రావణ్‌కు వైయ‌స్ఆర్‌సీపీతో ఎలాంటి సంబంధం లేదు 

టీడీపీ అనుకూల వ్యక్తినే వైయ‌స్ఆర్‌సీపీకి ఆపాదించే కుట్ర 

 మాజీ మంత్రి కొడాలి నాని 

గుడివాడ: ప్రశ్న రావణ్‌కు వైయ‌స్ఆర్‌సీపీతో ఎలాంటి సంబంధం లేదని, ఆయన టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణలకు అనుకూలంగా వ్యవహరించే వ్యక్తేనని మాజీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. అయినప్పటికీ రావణ్‌ను వైయ‌స్ఆర్‌సీపీ వ్యక్తిగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేయడం వెనుక టీడీపీ, ఎల్లో మీడియా కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. గుడివాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.

రావణ్ ఎప్పుడూ టీడీపీ నాయకులపై విమర్శలు చేయలేదని, అందుకే టీడీపీ ఆయనపై గతంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని కొడాలి నాని అన్నారు. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా విమర్శలను ప్రజాస్వామ్య స్ఫూర్తితో స్వీకరించారని, ఎవరి గొంతునూ నొక్కే ప్రయత్నం చేయలేదని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపే వారిపై కొత్త చట్టాలను ప్రయోగిస్తూ జైళ్లకు పంపే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు.

గత ఏడాది కాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేసినందుకే రావణ్‌పై కక్ష సాధింపు చర్యలు ప్రారంభమయ్యాయని కొడాలి నాని ఆరోపించారు. జనసేన నాయకులు ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారని, కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత కూడా కొత్త చట్టాల పేరుతో వేధింపులకు దిగుతున్నారని విమర్శించారు. ప్రజల గొంతు నొక్కే ప్రయత్నాలు ఎంతకాలం కొనసాగవని, ఈ ప్రభుత్వ వైఖరికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

టీడీపీ అనుకూల ఎల్లో మీడియా, సోషల్ మీడియా వేదికల ద్వారా రావణ్‌ను వైయ‌స్ఆర్‌సీపీ వ్యక్తిగా చూపించే అసత్య ప్రచారం సాగుతోందని కొడాలి నాని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఈ ప్రచారాలను నమ్మవద్దని, వాస్తవాలు త్వరలోనే ప్రజలకు స్పష్టమవుతాయని పేర్కొన్నారు.
 

Back to Top