గాదె సాయికృష్ణది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.

పోలీస్ బాసులను, రాజకీయ సూత్రధారులను రక్షించేందుకే సిట్ డ్రామాలు

వైయ‌స్ఆర్‌సీపీ  లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌ రెడ్డి ధ్వజం.

తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహరరెడ్డి.

మే 25 నాటికి సీసీటీవీలు పనిచేస్తున్నాయన్న ప్రభుత్వం

రిమాండ్ రిపోర్టులో సీసీ పుటేజ్ లేదనడం  కోర్టును తప్పుదోవ పట్టించడమే.

సాయికృష్ణ తల్లి ఫోన్ లాక్కొని, 15 రోజుల డేటా డిలీట్ చేయడం చట్టవిరుద్ధం

సాక్ష్యాల ధ్వంసం కింద పోలీసులపైనే కేసు పెట్టాలి.

సాయికృష్ణ కేసును తక్షణమే సీబీఐకి  అప్పగించాలి

మనోహర్ రెడ్డి డిమాండ్

తాడేపల్లి: గాదె సాయికృష్ణ లాకప్‌డెత్, శవం మాయం ఉదంతంలో పోలీసు ఉన్నతాధికారులను, వారి వెనుక ఉన్న రాజకీయ పెద్దలను రక్షించేందుకు ప్రభుత్వం క్రూరమైన కుట్రలు చేస్తోందని వైయస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, ఈ హత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని, బాధ్యులను తప్పించేందుకు వ్యవస్థలన్నీ కుమ్మక్కై 'కంటితుడుపు' దర్యాప్తు చేస్తున్నాయని మండిపడ్డారు. బాధితురాలైన తల్లి గాదె విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదును పక్కనపెట్టి, కేవలం ఒకే ఒక్క సీఐపై తూతూమంత్రంగా 302 కేసు పెట్టి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే...

- టాస్క్ ఫోర్స్ ప్రమేయం వెనుక పెద్దల హస్తం – భూ వివాదాలే కారణం?

సాధారణంగా ఒక నిందితుడిపై నాన్-బెలబుల్ వారెంట్ (NBW) ఉంటే, సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) లేదా స్థానిక పోలీసులు వెళ్లి పట్టుకోవాలి. కానీ, సాయికృష్ణ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా టాస్క్ ఫోర్స్ రంగంలోకి ఎందుకు దిగిందో సమాధానం చెప్పాలి. మే 5వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్కాపురం వెళ్లి సాయికృష్ణను తీసుకొచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో రాశారు, అయితే సిటీ కమిషనర్ లేదా ఏసీపీ ఆదేశాల కాపీ ఎక్కడా లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. జగ్గయ్యపేటకు సంబంధించిన ఒక పెద్ద భూ వివాదంలో కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందని, వారి కోసమే టాస్క్ ఫోర్స్‌ను అక్రమంగా ఉపయోగించి సాయికృష్ణను మట్టుబెట్టారని ప్రజల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది. 

- తల్లి ఫోన్ డేటా డిలీషన్ – నిస్సిగ్గుగా సాక్ష్యాల ధ్వంసం..
 
"కొడుకుని చూపించమని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బాధిత తల్లికి సహాయం చేయాల్సింది పోయి, ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్‌ను పోలీసులు అక్రమంగా లాక్కున్నారు. 15 రోజుల పాటు తమ వద్దే ఉంచుకుని, అందులోని డేటా మొత్తాన్ని డిలీట్ చేసి తిరిగి ఇచ్చారు. ఇది చట్టప్రకారం నేరం. సాక్ష్యాలను ఉద్దేశపూర్వకంగా తుడిచిపెట్టే ప్రయత్నం చేసిన పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి". అలాగే మే 7, 8 తేదీల్లో సాయికృష్ణ లాకప్‌లో ఉన్నాడని ఒక ఎస్సై చూసినట్లు రాయడం మినహా రిమాండ్ రిపోర్టులో ఎలాంటి బలమైన అంశాలు లేవన్నారు. పోలీసు అధికారులు ప్రతిరోజూ సమర్పించే 'డైలీ స్టేటస్ రిపోర్ట్'లో కానీ, స్టేషన్ జనరల్ డైరీలో కానీ చట్టప్రకారం చేయాల్సిన ఎంట్రీలు ఎందుకు చేయలేదు. 

- మే 25 నాటికి కెమెరాలన్నీ పక్కా.. జూన్ రిమాండ్ రిపోర్టులో మాయం. 

విజయవాడ నగరంలో సీసీటీవీలు పనిచేస్తున్నాయా లేదా అని మల్లేమూడి సతీష్ బాబు అనే అడ్వకేట్ సమాచార హక్కు చట్టం (RTI) కింద దరఖాస్తు చేయగా, మే 25, 2026 న పోలీస్ శాఖ (PIO) అధికారికంగా లిఖితపూర్వక సమాధానం ఇస్తూ... విజయవాడ కమిషనరేట్ పరిధిలో సీసీటీవీలన్నీ పద్ధతి ప్రకారం సక్రమంగా పనిచేస్తున్నాయని, తాము రెగ్యులర్‌గా మానిటర్ చేస్తున్నామని పోలీసులే స్వయంగా ఒప్పుకున్నారన్నారు.

