కేవీఆర్, రావణ్‌కు న్యాయ సహాయం

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం

రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఆ చర్య

ఎం.మనోహర్‌రెడ్డి వెల్లడి 

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి.

తప్పుడు కేసులు. యథేచ్ఛగా ప్రజాస్వామ్యం అణిచివేత

రాజ్యహింసకు వ్యతిరేకంగా వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం

డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే రావణ్‌ అరెస్ట్‌ 

ఎం.మనోహర్‌రెడ్డి స్పష్టీకరణ 

జనసేన, వైయ‌స్ఆర్‌సీపీ మధ్య ఘర్షణకు చంద్రబాబు వ్యూహం

ఆ దిశలోనే రావణ్ వైయ‌స్ఆర్‌సీపీ వ్యక్తిగా ఎల్లో మీడియా ప్రచారం

ప్రభుత్వానికి పోలీసులే పొలిటికల్‌ ఏజెంట్లు అవుతున్నారు

ప్రెస్‌మీట్‌లో ఎం.మనోహర్‌రెడ్డి ఆక్షేపణ

తాడేపల్లి:     తప్పుడు కేసులతో ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తుంటే ప్రతిపక్ష వైయ‌స్ఆర్‌సీపీ మౌనంగా ఉండబోదని, రాజ్యాంగ పరిరక్షణ కోసమే తెలంగాణ జర్నలిస్ట్‌ కేవీఆర్, యూట్యూబర్‌ రావణ్‌కు న్యాయ సహాయం అందించడానికి వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ ముందుకొచ్చిందని పార్టీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి వెల్లడించారు. ఆ ఇద్దరితో పార్టీకి ఏ సంబంధం లేకపోయినా నైతిక మద్ధతిస్తున్నట్టు ఆయన తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వానికి పోలీసులు పొలిటికల్‌ ఏజెంట్లుగా మారిన నేపథ్యంలో వీటన్నింటినీ ఎదుర్కోవాల్సిన బాధ్యత తమపై ఉందని, రాజ్యహింసకు వ్యతిరేకంగా వైయ‌స్ఆర్‌సీపీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. రావణ్‌ను వైయ‌స్ఆర్‌సీపీవ్యక్తిగా చిత్రీకరించి.. జనసేన, వైయ‌స్ఆర్‌సీపీ మధ్య ఘర్షణ వాతావరణం çసృష్టించాలన్నదే చంద్రబాబు వ్యూహమని చెప్పారు.
    అమరావతి నిర్మాణంలో అవినీతి, మావిగన్‌పై జరుగుతున్న చర్చ, డీఎస్సీ–2025 స్కామ్, దారుణంగా క్షీణించిన శాంతిభద్రతలు, గాదె సాయికృష్ణ లాకప్‌ డెత్‌ వంటి అంశాల నుంచి డైవర్షన్‌ కోసమే ఆ అరెస్టులు జరిగాయని ఎం.మనోహర్‌రెడ్డి తెలిపారు. ఇంకా వ్యూహాత్మకంగా పవన్‌కళ్యాణ్‌ను ముందు పెట్టి చంద్రబాబు తెరవెనుక దాక్కోవాలని చూస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎం.మనోహర్‌రెడ్డి ఆక్షేపించారు.
ప్రెస్‌మీట్‌లో ఎం.మనోహర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

పోలీస్‌ స్టేషన్‌కి రావాలంటే ప్రజలు భయపడుతున్నారు:
    కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలు తమ బాధలు చెప్పుకోవడానికి పోలీస్‌ స్టేషన్‌కి రావాలంటేనే భయపడే పరిస్ధితులు కల్పించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న ప్రతిపక్షం గొంతు నొక్కడానికి, రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులను ఉపయోగిస్తున్నారు. గాదె సాయికృష్ణ లాకప్‌ డెత్‌ తర్వాతైనా పోలీసుల తీరులో మార్పు వస్తుందేమోనని ప్రజలు భావించారు. బూడిద కూడా దొరక్కుండా సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేయడం, కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో సీసీ టీవీ ఫుటేజ్‌లు మాయం కావడం వెనుక డీజీపీ స్థాయి అధికారి నుంచి కింది స్థాయి అధికారుల పాత్ర ఉందన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. ప్రజల భద్రతకు కాపలాగా ఉండాల్సిన పోలీసులు, చంద్రబాబు రాజకీయ క్రీడలో పాత్రధారులుగా మారిపోయారు. అధికార పార్టీ పొలిటికల్‌ ఏజెంట్లు అన్నట్టు చెప్పకనే చెబుతున్నారు.

