తాడేపల్లి: ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత కె. భాగ్యరాజ్ గారి మరణం బాధాకరమని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ పేర్కొన్నారు. రచయితగా, సహాయ నటుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించి, తన ప్రతిభతో తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా, హీరోగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న భాగ్యరాజ్ గారు భారతీయ సినీ రంగంపై చెరగని ముద్ర వేశారని వైయస్ జగన్ కొనియాడారు. ఆయన దర్శకత్వం వహించిన, కథ-స్క్రీన్‌ప్లే అందించిన అనేక చిత్రాలు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రీమేక్ అయి ఘన విజయాలు సాధించడం ఆయన సృజనాత్మకతకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రేమ, కుటుంబ బంధాలు, మానవీయ విలువలను తన చిత్రాల్లో హృద్యంగా ఆవిష్కరించి ఒక తరం ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న అరుదైన సినీ వ్యక్తిత్వం భాగ్యరాజ్ గారని వైయస్ జగన్ అన్నారు. "కె. భాగ్యరాజ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సినీ పరిశ్రమకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని శ్రీ వైయస్ జగన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.