"మే 25 నాటికి కెమెరాలన్నీ పక్కాగా పనిచేస్తున్నప్పుడు.. మే మొదటి వారంలో జరిగిన సాయికృష్ణ లాకప్‌డెత్ ఫుటేజ్ రికార్డుల్లో భద్రంగా ఉన్నట్టే కదా? మరి జూన్ 19 తర్వాత కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో 'ఫుటేజ్ ఏమీ లేదు, అంతా డిలీట్ అయింది' అని రాయడం కోర్టును సైతం దారుణంగా తప్పుదోవ పట్టించడమే". 

మూడంచెల వ్యవస్థ, క్లౌడ్ స్టోరేజ్ డేటా ఏమైంది?
సుప్రీంకోర్టు 'పరంవీర్ సింగ్ సైనీ' జడ్జిమెంట్ మార్గదర్శకాల ప్రకారం.. 
జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో కూడా స్వతంత్ర కమిటీలు (SLOC, DLOC) ఉండాలి, ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఆడియో-వీడియో రికార్డింగ్ సౌకర్యంతో 12-14 కెమెరాలు ఉండాలి.  కృష్ణలంక పోలీస్ స్టేషన్ కెమెరాలు నేరుగా 'కమాండ్ కంట్రోల్ రూమ్'కు, ఆర్టీజీఎస్ (RTGS)కు, డీజీపీ ఆఫీస్‌కు అనుసంధానమై ఉంటాయి. ఈ మూడంచెల వ్యవస్థలో  అన్ని చోట్లా ఫుటేజ్ ఎలా మాయమవుతుంది?. ఈ కెమెరాలను నిర్వహిస్తున్న 'మాట్రిక్స్ కంపెనీ' క్లౌడ్ స్టోరేజ్‌లో 90 రోజుల పాటు ఫుటేజ్ భద్రంగా ఉంటుంది, సిట్ అధికారులు ఆ క్లౌడ్ డేటాను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? అసలు ఫుటేజ్‌ను డిలీట్ చేసి, సర్వర్లలో వేరే డేటాను నింపి కప్పిపుచ్చే ప్రయత్నంచేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆడిట్ లాగ్ ద్వారా ఏ యూజర్ ఐడీ నుంచి డేటా డిలీట్ అయిందో తెలుసుకోవచ్చు, దీనిని ఫోరెన్సిక్ (FSL) కు పంపి రికవర్ చేయడంలో దర్యాప్తు అధికారులు ఎందుకు ముందడుగు వేయడం లేదు?

- ఏఐ మాట్రిక్స్ కెమెరాలు, డ్రోన్ల డబ్బాలు ఎవరి కోసం?

ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో కూడిన 'మాట్రిక్స్ కెమెరాలు' పెట్టామని, నెంబర్ ప్లేట్ ఆధారంగా వాహనాల కదలికలను కనిపెడతామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. అలాంటప్పుడు నగరంలోకి సాయికృష్ణను తెచ్చిన ఆనుపానులు, శవాన్ని తీసుకెళ్లిన ఆనుపానులు, అలాగే శవాన్ని 'స్వర్గపురి' శ్మశాన వాటికలో దహనం చేశారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో.. ఆయా పరిసరాల్లోని కెమెరాల ఫుటేజ్ ఏమైంది? ఒక చెట్టు కింద కూర్చుని గంజాయి తాగినా డ్రోన్లతో పట్టుకుంటామని ప్రగల్భాలు పలికే హోంమంత్రి గారు.. సాక్షాత్తూ పోలీస్ స్టేషన్ లోనే హత్య జరిగి శవం మాయమైతే ఎందుకు నోరు మెదపడం లేదు?". నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గానీ, హోంమంత్రి గానీ ఇంతవరకు ఈ హత్యపై ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? 

- సీబీఐ విచారణే ఏకైక పరిష్కారం..

ఈ నేపధ్యంలో మృతుని తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు అంగీకరిస్తూ.. హార్డ్ డిస్క్‌లు, సీసీటీవీ ఫుటేజ్ పరికరాలను ప్రొడ్యూస్ చేయాలని, అలాగే భారతి ఎయిర్‌టెల్ సిమ్ కార్డుల కాల్ డేటా రికార్డ్స్ (CDR), టవర్ లొకేషన్ల వివరాలను సమర్పించాలని ఆదేశించినా పోలీసులు ఇంతవరకు స్పందించకపోవడం వారి నేరాన్ని అంగీకరించినట్లే.ప్రస్తుతం అమలులోకి వచ్చిన బీఎన్ ఎస్ ఎస్ ప్రకారం కస్టోడియల్ డెత్‌లపై జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ విచారణ జరగాల్సి ఉండగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాయిదాలు కోరుతూ కాలయాపన చేస్తున్నారు. 

ఈ నేపధ్యంలో తమ కొడుకు శవాన్ని కాల్చి బూడిద కూడా లేకుండా మాయం చేశారని ఓ తల్లి గర్భశోకంతో ఏడుస్తోందని, ఆమెకు న్యాయం జరగాలన్నా, నిజాలు బయటకు రావాలన్నా ఈ కేసును తక్షణమే సీబీఐ (CBI) కి అప్పగించాలని మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాధితుల తరఫున న్యాయస్థానాల్లో మరియు ప్రజాక్షేత్రంలో వైయస్సార్సీపీ  పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని మనోహర్‌రెడ్డి హెచ్చరించారు.

Back to Top