సంఘర్షణకు చంద్రబాబు కుట్ర:
    గాదె సాయికృష్ణ లాకప్‌ డెత్‌ నేపథ్యంలో ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి యూట్యూబర్లను అక్రమ కేసులతో వేధిస్తున్నారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే తెలంగాణకు చెందిన జర్నలిస్టు కేవీ రెడ్డి, ప్రశ్న పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ నడుపుతున్న రావణ్‌ను తీవ్రంగా హింసిస్తున్నారు. కేవీఆర్, రావణ్‌  కేసుల్లో చట్టప్రకారం వ్యవహరించకుండా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వారిని వైయ‌స్ఆర్‌సీపీ వారిగా చిత్రీకరించి రాజకీయ ప్రయోజనం పొందాలని ఎల్లో మీడియా తాపత్రయపడుతోంది. మరోవైపు జనసేన పార్టీ వారి కార్యకర్తలను పోలీస్‌ స్టేషన్‌ల మీదకు పంపించి ఘర్షణ వాతావరణం క్రియేట్‌ చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు.

తెర వెనుక దాక్కుంటున్న చంద్రబాబు:
    రావణ్‌ను మొదట పిఠాపురంలో అరెస్ట్‌ చేస్తే కోర్టు రిమాండ్‌ రిజెక్టు చేసింది. ఆ వెంటనే కాకినాడ సర్పవరం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అక్కడా రిమాండ్‌ రిజెక్టు కావడంతో తర్వాత మచిలీపట్నంలోనూ రిజెక్టు చేయడంతో పాయకరావుపేట దగ్గర నక్కపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. రావణ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉండగా జనసేన కార్యకర్తలు అక్రమంగా ప్రవేశించి ఆయనపై దాడికి ప్రయత్నించారు. స్వయంగా హోం మంత్రి ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. రావన్‌ని వైయ‌స్ఆర్‌సీపీ వ్యక్తిగా చిత్రీకరించి.. జనసేన, వైయ‌స్ఆర్‌సీపీ మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించాలన్నదే చంద్రబాబు వ్యూహం. ఇంకా డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా పవన్‌కళ్యాణ్‌ను, ఆయన కుటుంబ సభ్యులను ముందు పెట్టి తెరవెనుక దాక్కోవాలని చంద్రబాబు చూస్తున్నాడు. 

ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తుంటే మౌనంగా ఉండలేం:
    వరుస లాకప్‌ డెత్‌లు, శవాల మాయం, పోలీస్‌ స్టేషన్‌లపై దాడులు, కులం రంగు పులుముతున్న పరిణామాలు, రాజకీయ ప్రేరేపిత అక్రమ అరెస్టులు ఇవన్నీ కలిసి రాష్ట్రాన్ని ప్రజాస్వామ్య రాష్ట్రంగా కాకుండా ఆటవిక రాజ్యంగా, జంగిల్‌రాజ్‌గా మార్చేసిందని ప్రజలు కూడా ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ పరువు పోతోంది. అయినా కోర్టు ఆదేశాలను లెక్క చేయడం లేదు. తెలంగాణ జర్నలిస్ట్‌ కేవీఆర్‌ తోకానీ, యూట్యూబర్‌ రావన్‌తో కానీ వైయ‌స్ఆర్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదు. అయితే ఈ ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తప్పుడు కేసులతో ప్రజాస్వామ్యాన్ని అణచి వేయాలనుకుంటే  ప్రతిపక్షంగా మేం మౌనంగా ఉండలేం. చంద్రబాబు ప్రభుత్వానికి పోలీసులు పొలిటికల్‌ ఏజెంట్లుగా మారిన నేపథ్యంలో వీటన్నింటినీ ఎదుర్కోవాల్సిన బాధ్యత మాపై ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణ, చట్ట పరిరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఖచ్చితంగా ముందుకొచ్చి వారిద్దరికీ వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌గా సాయం చేస్తుంది. నైతికంగా మద్ధతిస్తాం. రాజ్యహింసకు వ్యతిరేకంగా వైయ‌స్ఆర్‌సీపీ పోరాడుతూనే ఉంటుంది.

అధికార పార్టీ ఎమ్మెల్యేల దూషణలపై కేసులుండవా?:
    అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు అసహ్యంగా మాట్లాడిన కేసులు పెట్టడం లేదు. న్యాయవాదులను, రిటైర్డ్‌ న్యాయమూర్తులను దూషించినా కేసులు నమోదు చేయడం లేదు. గతంలో పార్టీ సమావేశంలో చెప్పులు చూపించిన పవన్‌ కళ్యాణ్, బూతులు, అసభ్య పదజాలం వాడటంలో ట్రెండ్‌ సృష్టించాడు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని జనసైనికులు రెచ్చిపోతున్నారు. కాబట్టి పవన్‌ చెప్పే నీతి ప్రవచనాలు ముందుగా తన పార్టీ కార్యకర్తలకు చెప్పాలి. దాడులు చేసే కల్చర్‌కి ఆయనే ఫుల్‌ స్టాప్‌ పెట్టి తర్వాత మాట్లాడాలని ఎం.మనోహర్‌రెడ్డి తేల్చి చెప్పారు.

Back to Top