసుల క్రూరత్వానికి అద్దం పడుతోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన, సీసీ ఫుటేజీల మాయం కేసులో అసలు నిజాలు బయటపడకుండా చేసేందుకు వ్యవస్థాత్మకమైన ప్రయత్నం జరిగిందనే అనుమానాలు బలంగా ఉన్నాయని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పోలీస్ స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజీలను కనీసం 18 నెలల పాటు భద్రపరచాలన్నారు. కానీ, ఈ కేసును తారుమారు చేసేందుకు సదరు పోలీస్ స్టేషన్‌తో పాటు, సాయికృష్ణను తీసుకెళ్లినట్లు చెబుతున్న హోటల్, హాస్పిటల్‌కు సంబంధించిన కీలకమైన సీసీటీవీ ఫుటేజీలను ఎవరి అనుమతి లేకుండానే మాయం చేశారనేది అతిపెద్ద సంచలనంగా మారిందన్నారు. విచారణాధికారుల వరుస బదిలీలు, సాక్ష్యాల తారుమారు ఈ ఘటనపై విమర్శలు రావడంతో ప్రభుత్వం సిట్ లేదా అంతర్గత విచారణకు ఆదేశించినప్పటికీ, ఆ విచారణాధికారులను వరుసగా బదిలీలు చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రాథమిక దశలోనే సాక్ష్యాలను పూర్తిగా తారుమారు చేసేందుకు, కేసును పక్కదారి పట్టించేందుకే ఈ బదిలీల డ్రామా ఆడుతున్నారని, శాఖాపరమైన విచారణల వల్ల న్యాయం జరగదని బాధితులు భావిస్తున్నారన్నారు. పోలీసులే స్వయంగా తప్పు చేసి, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి కోర్టులకు తప్పుడు రిమాండ్ రిపోర్టులను సమర్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, అలాగే నిజాలను డైవర్ట్ చేయడానికి, సాయికృష్ణ క్యారెక్టర్‌ను తప్పుగా చూపేలా మీడియాకు కావాలనే కొన్ని లీకులు ఇస్తూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఒక పక్క ప్రాథమిక సాక్ష్యాలైన సీసీ ఫుటేజీలు మాయమవడం, మరోపక్క శవాన్ని అనాథ శవంగా దహనం చేయడం వంటి అంశాలు ఈ కేసు వెనుక పెద్ద పెద్ద తలకాయల హస్తం ఉందనే అనుమానాలను బలపరుస్తున్నాయని, అందుకే ఈ కేసులో నిజాలు నిగ్గుతేలాలంటే సీబీఐ లాంటి స్వతంత్ర సంస్థతోనే విచారణ జరిపించాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ఆవుతు శ్రీ శైలజ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, వై యస్ ఆర్ సీపీ విజయవాడ సెంట్రల్ ఉపాధ్యక్షులు యర్రగొర్ల శ్రీరాములు, రాష్ట్ర వికలాంగుల అధ్యక్షుడు బండి కిరణ్ రాజు, విద్యార్థి విభాగం A రవిచంద్ర ,విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ SC సెల్ అధ్యక్షులు గుడిసె శ్యామ్ బాబు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గుండె సుందర్ పాల్, రైతు విభాగం కార్యదర్శి వెన్నం రత్నారావు,23 వ డివిజన్ అధ్యక్షులు చల్లా సుధాకర్, మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ నజీర్, యూత్ వింగ్ అధ్యక్షులు మాత మహేష్,25 వ డివిజన్ అధ్యక్షులు బంకా వెంకటేష్,26 వ డివిజన్ అధ్యక్షులు కోలా నాగాంజనేయులు,ysr cp పసుపులేటి కోటేశ్వరరావు,29 వ డివిజన్ అధ్యక్షులు కంభం కొండలరావు,28 వ డివిజన్ అధ్యక్షులు కనపర్తి కొండా, వై యస్ ఆర్ సీపీ నాయకులు ఇసరపు రాజు,57వ డివిజన్ అధ్యక్షులు కాళ్ళ ఆదినారాయణ ,58 వ డివిజన్ అధ్యక్షులు రాజా రెడ్డి,62 వ డివిజన్ అధ్యక్షులు Ch రామిరెడ్డి, 63 వ డివిజన్ అధ్యక్షులు మాన్యం జగదీష్, క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి ఏసు, క్లస్టర్ ఇంచార్జ్ భోగాది మురళి, క్లస్టర్ ఇంచార్జ్ పిల్లుట్ల వంశీ, 30 వ డివిజన్ అధ్యక్షులు దొంతుబోయిన దుర్గారావు, రాష్ట్ర ,జిల్లా ,నియోజకవర్గ , వివిధ విభాగాల అధ్యక్షులు మహిళా కార్యకర్తలు మహిళా నాయకురాలు వై యస్ ఆర్ సీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు